దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి అంకురార్పణతాడేపల్లి (ప్రజా అమరావతి);


బలహీన వర్గాల జీవనంపై సూక్ష్మంగా అధ్యయనం చేయడమే కాక క్షేత్రస్థాయిలో బీసీల అభ్యుదయాన్ని కాంక్షించిన తొలి ముఖ్యమంత్రిగా జగన్ - దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి అంకురార్పణ


చేశారని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సమాజంలో బీసీలు గర్వంగా తలెత్తుకు తిరిగేలా సీఎం శ్రీ వైఎస్ జగన్ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీన్ని అందిపుచ్చుకుని బీసీలు బలమైన వర్గాలుగా ఎదగాలని ఆయన కోరారు.


భట్రాజు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ కూరపాటి గీతాంజలి దేవి అధ్యక్షతన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భట్రాజు కులస్తుల రాష్ట్ర స్థాయి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం రాజ్యమేలుతుందన్నారు. దీన్ని బీసీల్లోని అన్ని కులాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరారు. ఇటు పార్టీ పదవులు, అటు ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ పనుల్లో ముఖ్యమంత్రి జగన్‌ బీసీలకు సమాన వాటా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇది బీసీలకు శుభపరిణామన్నారు. బీసీల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చే రీతిలో జగన్‌ తన పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారని తెలిపారు. బీసీల జీవితాలు మరింత మెరుగుపడాలంటే... బీసీలు మరింత ఉన్నత స్థితికి చేరాలంటే... జగనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని, అందుకోసం ఆయనకు అండగా నిలవాలని సజ్జల రామకృష్ణారెడ్డి బీసీలకు పిలుపునిచ్చారు.


శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి మినహా గత పాలకులందరూ బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుని అన్ని విధాలా మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఆదరణ పేరిట ఒక నిరాదరణ పధకమొకటి ప్రవేశపెట్టి, వారికి ఎందుకూ పనికిరాని పరికరాలు ఇచ్చిందని విమర్శించారు. పరికరాలు ఇవ్వడం వెనుక వారిని అన్ని రంగాల్లో ఎదగనీయకుండా కేవలం కుల వృత్తులకే పరిమితం చేసే కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ దానికి భిన్నంగా బీసీలు కేవలం కుల వృత్తులకు మాత్రమే పరిమితం కాకూడదని, ఓ వైపు సాంప్రదాయ చేతి వృత్తులకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు వారికి అన్ని రంగాల్లో సమాన వాటా కల్పిస్తున్నట్లు చెప్పారు. తద్వారా ఒక బ్రహ్మాండమైన నాయకత్వంగా బీసీలను తీర్చిదిద్దే ఆలోచనలో సీఎం శ్రీ వైఎస్ జగన్ ఉన్నట్లు వెల్లడించారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా నాయకత్వం ఏ ఒక్కరి సొత్తూ కాదన్న వాస్తవాన్ని గుర్తుంచుకుని బీసీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ క్రమంలో బీసీలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో నవరత్నాలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, మద్య విమోచన ప్రచార కమిటి ఛైర్మన్ వి.లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Comments