రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,056 కోట్లు

  


- రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,056 కోట్లు 


- 25 లోగా రూ.1600 కోట్లు ఇస్తామని చెప్పిన కేంద్రం 

- రైతుల అకౌంట్లకు రూ.3,400 కోట్లు జమ చేశాం 

- 21 రోజులు దాటిన చెల్లింపులు రూ.1,204 కోట్లు 

- నాబార్డ్ నుండి ప్రభుత్వానికి రానున్న రూ. 1600 కోట్లు 

- ఎట్టి పరిస్థితుల్లో రైతాంగానికి ప్రతి పైసా ఇచ్చి తీరతాం 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



తాడేపల్లి, జూలై 18 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్ర ప్రభుత్వం రూ. 5,056 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇవ్వాల్సినట్టుగా, ఆ డబ్బును వాడుకున్నట్టుగా చంద్రబాబుతో పాటు కొంత మంది బీజేపీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు చిత్రీకరిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ద్వారా బియ్యం కార్డుదారులకు సరఫరా చేయాల్సిన ధాన్యాన్ని మాత్రమే వినియోగించుకుని, కొనుగోలు చేసిన మిగతా ధాన్యాన్ని కేంద్రానికి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలా ఇచ్చిన ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 5,056 కోట్లు రావాల్సి ఉందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని, వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రులను కూడా కలిశారన్నారు. ఏపీ సివిల్ సప్లయిస్ కమిషనర్, ఎండీలు కేంద్రంలోని అధికారులతో ఎప్పటికపుడు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఈ నెల 25 వ తేదీ నాటికి రూ. 1600 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. గతంలో నాబార్డ్ నుండి తీసుకున్న అప్పును ఈ ఏడాది మార్చిలోనే చెల్లించామని, మళ్ళీ లోన్ అమౌంట్ గా రూ. 1600 కోట్లు మంజూరు చేస్తామని నాబార్డ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థికశాఖకు తెలియజేశారన్నారు. వచ్చే మంగళ, బుధవారాల్లో రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల్లో రూ.1600 కోట్లు చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులకు ఇంకా రూ.3,393 కోట్ల బకాయిలుంటాయని తెలిపారు. ఈ ఏడాది రైతుల అకౌంట్లలో దాదాపు రూ.3,400 కోట్లు జమ చేశామన్నారు. 21 రోజుల నిబంధన దాటిన చెల్లింపులు రూ.1204 కోట్లు మాత్రమేనని చెప్పారు. వచ్చే మంగళ, బుధవారాల్లో రూ.1204 కోట్లను రైతుల అకౌంట్లకు జమ చేస్తామన్నారు. వీటితో పాటు ఈ నెల 25 న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రూ.1600 కోట్లు, నాబార్డ్ నుండి వచ్చే రూ.1600 కోట్లు అందుతాయన్నారు . ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరు లోపు రైతాంగానికి ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇచ్చి తీరతామన్నారు. రైతాంగం దొంగ, దుర్మార్గుడైన చంద్రబాబు మాటలను నమ్మొద్దని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క రైతుకైనా 21 రోజుల్లో ఐదు పైసలైనా చెల్లించాడా అని ప్రశ్నించారు. కనీసం 60 రోజుల లోపు ఏ ఒక్క రైతు అకౌంట్ కు ఐదు పైసల బిళ్ళ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఎల్లో మీడియా, చంద్రబాబు, ఆయన తోక పార్టీలు, బఫూన్ లాంటి దేవినేని ఉమా రైతాంగానికి ఏదో జరిగిపోతుందంటూ ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. ఏది రైతు ప్రభుత్వమో, రాక్షస ప్రభుత్వమే రైతులకు తెలుసని అన్నారు. రైతు రాజులా బతకాలంటే, సకాలంలో వర్షాలు పడాలంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో తెలుసని అన్నారు. ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రానికి దరిద్రం పడుతుందో ప్రజలందరికీ తెలుసన్నారు. అందువల్లే చంద్రబాబును 23 సీట్లకు పరిమితం చేసి గోతిలో పాతి పెట్టినా ఆయనకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. నిత్యం సీఎం జగన్మోహనరెడ్డిపై విమర్శలు  చేస్తూనే ఉన్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments