కాకినాడ, జూన్ 11 (ప్రజా అమరావతి);
పంటసాగు హక్కు పత్రాల (సీసీఆర్‌సీ)తో కౌలురైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ఫలాలు అందుతాయని ..
అందువల్ల జిల్లాలోని ప్రతి కౌలురైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా జూన్ 11 నుంచి 30 వరకు జరిగే పంటసాగు హక్కు పత్రాల (సీసీఆర్‌సీ) అవగాహన సదస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం పెదపూడి మండలంలోని కరకుదురు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు డా. సత్తి సూర్యనారాయణరెడ్డి, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ 11 నెలల కాల వ్యవధిగల సీసీఆర్‌సీ కార్డులతో వైఎస్సార్ ఉచిత పంటల బీమా, పెట్టుబడి రాయితీ, వైఎస్సార్ రైతు భరోసా, పంట రుణాలు, విత్తన రాయితీ, కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తుల సేకరణ ఇలా వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలు కౌలు రైతులకు అందుతాయని వివరించారు. కౌలు రైతులకు పంటపై మాత్రమే హక్కు ఉంటుందని, భూ యజమానులకు చిన్నపాటి ఇబ్బంది కూడా తలెత్తదని స్పష్టం చేశారు. భూ యజమానులకు పూర్తి భరోసా కల్పించేలా కొత్త చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని, అందువల్ల సీసీఆర్‌సీ కార్డుల జారీకి భూ యజమానులు సహకారభావంతో సహకరించాలని సూచించారు. భూ యజమానులు, కౌలు రైతులు పరస్పర సహకారంతో అడుగేస్తే ఇద్దరికీ ప్రయోజనం కలిగి రైతులు తద్వారా గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయన్నారు. అనారోగ్యం బారిన పడిన సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు ఎంతబాగా ఉపయోగపడుతుందో.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ఎలాంటి నష్టం వాటిల్లినా సీసీఆర్‌సీ కార్డు కౌలుదారునికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోందన్నారు. పంట బీమా కూడా ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు అందుతోందన్నారు. ఇటీవల జిల్లాలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులకు దాదాపు రూ.219 కోట్లు మేర లబ్ధిచేకూరిందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సీసీఆర్‌సీ కార్డులు జారీచేసిన జిల్లాగా తూర్పుగోదావరి నిలిచిందని, ఇప్పుడు కూడా భూయజమానులు, కౌలు రైతులు, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాను ముందు వరుసలో నిలపాలని సూచించారు. రైతులు ఎప్పటికప్పుడు రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే)ను సందర్శించి.. రిజిస్ట్రేషన్ చేయించుకొని వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, కార్యక్రమాల ద్వారా పూర్తిస్థాయిలో లబ్ధిపొందాలని కలెక్టర్ రైతులకు సూచించారు.
*ప్రతి కౌలు రైతు సీసీఆర్‌సీ తీసుకోవాలి: జేసీ(ఆర్) డా. జి.లక్ష్మీశ:*
ప్రతి కౌలు రైతు తప్పనిసరిగా సీసీఆర్‌సీ కార్డు పొందాలని.. అవగాహన లోపం, మరేదైనా కారణం వల్ల యజమాని ఆమోదం విషయంలో సమస్య ఏర్పడితే తక్షణం రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అక్కడి సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ సూచించారు. భూ యజమానులు మానవత్వం, సహకార స్ఫూర్తితో కౌలు రైతుల సంక్షేమానికి ముందుకు రావాలని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కౌలురైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు విజయవంతం కావడానికి కృషిచేయాలన్నారు. ఎవరికి కౌలుకు ఇచ్చినా వారికి కార్డు జారీ తప్పనిసరన్న విషయాన్ని యజమానులు గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలో గతంలో లక్ష వరకు కార్డులు జారీ అయ్యాయని, ఇప్పుడు మరో రెండు లక్షల కార్డుల జారీ లక్ష్య సాధనకు ప్రజాప్రతినిధుల సహకారంతో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు కృషిచేయాలని సూచించారు. సీసీఆర్‌సీ కార్డులపై భూ యజమానులు, కౌలు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించేందుకు ఆర్‌బీకే స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సులను వేదికగా చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. సీసీఆర్‌సీ కార్డులకు సంబంధించి ఎలాంటి సందేహమున్నా జిల్లాస్థాయి హెల్ప్‌లైన్ నంబరు 88866 13611కు కాల్ చేసి, నివృత్తి చేసుకోవాలని కార్డుల జారీకి సంబంధించి సహాయసహకారాలు పొందాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
....................................
*వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం: ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి:*
దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని అనపర్తి ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు జారీచేసే విషయంలో భూ యజమానులు సహకరించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఒక్క అనపర్తి నియోజవర్గంలో రైతులకు రూ.27 కోట్ల మేర లబ్ధిచేకూరినట్లు వెల్లడించారు. రైతే దేశానికి వెన్నెముక కాబట్టి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి.. అనేక పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోందని ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి వెల్లడించారు. సదస్సులో భాగంగా భూ యజమానులు, కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులపై అవగాహన కల్పించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. కొందరు కౌలురైతులకు కార్డులు అందించారు. పంట ప్రణాళికపై ప్రభుత్వం రూపొందించిన పోస్టర్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, వ్యవసాయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. బోండాలు రకం వరి వేయడం వల్ల ఎదురవుతున్న సమస్యలను వ్యవసాయ అధికారులు సదస్సులో వివరించారు. సరైన మద్దతు ధర పొందేందుకు స్వర్ణ వంటి రకాలు వేయాలని రైతులకు సూచించారు. పంట వైవిధ్యం ప్రయోజనాలపై రైతులకు అవగాహన పెంపొందించారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, జేడీ(ఏ) ఎన్.విజయ్‌కుమార్, డీడీ(ఏ) ఎస్.మాధవరావు, ఏడీ(ఏ) పద్మశ్రీ, గ్రామ సర్పంచ్ చంద్రకళ, ఎంఏవో సీహెచ్ సత్యనారాయణ, రైతులు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment