తాడేపల్లి- వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం (ప్రజా అమరావతి);
- రెండేళ్ళ శ్రీ జగన్ పాలన తర్వాత ఏకపక్షంగా వైయస్ఆర్సీపీకి పట్టం కడుతున్న ప్రజలు*
*- ఎన్నికలు, వాటి ఫలితాలను తాత్కాలికంగా బాబు ఆపగలుగుతున్నారు తప్పితే.. ప్రజా తీర్పులో మాత్రం మార్పు లేదు*
*- రోడ్లు దొంగతనం చేస్తారన్న దిక్కుమాలిన ఆలోచన ఎల్లో మీడియాకు ఎలా వచ్చిందో..!*
*- కామన్ సెన్స్ కూడా లేకుండా తప్పుడు రాతలు రాస్తున్న రామోజీ, రాధాకృష్ణ*
*- ఇటువంటి దిక్కుమాలిన సలహాలు ఎల్లో మీడియా ఇచ్చి చంద్రబాబును ముంచుతున్నారేమో..!*
*- అమరావతిలో దోపిడీదారులను కట్టడి చేయడంతోనే.. ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నారేమో..!*
*- అమరావతి రైతుల కౌలు పెంచింది ఎవరు..?; చంద్రబాబు పట్టించుకోకపోతే.. కృష్ణా కరకట్ట రోడ్డు నిర్మిస్తున్నది ఎవరు..?*
*- మీరు ఓటేస్తే.. అమరావతి తరలించమని రాసిచ్చినట్టే అని బాబు నాడు చెప్పారు.. బాబు ముఖం మీద గుద్దినట్టు గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు.*
*- అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. లక్షల కోట్లు సంపాదించుకునే బాబు బినామీల పగటి కలలను శ్రీ జగన్ చిన్నాభిన్నం చేసింది నిజం.*
*- రోడ్ల మీద టీడీపీలా చిల్లర వేషాలు మేము వేయలేదు.. అవన్నీ చంద్రన్న గుంతలే..!*
*- ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రీ జగన్ రెండు అడుగుల ముందే ఉంటారు.. బాబుకు ఉద్యమం చేసే అవకాశమే ఇవ్వరు.*
*- శ్రీ జగన్ తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ పై టీడీపీ స్టాండ్ ఏమిటి..?*
*- టీడీపీ హయాంలో పూర్తి చేసిన పాలమూరు-రంగారెడ్డిపై.. శ్రీ జగన్ జలదీక్ష చేస్తుంటే, బాబు అప్పుడు ఏం చేశారు..?*
*- గుడ్డిగా రాయలసీమకు అన్యాయం చేశారంటున్నారు.. లిఫ్ట్ పెట్టడం అన్యాయమా.. ప్రజల దగ్గరకు వెళ్ళి అదే చెప్పగలరా..?*
*- ప్రభుత్వ ఉద్యోగులకు కామన్ గా జరిగే శాఖాపరమైన పరీక్షే సచివాలయ ఉద్యోగులకు కూడా జరుగుతుంది.. ఉద్యోగాలు ఎవరివీ పోవు. అపోహలు నమ్మొద్దు, ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదు.*
శ్రీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తర్వాత ఎన్నికల్లో వస్తున్న ఫలితాలను చూస్తుంటే.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా పట్టం కడుతున్నారని, ఇందుకు జగన్ మోహన్ రెడ్డిగారి జనరంజకమైన సుపరిపాలనే నిదర్శనమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు(ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎటువంటి ప్రలోభాలు లేకుండా, హింసకు తావు లేకుండా, అత్యంత పారదర్శకంగా సమాజంలోని అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు ఇచ్చి, ప్రజల దగ్గరకు వెళ్ళి చేసింది చెప్పుకోవడం ద్వారా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం ఇది అని వ్యాఖ్యానించారు. ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు చూశాక, జనం అంతా కూడగట్టుకుని జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఈ రాష్ట్రానికి కావాలి అని తీర్పు ఇచ్చారని చెప్పారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్ గారు రెండేళ్లలో చేసిన సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాల ఫలితం ఎలా ఉంటుందనేది మరోసారి రుజువు అయిందన్నారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో శ్రీ సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన పాలనను, ఆయన చేసిన దురాగాతాలను ప్రజలెవ్వరూ మర్చిపోలేదని అన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో బాబు ముఖం మీద కొట్టినట్టు 23 స్థానాలకే టీడీపీని పరిమితం చేసిన ప్రజలు, మళ్లీ అలాంటి ఫలితాలనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ చూపించారని అన్నారు. 2019 ఎన్నికల నుంచి మొదలుపెడితే ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో వైయస్సార్ సీపీకి ప్రజలు ఏకపక్షంగా పట్టం కడుతున్నారని, అలాగే ఓట్ల శాతాన్ని పెంచుకోవడంలో కూడా వైయస్సార్ సీపీది అపూర్వ చర్రిత అని అన్నారు. చంద్రబాబు కుట్రల ఫలితంగా.. మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేస్తే వేసి ఉండవచ్చుగానీ.. రేపు ఆ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు కనిపిస్తాయని, మరోసారి అదే విషయాన్ని మేము గర్వంగా చెప్పుకునేందుకు వారే అవకాశం ఇస్తున్నారని సజ్జల తెలిపారు.
*శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..*
1. ఏలూరు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో జరిగినా ఫలితాలు నిన్న వెలువడ్డాయి. ఏలూరులో జనమంతా ఒకేమాటగా వైయస్సార్ సీపీకి ఓటేశారు. ప్రజల్లో మమేకమై పనిచేస్తున్న మమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుని ఓట్లు వేసి గెలిపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 56.43 శాతం వస్తే... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 28.2 శాతానికే పరిమితం అయింది. రాష్ట్రంలో 12 నగరపాల సంస్థలకు, 75 పురపాలక సంస్థలకు ఎన్నికలు జరిగితే... మున్సిపాల్టీల్లో 75కు 74 వైయస్సార్ సీపీకి, 12 కార్పోరేషన్లకు గాను 12 కార్పొరేషన్లు గెలవడం అనేది బహుశా ప్రజాస్వామ్య చరిత్రలో ఎలాంటి ప్రలోభాలు లేకుండా, అత్యంత సజావుగా, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం ద్వారా మా పార్టీ సాధించిన విజయంగా భావిస్తున్నాం.
2. ఓట్ల శాతం చూస్తే 2019 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత రాష్ట్ర ప్రజానీకం పూర్తిగా టీడీపీని తిరస్కరించి, ఆ పార్టీని 23 సీట్లకే పరిమితం చేసింది. పార్లమెంట్‌లో కూడా కేవలం మూడు ఎంపీ సీట్లను, అవికూడా పదివేల మెజార్టీతో మాత్రమే కట్టబెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ సీపీకి 151 అసెంబ్లీ సీట్లు గెలిపించి, దాదాపు 50 శాతం ఓట్లతో ప్రజలు జగన్ మోహన్ రెడ్డిగారిని తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు.
3. సీట్ల పరంగానే కాకుండా ఓట్ల పరంగా కూడా రెండేళ్ల తర్వాత అంతకు మించిన దీవెనలు, విశ్వాసం జగన్ మోహన్ రెడ్డిగారిపై ప్రజలు వ్యక్తం చేశారు. ఏలూరు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారి పాలన బాగుందంటూ ఓట్లు వేశారు. 2019 జనరల్ ఎన్నికల్లో ఏలూరు కార్పొరేషన్ పరిధిలో వైయస్సార్ సీపీకి వచ్చిన ఓట్ల శాతం 44.73 శాతం అయితే, టీడీపీకి 42.21 శాతం వచ్చాయి. నిన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్లు చూస్తే వైయస్సార్ సీపీకి 56.43 శాతం, టీడీపీకి 28.2 శాతం వచ్చాయి. ఇది ఒక ఏలూరే కాదు. తిరుపతి ఉప ఎన్నిక విషయంలోనూ ఇదే జరిగింది.
4. మొత్తంగా ప్రజాస్వామ్యంలో ఓటు డివైడ్ కావడం వల్ల అధికారంలోకి రావడమే ఎక్కువగా చూస్తుంటాం. స్ట్రెయిట్ ఫైట్‌లో 50 శాతం ఓట్లు వైయస్ఆర్సీపీకి వచ్చాయో.. వాటిని రియల్ పాజిటివ్ ఓటుగా తీసుకోవడం జరుగుతుంది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వంపై వ్యతిరేకత (యాంటీ ఇంకంబెన్సీ) లేకుండా, అడ్డగోలుగా ఎన్నికలు అనేవి జరగకుండా... చాలా సజావుగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వచ్చిన ఫలితాలు ఇవి. 56.43 శాతం అనేది పాజిటివ్ ఓటుకు మించిన తిరుగులేని విజయం.
5. 2019 జనరల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి 16,681 ఓట్లు వస్తే.. ఇప్పుడే 7,407 ఓట్లు వచ్చాయి. జనసేన, బీజేపీకి సీట్లు రావడం సంగతి అటుంచింతే, గతంలో వచ్చిన ఓట్లల్లో సగానికి సగం కూడా రాలేదు. తెలుగుదేశం పార్టీకీ అదే పరాభవం ఎదురైంది. ఇదే ట్రెండ్ లో మిగిలిన కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఫలితాలు వచ్చాయి. అలాగే రేపటి ఎంపీపీ, జిల్లా పరిషత్ ఛైర్మెన్ల ఎంపిక ఫలితాల్లోనూ కనబడుతుందని మేము ముందే చెప్పగలుగుతున్నాం. వైయస్ఆర్సీపీ అనుకూల ఓటు కళ్ళముందు కనిపిస్తుంది కాబట్టే మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే, వాటి ఫలితాలు రాకుండా చంద్రబాబు కుట్రలు పన్నారు. రేపు వాటిల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అయిన తర్వాత కూడా మేం ఇదేరకంగా గర్వంగా చెప్పుకుంటాం.
6. ఎన్నికలు, కొన్నిట్లో ఫలితాలు ఆపేందుకు టీడీపీ, చంద్రబాబు పన్నిన కుయక్తులుగానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా గతంలో పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ముందు పెట్టుకుని న్యాయస్థానాలకు వెళ్లి ఫలితాలు అయితే తాత్కాలికంగా ఆపగలిగారే తప్ప, ఆ ఫలితం ఎలా ఉంటుందనేది చెప్పలేకపోయారు. టీడీపీ ఎన్ని పగటి కలలు కన్నా... మేము చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయి. మాకు ఒకందుకు ఆనందం ఏంటంటే ఫలితాలు అన్నీ ఒకేసారి వచ్చి ఉంటే వాటిని మేము కూడా మా సంతోషాన్ని ఆరోజుతోనే వ్యక్తం చేసి ఆపేయాల్సి వచ్చేది. అయితే ఫలితాలను అంచలంచెలుగా తలచుకునేందుకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్‌గారికి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తోంది.
*రోడ్లు దొంగతనం చేస్తారన్న దిక్కుమాలిన ఆలోచన ఎల్లో మీడియాకు ఎలా వచ్చిందో..!*
7.ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్లు తవ్వుకుని అమ్ముకుంటున్నారు అని కథనాలు రాశారు. ఇంత దిక్కుమాలిన ఆలోచన ఎవరైనా చేస్తారా? ఇంత నీచమైన ఆలోచన ఎవరికి వచ్చిందో మరి. ఎవరైనా దొంగతనం చేయాలంటే, కంకర తవ్వి అమ్ముకోవాలంటే ఎక్కడైనా చేయవచ్చు. ఇంత తలమాసిన పనులు ఎవరైనా చేస్తారా? "అది కూడా వైయస్సార్ సీపీ వాళ్లు చోరీ చేశారని, దళిత వేదిక సభ్యులు పట్టుకునేందుకు వెళితే పారిపోయారంటూ.." ఎల్లో మీడియాలో కథనాలు రాయడం చూస్తుంటే, బుర్ర ఉన్నవారికి ఎవరికీ అర్థం కావు. బహుశా ఇటువంటి దిక్కుమాలిన రాతలతో చంద్రబాబును, ఆయన కొడుకును ముంచుతున్నట్లు ఉన్నారు. ఇలాంటి దిక్కుమాలిన సలహాలు వీళ్లే ఇస్తున్నారేమో. టీడీపీలోనే ఈ కల్చర్ ఉందేమో, జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక, వీరి దోపిడీ తగ్గిపోవడంతో, ఆదాయం తగ్గి ఇప్పుడు కంకర అమ్ముకుంటున్నారేమో.
8. అమరావతి భూముల కుంభకోణం బయట పడటం ద్వారా కొంతమంది పగటి కల, మరి కొందరి డ్రీమ్‌ను జగన్ మోహన్ రెడ్డిగారు పంక్చర్ చేశారు. అప్పట్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లగా అవతారం ఎత్తినవారు ఇప్పుడు ఆదాయం తగ్గిపోవడంతో అర్థరాత్రి పూట కంకర ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నారేమో. ఏదైనా పాయింట్ ఉంటే సూటిగా చెబితే బాగుంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరకట్టమీద నివాసం ఉన్నప్పుడు, కనీసం ఆయన నివసిస్తున్న కరకట్ట రోడ్డును కూడా వెడల్పు చేయలేకపోయారు. అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు పన్నాగాలకు ఒక వర్గం ప్రజలు నష్టపోయారు. ఆ రోడ్డు వెడల్పు చేసేది మా ప్రభుత్వమే. రైతులకు కౌలు పెంచింది, కాజాకు రోడ్డు ఎక్స్‌టెండ్ చేసేది జగన్ మోహన్ రెడ్డిగారే కదా.
*ప్రజల్లో లేని ఉద్యమానికి రోజులు లెక్కబెడుతూ.. భ్రమల్లో ఉంచొద్దు బాబూ..*
9. మీ పాలసీలు మీకు ఉన్నట్లు మా పాలసీలు మాకు ఉంటాయి. అధికార కేంద్రీకరణ అనేది మీ జేబులో ఉండాలనుకుని అమరావతి రాజధాని పేరుతో లక్షల కోట్లు మేసేయాలనుకుని కుట్ర చేసి అందర్నీ ముంచారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. మళ్లీ వాళ్లనే అడ్డుపెట్టుకుని రెచ్చగొడుతూ, 600 రోజుల ఉద్యమం అంటూ.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల్లో లేని ఉద్యమానికి, రోజులు లెక్కబెడుతూ.. చంద్రబాబు ఇంకా వాళ్లను భ్రమలో పెట్టాలని చూస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో.. "మీరు వైయస్ఆర్సీపీకి ఓటేస్తే.. అమరావతి తరలించమని రాసిచ్చినట్టే"అని బాబు నాడు చెప్పారు. బాబు ముఖం మీద గుద్దినట్టు గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒక్కసారి ఆలోచిస్తే జనంలో అమరావతి రాజధాని ఉద్యమం లేదని... అది కృత్రిమ ఉద్యమం అనేది తెలిసిపోతుంది. ఆ ఉద్యమంలో ఎంత మంది కూర్చున్నారనేది, ఏం చేస్తున్నారేది అందరికీ తెలుసు. చంద్రబాబు జాకీలు, జేసీబీలు పెట్టి లేపినా.. ఫలితం రావడం లేదు. ప్రజలకు కావాల్సింది తమ బతుకులు, బాగోగులు చూసే ప్రభుత్వం.
10. మీ బినామీలు బాగు పడటానికో, మీరు బాగుపడటానికో రాష్ట్రం ఉంది అనుకుని, పప్పులో కాలేసి దెబ్బతిన్నా ఇంకా చంద్రబాబుకు అర్థం కావడం లేదు. ఇంకా మిమ్మల్ని భ్రమలో పెట్టి ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలను చూసి నవ్వాలో.. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. రామోజీరావు లాంటి వయసులో పెద్దయాన ఇలాంటి అడ్డగోలు రాతలు రాయించడం సిగ్గుచేటు. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. నిజంగానే మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మీ హయాంలో ఏం చేశారో చెప్పండి. జగన్ గారు కోట్ల మంది ప్రజల బాగోగులు, చూస్తున్నారని భావిస్తున్నారు కాబట్టే మాకు మంచి తీర్పు ఇచ్చారు. మీకు సిగ్గులేదు అని తిట్టినా.. ఫలితాల ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
*అవి చంద్రన్న గుంతలే..*
11. అమరావతి పేరుతో.. గతంలో ఇళ్లల్లో నుంచి ఉద్యమాలు చేస్తే, ఇప్పుడు టీడీపీ రోడ్లపై ఉద్యమాలు అంటూ.. రోడ్లు గుంతలు ఉన్నాయని మొక్కులు నాటుతున్నారే.. అవన్నీ మీ హయాంలో ఉన్న గుంతలే. వాటిని బాబు గుంతలే అనాలి. ముఖ్యమంత్రి జగన్ గారు శాశ్వత ప్రాతిపదికన, ఒక ప్రణాళిబద్ధంగా రోడ్లు వేయాలని పూర్తి సంకల్పంతో ఉన్నారు. అందుకోసం రూ.2వేల కోట్లతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. టీడీపీ తమ లబ్ది కోసమే ఉద్యమాలు అంటూ రోడ్లపై చిల్లర వేషాలు వేస్తుంది. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు, టీడీపీకి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఎలాంటి హక్కు లేదు. మేము ప్రతిపక్షంలో ఉండగా ఇలా చిల్లర వేషాలు ఎప్పుడూ వేయలేదు. ఇవి మా గుంతలు కాదు... చంద్రన్న గుంతలు.
*రాయలసీమ లిఫ్ట్ పై టీడీపీ స్టాండ్ ఏమిటి..?*
12. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని విమర్శలు చేస్తున్న టీడీపీ, అధికారంలో ఉండగా ఏం చేసింది. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చంద్రబాబు హయాంలోనే పూర్తి చేస్తుంటే.. అప్పట్లోనే మా నాయకుడు ప్రతిపక్ష నేతగా కర్నూలులో జలదీక్ష చేశారు. ఆరోజు చంద్రబాబు ఏం చేశారు. జగన్ మోహన్ రెడ్డిగారు నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ పై టీడీపీ స్టాండ్ ఏమిటి.. గుడ్డిగా రాయలసీమకు అన్యాయం చేశారంటున్నారు.. అంటే రాయలసీమ లిఫ్ట్ పెట్టడం అన్యాయమా.. ప్రజల దగ్గరకు వెళ్ళి అదే చెప్పగలరా..?.
రాష్ట్రానికి కేటాయించిన నీటిని రాయలసీమ ప్రాంతానికి తక్కువ సమయంలో ఎక్కువ నీటిని ఎలా తీసుకు వెళ్లాలో అనేదానిపై ముఖ్యమంత్రిగారు దృష్టి పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు హయంలో ఆల్మట్టీ ఎత్తు పెంచడంతోపాటు, ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతుంటే అప్పుడు ఏం చేశారు. మీకు చెప్పడానికి ఏమైనా ఉంటే కదా?
13. సచివాలయ ఉద్యోగులకు సంబంధించి.. ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, ప్రొహిబిషన్‌లో ఉన్న వారి ఉద్యోగాలు ఎవరివీ పోవు. వారిని పర్మినెంట్ చేసిందుకు, సర్వీస్‌లోకి తీసుకునేందుకే ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్ష నిర్వహించడం సహజం. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి అపోహలు ఎందుకు వచ్చాయో తెలియదు. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే మళ్లీ రాసి సర్వీస్‌లోకి రావడం జరగుతుంది.
14. జగన్‌గారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే... జాబ్ క్యాలెండర్ తీసుకు వచ్చారు. ఈ క్యాలెండర్ అనేది అయిదేళ్లకు సంబంధించిది కాదు. ప్రతి ఏడాది విడుదల చేయడం జరుగుతుంది. ఇది మా ముఖ్యమంత్రిగారి ఆలోచనే. చెప్పింది చేసి చూపించేలా మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దేనికీ ఎక్కడా, ఎవరితో చెప్పించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు., ఓవైపు కోవిడ్, మరోవైపు ఆర్థిక పరిస్థితి బాగో లేకున్నా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది.
15. అవసరాలు పెరిగినప్పుడు అప్పులు చేయడం జరుగుతుంది. కేంద్రం కూడా అదేగా చేసేది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చేవే కదా? ముఖ్యమంత్రిగారు 24 గంటల్లో 16 గంటల పాటు పని చేస్తున్నారు. ప్రభుత్వ డబ్బు, అంటే ప్రజా ధనం దుబారా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు హాయంలో అప్పులు పెరిగాయి కదా? మరి అప్పుడేం చేశారో మరి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడలేదు. అప్పు చేయకుండా ఎలా నోట్లు ముద్రించాలో మరి..?
16. బీజేపీ ఆలయాల సందర్శన అంటూ పర్యటన చేస్తోంది అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ముందుగా పోలవరం ప్రాజెక్ట్ కు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం త్వరగా ఇస్తే పనులు త్వరితగతిన పూర్తవుతాయి. ఇక్కడ యాత్రలు చేసే బదులు, కేంద్రం వద్దకు వెళ్ళి, నిధులు అడిగి తెస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.
addComments
Post a Comment