• ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం
• యువత నైపుణ్యాలు పెంచుకోవడంపై అవగాహనే లక్ష్యంగా కార్యక్రమం
• 11 విభాగాల్లో నైపుణ్య పోటీలను ప్రారంభించిన చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి
• వాద్వానీ ఫౌండేషన్ సహకారంతో అధ్యాపకులకు ప్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
• నేటి నుంచి 84 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒరాకిల్ శిక్షణా కార్యక్రమాలు
• నేషనల్ కోడింగ్ సమిట్ 2021లో కీనోట్ స్పీకర్ గా పాల్గొన్న ఎండీ బంగారరాజు
అమరావతి (ప్రజా అమరావతి):
ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా యువత తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు వీలుగా 11 కొత్త విభాగాల్లో రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి కార్యాలయంలో వర్చువల్ ద్వారా కేంద్ర నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డితోపాటు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఎండి ఎన్. బంగారరాజు, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారులు శ్రీనాథ్ దేవిరెడ్డి, విద్యాసాగర్ రెడ్డితోపాటు స్టేట్ ఎంగేజ్మెంట్ ఫర్ వరల్డ్ స్కిల్ ఇండియా, వరల్డ్ స్కిల్స్ అకాడమీ సీనియర్ హెడ్ జైకాంత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అటు అన్ని జిల్లాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో విద్యార్థులు, యువత, మహిళలకు ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రపంచస్థాయి నైపుణ్య పోటీల కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 22 విభాగాల్లో నైపుణ్య పోటీలు నిర్వహించామని.. కొత్తగా నిర్వహించే 11 ట్రేడ్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో యువత ఉత్తమ ప్రతిభను కనబరిస్తే వారిని రాష్ట్రం తరుఫున జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
అనంతరం ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు మాట్లాడుతూ యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడంతోపాటు.. ప్రపంచ అభివృద్ధిలో యువత ప్రాధాన్యతను పెంచేందుకు వీలుగా జులై 15ను ఐక్యరాజ్యసమితి 2014లో వరల్డ్ యూత్ స్కిల్స్ డే గా గుర్తించిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ యువతను ఉద్దేశించి ఇచ్చిన సందేశాన్ని బంగారరాజు ప్రస్తావిస్తూ నైపుణ్యవంతులైన యువత ఉంటే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని.. అందుకే విద్యావస్థలో నైపుణ్యాభివద్ధి శిక్షణా వ్యవస్థ చాలా కీలకమన్నారు.
అనంతరం రాష్ట్రంలో త్వరలో ఏర్పాటుకానున్న స్కిల్ కాలేజీల్లో ఇప్పటికే భాగస్వాములైన వాద్వానీ ఫౌండేషన్ సహకారంతో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని అధ్యాపకులకు శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు ప్రారంభించారు. అనంతరం ప్రముఖ కంప్యూటర్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ సహకారంతో రాష్ట్రంలోని 84 ఇంజనీరింగ్ కాలేజీలల్లో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలను ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్, డీన్లతో కలిసి బంగారరాజు ప్రారంభించారు. అనంతరం వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా నేషనల్ కోడింగ్ సమిట్ 2021 పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కీనోట్ స్పీకర్ గా బంగారరాజు పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందుతున్న కోడింగ్ ప్లాట్ఫామ్ ను ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథ్స్) ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యత ఇచ్చే అంశాలపై చర్చించారు.
అంతకుముందు స్టేట్ ఎంగేజ్మెంట్ ఫర్ వరల్డ్ స్కిల్ ఇండియా, వరల్డ్ స్కిల్స్ అకాడమీ సీనియర్ హెడ్ జైకాంత్ సింగ్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన నైపుణ్య పోటీల్లో 22కుపైగా విభాగాలతోపాటు ఆరు సాంప్రదాయ నైపుణ్య పోటీలకు రాష్ట్రం ప్రాతినిథ్యం వహించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో తెలుగువారి ప్రాథినిత్యమే అందుకు నిదర్శనమని జైకాంత్ సింగ్ అన్నారు.
ఈ కార్యక్రమానికి ఎపిఎస్‌ఎస్‌డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ డి.వి.రామకోటిరెడ్డి కె.విజయ్ మోహన్ కుమార్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు, జిల్లాల నుంచి ఎపిఎస్‌ఎస్‌డిసితోపాటు రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొంటున్న యవత హాజరయ్యారు.
addComments
Post a Comment