- రాష్ట్రంలో 2.83 శాతానికి తగ్గుముఖం పట్టిన కోవిడ్ -19 పాజిటివిటీ రేటు
- గుడివాడ డివిజన్లో 1.47 శాతం పాటివిటీ
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, జూలై 21 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివిటీ రేటు 2.83 శాతానికి తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో మూడు కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందన్నారు. మరో ఐదు జిల్లాల్లో మూడు నుండి ఐదు శాతం మధ్యలో పాజిటివిటీ నమోదవుతోందని తెలిపారు. కోవిడ్ కేసుల రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉందని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని అన్నారు. దీనిలో భాగంగా పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గుడివాడ డివిజన్ లోని 9 మండలాల్లో 1,154 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. వీరిలో 17 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని తెలిపారు. మండవల్లి మండలంలో 12 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా వైరస్ సోకిందని చెప్పారు. అలాగే గుడివాడ రూరల్ మండలంలో 41 మందికి పరీక్షలు జరిపామని, వీరిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకిందన్నారు. నందివాడ మండలంలో 62 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో ముగ్గురికి, కైకలూరు మండలంలో 122 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో ముగ్గురికి, గుడివాడ పట్టణంలో 137 మందికి పరీక్షలు జరుపగా, వీరిలో ఇద్దరికి, కలిదిండి మండలంలో 110 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఒకరికి, గుడ్లవల్లేరు మండలంలో 137 మందికి పరీక్షలు జరుపగా, వీరిలో ఒకరికి, పెదపారుపూడి మండలంలో 144 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఒకరికి, పామర్రు మండలంలో 323 మందికి పరీక్షలు జరుపగా, వీరిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని, ముదినేపల్లి మండలంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన 66 మందిలో ఎవరికీ వైరస్ సోకలేదని తెలిపారు. డివిజన్లో పాజిటివిటీ శాతం 1.47 గా నమోదైందని మంత్రి కొడాలి నాని చెప్పారు.
addComments
Post a Comment