పేదవారి సొంతింటి కలకు సాకారం

 


- పేదవారి సొంతింటి కలకు సాకారం

*- దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి భారీగా గృహనిర్మాణం*

*- 3న వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల గృహనిర్మాణం ప్రారంభం*

*- క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చ్యువల్‌గా పనులను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్ జగన్*

*- రూ.28,084 కోట్లతో మొదటిదశలో 15.60 లక్షల పక్కాగృహాల నిర్మాణం*

*- వచ్చే ఏడాది జూన్‌ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం*

*- రెండో దశలో రూ.22,860 కోట్లతో మరో 12.70 లక్షల గృహాల నిర్మాణం*

*- 2023 నాటికి 'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు' హామీ పూర్తి*


అమరావతి (ప్రజా అమరావతి);


నిరుపేదల సొంత ఇంటి కలలు సాకారం అవుతున్నాయి... అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇంటి స్థలం, ప్రభుత్వ చేయూతతో పక్కాగృహం నిర్మించి ఇవ్వాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్ లక్ష్యం కార్యరూపం దాలుస్తోంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా... ఎక్కడా కనీవిని ఎరుగని చందంగా... ఒకేసారి 30.76 లక్షల మంది అర్హులైన పేదలకు, అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్లపట్టాలను పంపిణీ చేసిన ఎపి ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా రికార్డు స్థాయిలో...  పేదల కోసం ఒకేసారి లక్షల సంఖ్యలో పక్కాగృహాల నిర్మాణానికి మరో ముందడుగు వేస్తోంది. ఇళ్ళ పట్టా పొందిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ చేయూతతో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు పక్కాగృహాలను కూడా మంజూరు చేసింది. దీనిలో భాగంగా తొలి విడతలో మొత్తం 15,60,227 గృహాల నిర్మాణంకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.28,084 కోట్లను కేటాయించింది. ఈ బృహత్కర ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం (జూన్ 3) నాడు సీఎం శ్రీ వైయస్ జగన్ వర్య్చువల్ విధానంలో  ప్రారంభించనున్నారు. 


*2023 జూన్ నాటికి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు' పూర్తి*


ఎన్నికల సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు' అనే హామీని 2023 జూన్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో రెండు దశల్లో పేదల కోసం రూ.50,944 కోట్లతో మొత్తం 28,30,227 పక్కాగృహాలను నిర్మించబోతోంది. దీనిలో భాగంగా తొలి విడతలో 15.60 ఇళ్ళు, రెండో విడతలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ళను నిర్మించనుంది. మొదటి దశ ఇళ్ల నిర్మాణం జూన్ 2022 నాటికి, రెండో దశ ఇళ్ళ నిర్మాణాన్ని జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని సీఎం శ్రీ వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. మొదటిదశ ఇళ్ళ నిర్మాణంలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్ళను వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలుగా నిర్మిస్తున్నారు. అలాగే  2,92,984 ఇళ్ళను స్వంత స్థలాలు కలిగిన లబ్దిదారులకు, 1,40,465 ఇళ్ళను నివేసిత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు కూడా పక్కాగృహాలు మంజూరు చేయడం ద్వారా వాటి నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నారు. 


*''అవి ఇళ్ళు కావు.. ఊర్లు''*


రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఇళ్ళనిర్మాణం కోసం సిద్దం చేసిన లేఅవుట్లు కొత్తగా ఊళ్ళను సృష్టిస్తాయన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మాటలు నిజమవుతున్నాయి. అవి ఇళ్ళు కాదు.. ఊళ్ళు... ఆ దృష్టితో అక్కడి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ముందుచూపుతో సీఎం ఇచ్చిన   ఆదేశాలతో కొత్త ఆవాసాలు, అన్ని వసతులతో పురుడుపోసుకుంటున్నాయి. ఇందుకోసం కొత్తగా చేపట్టే గృహనిర్మాణ ప్రాంతాల్లో రూ.32,909 కోట్లను ఖర్చు చేస్తోంది. తాగునీటి కోసం రూ.4,128 కోట్లు, రోడ్లు, డ్రైనేజీ కోసం రూ.22,587 కోట్లు, విద్యుత్ సరఫరా కోసం రూ.4,986 కోట్లు, ఇంటర్నెట్ కోసం రూ.627 కోట్లు, ఇతర సౌకర్యాల కోసం రూ.567 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 


*అందమైన కాలనీలు... అన్ని వసతులతో కూడిన ఇళ్ళు*


వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలు అన్ని హంగులతో... అందంగా తీర్చిదిద్దడమే కాకుండా... పేదలకు మంజూరు చేసిన ప్రతి ఇల్లు అన్ని సదుపాయాలతో ఉండాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్ ఆకాంక్షకు అనుగుణంగా కాలనీలు రూపుదిద్దుకోబోతున్నాయి. ఒకేరకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగులలో  ఒక పడక గది, హాలు, వంటగది, స్నానాలగది, వరండాతో నిర్మిస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్‌ ట్యాంకును అందిస్తున్నారు. ఇప్పటికే ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన మ్యాపింగ్, రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాయి. జియో ట్యాగింగ్ పనులు చివరిదశలో వున్నాయి. 8,798 లేఅవుట్లలో గృహనిర్మాణంకు అవసరమైన నీటి పథకాలను చేపట్టగా, వాటిల్లో 2,284 లేఅవుట్లలో పనులు పూర్తి చేశారు. 


*రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి గృహనిర్మాణంతో ఊతం* 


కోవిడ్-19 రెండోదశ కారణంగా రాష్ట్రంలో అర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో... పనులు లేక నిస్తేజంతో ఉన్న వివిధ రంగాలకు చెందిన కార్మికులకు, కూలీలకు గృహనిర్మాణం ఊతం ఇవ్వబోతోంది. మొదటిదశ ఇళ్ళ నిర్మాణం ద్వారా 21.70 కోట్ల పనిదినాల ఉపాధి కూలీలకు లభించబోతోంది. అలాగే  పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్న నిర్మాణ పనులతో తాపీ మేస్ట్రీలు, రాడ్ వెండర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇటుకల తయారీదారులు, సిమెంట్ విక్రేతలకు ఉపాధి లభించనుంది. 


*సరసమైన రేట్లకే నిర్మాణ సామాగ్రి*


పేదలు నిర్మించుకునే ఇళ్ళకు వినియోగించే మెటీరియల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మెటీరియల్ సప్లయిదారులతో మాట్లాడి సరసమైన ధరలకే విక్రయించేందుకు కృషి చేసింది. లబ్ధిదారులతో భారం పడకూడదని నాణ్యమైన మెటీరియల్స్‌ను మార్కెట్ ధరకన్నా తక్కువకే సరఫరా చేసేందుకు రివర్స్‌ టెండరింగ్ నిర్వహించింది. లబ్ధిదారుల కోసం సిమెంట్, ఇతర మెటీరియల్స్‌ను నిల్వ చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో గోదాములను ఏర్పాటు చేసింది. తొలిదశ నిర్మాణం కోసం 69.70 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 7.44 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్, 310 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, 232.50 కోట్ల సిమెంట్, ఫాల్ జి బ్లాక్స్‌ను ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను దగ్గరలోని ఇసుక రీచ్‌ల నుంచి ఉచితంగా ప్రభుత్వం అందించనుంది.


*గృహనిర్మాణంలో లబ్ధిదారుడికి మూడు ఆప్షన్లు*


గృహనిర్మాణంలో లబ్ధిదారుడి నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళను నిర్ధిష్ట నమూనాలో నిర్మించుకునే విషయంలో లబ్ధిదారుడు సొంతగా నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు ఉంచింది. దీనిలో...


ఆప్షన్ -1 : ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి, లేబర్ చార్జీలకు కూడా డబ్బు ఇస్తుంది. లబ్దిదారులే ఇల్లు నిర్మించుకోవచ్చు.


ఆప్షన్ -2 : ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని లబ్దిదారులు తామే తెచ్చుకోవచ్చు. తమకు నచ్చిన చోట నుండి కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవచ్చు. దశల వారీగా వారి పురోగతిని బట్టి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల బ్యాంకుఖాతాలకు చెల్లింపులు చేస్తుంది.


ఆప్షన్ - 3 : లబ్దిదారులు తాము కట్టుకోలేము , ఆ బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకొని కట్టించమంటే, ప్రభుత్వంనిర్దేశించిన నమూన ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని సరఫరా చేయడంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన పూర్తి సహయ సహకారాలు ప్రభుత్వమే అందించి కట్టిస్తుంది.

Comments