ఏజెన్సీలోని గిరిజనులకు.. రాజ్యాంగ రెగ్యులేషన్ తో వందశాతం రిజర్వేషన్ఏజెన్సీలోని గిరిజనులకు..

రాజ్యాంగ రెగ్యులేషన్ తో వందశాతం రిజర్వేషన్

ప్రభుత్వాన్ని కోరుతూ గిరిజన సలహామండలి తీర్మానం

షెడ్యూల్ ఏరియాలోకి చేర్చే గ్రామాలతో కొత్త జాబితా

ఆదర్శగ్రామాల పథకంలో 517 గ్రామాల ఎంపిక

సుప్రీంకోర్టు దృష్టికి కొటియా గ్రామాల సమస్య

టీఏసి సమావేశంలో కీలక నిర్ణయాలు

విజయవాడ, జూలై 23 (ప్రజా అమరావతి): ఏజెన్సీ ఏరియాలోని ఉద్యోగాలలో స్థానిక గిరిజనులకు 100శాతం రిజర్వేషన్లు కల్పించడానికి భారత రాజ్యాంగం  షెడ్యూల్డ్ 5లోని 5వ పేరా(2) కల్పిస్తున్న హక్కును వినియోగించుకుంటూ రెగ్యులేషన్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానించింది. షెడ్యూల్ ఏరియాలోకి కొత్తగా చేర్చే గ్రామాలకు సంబంధించిన జాబితాను రూపొందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తీర్మానించింది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఆదర్శగ్రామాల పథకంలో భాగంగా 517 గ్రామాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అధ్యక్షతన శుక్రవారం గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన 112వ గిరిజన సలహా మండలి( టీఏసి) సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జీవో నెంబర్.3 ను సుప్రీంకోర్టు గతంలో కొట్టివేయగా ప్రస్తుతం దానిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ పెండింగ్ లో ఉండగా, దీనిపై వచ్చే తీర్పు ఎలా ఉన్నా గిరిజనులకు అన్యాయం జరగకుండా రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించారు. నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాలలో స్థానిక గిరిజనులకు 100 రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ 5 వ పేరా (2) కింద రెగ్యులేషన్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. ఈ విషయాన్ని టీఏసి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

షెడ్యూల్ ఏరియాలోకి కొత్తగా చేర్చే గ్రామాలను ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనాభా, పరిపాలనా సౌలభ్యం, వెనుకబాటుతనానికి సంబంధించిన మార్గదర్శకాల ప్రకారంగా అన్ని ఐటీడీఏల నుంచి కొత్తగా జాబితాలను తెప్పించాలని నిర్ణయించారు. కొన్ని ఐటీడీఏల నుంచి కొత్త జాబితాలు ఇప్పటికే రాగా, మిగిలిన ఐటీడీఏల నుంచి కూడా వాటిని రప్పించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జాబితాల ప్రకారంగా షెడ్యూల్ ఏరియాలోకి కొత్తగా చేర్చే గ్రామాల సంఖ్య ఇదివరకు నిర్ణయించిన 554 గ్రామాల కంటే తక్కువ లేదా ఎక్కువ ఉండవచ్చునని టీఏసీ ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఆదర్శగ్రామాల పథకం కింద 50 కంటే ఎక్కువ శాతం ఎస్టీలు, 500 కంటే ఎక్కువ జనాభా కలిగి అభివృద్ధిలో వెనుకబడిన 517 గ్రామాలను ఎంపిక చేసినట్లు టీఏసి ప్రకటించింది. ఈ గ్రామాలలో 14 అంశాలకు చెందిన అభివృద్ధి పనులు చేపట్టడం కోసం  ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల వంతున కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుండగా, ఈ మొత్తాలకు ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను మ్యాచింగ్ గ్రాంటుగా మంజూరు చేయనున్నారు. ఐదేళ్లపాటు కొనసాగనున్న ఈ పథకంలో తొలివిడతగా ఈ ఏడాది 100 గ్రామాలను ఆదర్శగ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేయనున్నట్లు ఈ సమావేశంలో ప్రకటించారు.

ఏజెన్సీ ఏరియాలో నిబంధనల ప్రకారంగా గ్రామ పంచాయితీల సిఫార్సుతో స్థానిక గిరిజనులకు, లేదా స్థానిక గిరిజనులతో ఏర్పడిన సంఘాలకు మాత్రమే మైనర్ మినరల్స్ కు చెందిన గనులను కేటాయించాలని టీఏసి స్పష్టం చేసింది.

ఏజెన్సీ ఏరియాలోని పరిస్థితులకు మైదాన ప్రాంతాల్లోని పరిస్థితులకు తేడా ఉంటుందని ఈ నేపథ్యంలో కొత్త విద్యావిధానం అమలులో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకోవాలని, ఎక్కడ కూడా ఏ ఒక్క పాఠశాల మూతపడకుండా చూడాలని టీఏసీ సూచించింది.

ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులోని కొటియా గ్రామాల విషయంలో ఒరిస్సా అధికారులు దౌర్జన్యాలకు పాల్పడడంతో పాటుగా సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తున్నారని, ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ ద్వారా సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

కోవిడ్ కారణంగా గతంలో వాయిదాపడిన పీసా గ్రామ సభలకు చెందిన ఎన్నికలను కూడా వీలైనంత త్వరగా నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. 

ఆదివాసీ మహిళలకు ఆస్తిలో పురుషులతో సమానంగా హక్కును కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న ప్రతిపాదనపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లకు గానీ టీఏసీని ఏర్పాటు చేయలేదని ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీఏసీని ఏర్పాటు చేసి గిరిజన సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన శాసనసభ్యులు పీడిక రాజన్న దొర( సాలూరు), తెల్లం బాలరాజు (పోలవరం),విశ్వసరాయి కళావతి( పాలకొండ), భాగ్యలక్ష్మి( పాడేరు), చెట్టి ఫల్గుణ (అరకు), ధనలక్మి( రంపచోడవరం) గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ రంజిత్ బాషా ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments