రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా గ్రామాల నిర్మాణ‌మే

 

కాకినాడ‌, జులై 14 (ప్రజా అమరావతి)



గ‌తంలో ఎప్పుడూ ఎక్క‌డా లేని విధంగా కాల‌నీలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా గ్రామాల నిర్మాణ‌మే పెద్దఎత్తున జ‌రుగుతోంద‌ని, పాదయాత్ర సంద‌ర్భంగా పేద అక్కాచెల్లెమ్మ‌ల‌కు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి గౌర‌వ ముఖ్య‌మంత్రి న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, రెవెన్యూ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ పేర్కొన్నారు. బుధ‌వారం కాకినాడ‌లోని జెడ్‌పీ స‌మావేశ మందిరంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌.. కాకినాడ ఎంపీ వంగా గీత‌, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డా.భ‌ర‌త్ గుప్తా, చీఫ్ ఇంజ‌నీర్ పి.శ్రీరాములు, క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్లు డా. జి.ల‌క్ష్మీశ‌, జి.రాజ‌కుమారి, ఎ.భార్గ‌వ్‌తేజ; శాసన మండలి సభ్యులు పండుల రవీంద్రబాబు; కాకినాడ అర్బ‌న్‌, పి.గన్నవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర‌రెడ్డి, కొండేటి చిట్టిబాబు, జ్యోతుల చంటిబాబు, ప‌ర్వ‌త పూర్ణ‌చంద్ర ప్ర‌సాద్‌, పెండెం దొర‌బాబు త‌దిత‌రుల‌తో క‌లిసి న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంపై జిల్లాస్థాయి విస్తృత స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశం అనంత‌రం ఉప ముఖ్య‌మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి ప్ర‌తిష్టాత్మ‌క న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని సూచించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇప్ప‌టికే వివిధ జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాల‌పై స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హించార‌ని, ఆయా జిల్లాల్లో స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి ప‌థ‌కం అమ‌లుకు సూచ‌న‌లిచ్చిన‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం గృహ నిర్మాణ శాఖ మంత్రి జిల్లాస్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. లక్ష‌లాది పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను అందించ‌డంలో రెవెన్యూ మంత్రిగా త‌న‌కు భాగ‌స్వామ్యం ల‌భించ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇంత పెద్ద కార్య‌క్ర‌మాన్ని అమ‌లుచేస్తున్నందున చిన్న‌చిన్న స‌మ‌స్య‌లు రావ‌డం స‌హ‌జ‌మ‌ని, మీడియా కూడా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాల‌ని సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా మార్చేందుకు రైతు సంక్షేమం ల‌క్ష్యంగా వివిధ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తోంద‌ని.. ఆర్‌బీకేల‌ను ఏర్పాటు చేసి వాటిద్వారా అన్ని సేవ‌ల‌ను అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. స్వ‌చ్ఛ‌మైన భూ రికార్డులు ల‌క్ష్యంగా గ్రామాల్లో ఎలాంటి భూ వివాదాలు రాకుండా చూసేందుకు రీస‌ర్వేను ప్రారంభించామ‌ని, రూ.వెయ్యి కోట్ల మంజూరుతో ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో స‌ర్వే చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం గ్రామ‌, వార్డు వాలంటీర్లు; స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా పేద‌ల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంద‌ని.. విద్య‌, వైద్య రంగాల‌కు మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు కూడా అధిక ప్రాధాన్యమిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇళ్ల ప‌ట్టాలు అంద‌జేయ‌డం, ఇళ్ల మంజూరు అనేది నిరంత‌ర ప్ర‌క్రియ అని అర్హులు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో పట్టా మంజూరవుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.


*రూ.4 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద సృష్టి: గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు*

రాష్ట్రంలోని ప్ర‌తి పేద‌వానికి సొంతింటి క‌ల‌ను సాకారం చేసే ల‌క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల ప‌థ‌కంకింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31 ల‌క్ష‌ల ఇళ్ల ప‌ట్టాలు అందించార‌ని, ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్త‌యితే దాదాపు రూ.4 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద సృష్టి జ‌రుగుతుంద‌ని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు పేర్కొన్నారు. రూ.12 వేల కోట్ల‌తో భూ సేక‌ర‌ణ చేసి, లేఅవుట్ల‌ను సిద్ధం చేశామ‌ని.. 17 వేల కొత్త గ్రామాల నిర్మాణం జ‌రుగుతోంద‌ని వెల్ల‌డించారు. లేఅవుట్ల‌లో పెద్ద ఎత్తున మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన తూర్పుగోదావ‌రి జిల్లాలోనే ముఖ్య‌మంత్రి ప‌థ‌కాన్ని ప్రారంభించార‌ని.. డెల్టా, అప్‌ల్యాండ్‌, ఫారెస్ట్‌.. ఇలా భౌగోళికంగా అధిక వైవిధ్య‌మున్న జిల్లాలో స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారంతో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి కార్య‌క్ర‌మం అమ‌ల్లో ముందు నిలిచేలా చేస్తున్నార‌ని పేర్కొన్నారు. భూ సేక‌ర‌ణ మొద‌లు, లేఅవుట్ల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, నిర్మాణాల‌ను వేగ‌వంతం చేసేందుకు కృషిచేస్తున్నార‌న్నారు. కొమ‌ర‌గిరి లేఅవుట్‌లో భూగ‌ర్భ డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌, విద్యుత్ లైన్లు వంటి ఏర్పాటుతో భ‌విష్య‌త్తులో ఓ ఆద‌ర్శ ప‌ట్ట‌ణం మ‌న క‌ళ్ల‌ముందు సాక్షాత్క‌రించ‌నుంద‌ని పేర్కొన్నారు.  ఇళ్ల నిర్మాణాల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా లేఅవుట్ల‌లోనే సిమెంటు, స్టీల్ వంటి ఇంటి నిర్మాణ సామ‌గ్రిని రాయితీతో  అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. ఇసుక‌ను ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయ‌నున్నామ‌ని, వ‌ర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌స్తుతం స్పెష‌ల్ లైన్ ద్వారా ఇసుక‌ను లేఅవుట్ల‌కు చేర్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. 90 రోజుల్లో ఇంటి ప‌ట్టా కార్య‌క్ర‌మంతో క‌లుపుకొని జిల్లాలో ద‌శ‌ల వారీగా నాలుగు ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, ప్ర‌తి ల‌బ్ధిదారునికి ఇంటి నిర్మాణం పూర్త‌యితే రూ.15 ల‌క్ష‌ల నుంచి రూ.20 లక్ష‌ల ఆస్తి చేకూరుతుంద‌ని తెలిపారు. ల‌బ్ధిదారుల‌కు అండ‌గా ఉండేందుకు ప్ర‌తి 20 ఇళ్ల‌కు ఓ అధికారిని అదే విధంగా ప్ర‌తి లేఅవుట్‌కు మండ‌ల‌స్థాయి అధికారిని నోడ‌ల్ అధికారులుగా నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు. అధికారులు, స్థానిక ప్రజాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని, త్వ‌ర‌లోనే మ‌ళ్లీ జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి, క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేయ‌నున్న‌ట్లు మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు వెల్ల‌డించార

*న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల కార్య‌క్ర‌మంపై 

జిల్లాస్థాయి స‌మీక్షా స‌మావేశం*


బుధ‌వారం ఉద‌యం కాకినాడ‌లోని జెడ్‌పీ స‌మావేశ మందిరంలో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల కార్య‌క్ర‌మానికి సంబంధించి వైఎస్సార్ జ‌గ‌న‌న్న కాల‌నీల గృహ నిర్మాణాల‌పై విస్తృత జిల్లాస్థాయి స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ‌, కాకినాడ ఎంపీ వంగా గీత‌, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డా.భ‌ర‌త్ గుప్తా, చీఫ్ ఇంజ‌నీర్ పి.శ్రీరాములు, క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్లు డా. జి.ల‌క్ష్మీశ‌, జి.రాజ‌కుమారి, ఎ.భార్గ‌వ్‌తేజ; శాసన మండలి సభ్యులు పండుల రవీంద్రబాబు; కాకినాడ అర్బ‌న్‌, పి.గన్నవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర‌రెడ్డి, కొండేటి చిట్టిబాబు, జ్యోతుల చంటిబాబు, ప‌ర్వ‌త పూర్ణ‌చంద్ర ప్ర‌సాద్‌, పెండెం దొర‌బాబు త‌దిత‌రులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. అంత‌కుముందు అధికారుల‌తో క‌లిసి మంత్రులు, ప్రజాప్ర‌తినిధులు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలోని జాతిపిత మ‌హాత్మా గాంధీ విగ్ర‌హానికి పూల‌మాలలు వేసి, ఘ‌న నివాళులు అర్పించారు. 


స‌మీక్షా స‌మావేశంలో తొలుత జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. న‌వ‌ర‌త్నాలు, పేద‌లంద‌రికీ ఇళ్ల కార్య‌క్ర‌మం స్థితిగ‌తుల‌ను వివ‌రించారు. తొలిద‌శ‌లో 758 లేఅవుట్ల‌లో మొత్తం 1,34,458 ఇళ్ల నిర్మాణాలు జ‌ర‌గ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. వీటి మొత్తం ప్రాజెక్టు వ్య‌యం రూ.2,420 కోట్లుగా తెలిపారు. లేఅవుట్ల‌లో ఇళ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన నీటి స‌ర‌ఫ‌రా ప‌నులు 60 శాతం మేర పూర్త‌య్యాయ‌ని, 758 లేఅవుట్ల‌కు గాను 673 లేఅవుట్ల‌కు విద్యుత్ సర్వీసుల‌ను రిలీజ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. లేఅవుట్లలో శాశ్వ‌త మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి సంబంధించి శాఖ‌ల వారీగా డీపీఆర్‌ల‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలిపారు. అదే విధంగా జియో ట్యాగింగ్‌, మ్యాపింగ్‌, ల‌బ్ధిదారుల రిజిస్ట్రేష‌న్‌, జాబ్ కార్డు మ్యాపింగ్‌, మెగా గ్రౌండింగ్ మేళా, ఇళ్ల నిర్మాణ సామ‌గ్రి సేక‌ర‌ణ‌, ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు లేఅవుట్ల‌ను ఏ, బీ, సీ కేట‌గిరీల వారీగా వ‌ర్గీక‌ర‌ణ‌, ఎస్‌హెచ్‌జీ లింకేజీ అడ్వాన్సు రుణాలు త‌దిత‌రాల‌ను క‌లెక్ట‌ర్ వివ‌రించారు. 


స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మాట్లాడుతూ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌ల‌ను గుర్తించి, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రిస్తూ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. అంద‌రూ ఎవ‌రిస్థాయిలో వారు భాగ‌స్వాములు కావాల‌ని స్ప‌ష్టం చేశారు. స‌మావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ముందుగా జిల్లాలో ఎస్‌హెచ్‌జీ ద్వారా ల‌బ్ధిదారుల‌కు అడ్వాన్సు రుణాలు అందించినందుకు క‌లెక్ట‌ర్‌, అధికార యంత్రాంగానికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. లేఅవుట్ల‌లో లెవెలింగ్‌కు సంబంధించి పెండింగ్ ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని అధికారుల‌కు సూచించారు. లెవెలింగ్ ప‌నులు పూర్త‌యిన వెంట‌నే ఇళ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన వ‌స‌తులను క‌ల్పించాల‌ని, కార్య‌క్ర‌మంపై గౌర‌వ ముఖ్య‌మంత్రి నిరంత‌రం స‌మీక్షిస్తున్నార‌న్నారు. త‌మ శాఖ నుంచి పూర్తిస‌హ‌కారం అందుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ల‌బ్ధిదారుల‌కు వారం వారీగా బిల్లుల చెల్లింపు జ‌రుగుతోంద‌న్నారు. 

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్ మాట్లాడుతూ అమ‌లాపురం డివిజ‌న్‌లో ఏరియా డెప్త్ ఆధారంగా లేఅవుట్ల‌లో లెవెలింగ్ కార్య‌క‌లాపాలు సాగించాల్సి ఉంద‌ని తెలిపారు. ఇందువ‌ల్ల భ‌విష్య‌త్‌లో స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌న్నారు. ఇంటి నిర్మాణ సామ‌గ్రిని లేఅవుట్ల‌లో అందుబాటులో ఉండేలా చూడాల‌ని సూచించారు. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ మాట్లాడుతూ గౌర‌వ ముఖ్య‌మంత్రి పేద‌లంద‌రికీ ఇళ్లు అనే గొప్ప య‌జ్ఞాన్ని ప్రారంభించార‌ని, ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం చేసేందుకు అంద‌రూ స‌మ‌ష్టిగా కృషిచేయాల‌న్నారు. 90 రోజుల్లో ఇంటి ప‌ట్టా కార్య‌క్ర‌మానికి సంబంధించి భూ సేక‌ర‌ణ జ‌రిగేలా చూడాల‌న్నారు.  ఎంపీ వంగా గీత‌తో పాటు  కాకినాడ అర్బ‌న్‌, పి.గన్నవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర‌రెడ్డి, కొండేటి చిట్టిబాబు, జ్యోతుల చంటిబాబు, ప‌ర్వ‌త పూర్ణ‌చంద్ర ప్ర‌సాద్‌, పెండెం దొర‌బాబులు స్థానిక ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, గృహ నిర్మాణ సంస్థ పీడీ జి.వీరేశ్వ‌ర‌ప్ర‌సాద్‌; కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం క‌మిష‌న‌ర్లు స్వప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, అభిషిక్త్ కిశోర్‌; రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, రంప‌చోడ‌వ‌రం స‌బ్ క‌లెక్ట‌ర్లు ఇలాక్కియా, క‌ట్టా సింహాచ‌లం; ఆర్‌డీవోలు, వివిధ శాఖ‌ల ఇంజ‌నీరింగ్ అధికారులు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Comments