దేశానికి, ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా ద‌ళిత బంధు

 దేశానికి, ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా ద‌ళిత బంధు 


సీఎం కేసీఆర్

హైదరాబాద్ (ప్రజా అమరావతి);

దేశానికి, ప్ర‌పంచానికి సందేశం ఇచ్చే ప‌థ‌కం ద‌ళిత బంధు అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. ద‌ళిత బంధు విజ‌యం దేశానికి, ప్ర‌పంచానికి ఆద‌ర్శ‌వంత‌మ‌వుతుంద‌ని తెలిపారు. ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని బాధ్య‌త‌తో విజ‌య‌వంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంట మండ‌లం త‌నుగుల ఎంపీటీసీ భ‌ర్త రామ‌స్వామికి సీఎం శ‌నివారం ఫోన్ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. హుజూరాబాద్ ప‌రిధిలోని ఎస్సీలంద‌రూ ఈ నెల 26న ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు రావాల్సిందిగా సీఎం ఆహ్వానించారు. ద‌ళిత బంధు గురించి అన్ని గ్రామాల్లో తెలియ‌జేయాల‌న్నారు. హుజూరాబాద్‌లో ద‌ళిత బంధు విజ‌యంపైనే ఎస్సీల భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంద‌ని సీఎం పేర్కొన్నారు.


ఈ నెల 26న దళిత బంధు కార్యాచరణపై తొలి అవగాహన సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు నిర్వహణ. తెలంగాణ దళిత బంధు పథకం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం సదస్సులో చ‌ర్చించ‌నున్నారు. ఈ అవగాహన సదస్సుకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం, ప్రతీ మున్సిపాలిటీ నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు హాజ‌రుకానున్నారు.

Comments