రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ) గా చల్లా మధుసూదన్ రెడ్డి

 • రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ) గా చల్లా మధుసూదన్ రెడ్డి


• రెండేళ్లపాటు నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేసిన అనుభవం

• పార్టీ ఆవిర్భావం నుంచీ జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచిన చల్లా

• పార్టీ ఐటీ విభాగం కన్వీనర్ గా.. పార్టీ సెక్రెటరీగా సేవలు

• ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం

 

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖ సలహాదారుగా చల్లా మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ గా చల్లా మధుసూదన్ రెడ్డి ఉన్నారు. 

చల్లా మధుసూదన్ రెడ్డి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లి పదేళ్లపాటు ఉద్యోగం చేసి 2010లో రాష్ట్రానికి తిరిగి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకై ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపట్ల ఆకర్శితుయ్యారు. పార్టీ పెట్టిన మొదటి రోజునుంచే జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. 


ఆతర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఐటీ విభాగం కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న విద్యాధికులను, జగన్ మోహరెడ్డి అభిమానులను సమీకరించి.. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చల్లా మధుసూదన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. 


2014 ఎన్నికల తర్వాత పార్టీ ఐటి విభాగంతోపాటు, పార్టీ సెక్రెటరీగా నియమించబడ్డారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా 13 జిల్లాల్లో నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు వేసే కార్యక్రమాన్ని పార్టీలో పెద్దలైన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వి సుబ్బారెడ్డిలతో సమన్వయం చేసుకుంటూ ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ వచ్చారు. అనంతరం 13 జిల్లాల్లో పార్టీ బూత్ కమిటీల శిక్షణా కార్యక్రమాలకు చల్లా మధుసూదన్ రెడ్డి స్వయంగా హాజరవుతూ పర్యవేక్షిస్తూ వచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ అబ్జర్వర్ల కార్యక్రమాలను పర్యవేక్షించడంతోపాటు   సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. 


2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చల్లా మధుసూదన్ రెడ్డికి ఎంతో ప్రాముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి)కు చైర్మన్ గా నియమించారు. ఈ రెండేళ్ల కాలంలో ఎపిఎస్‌ఎస్‌డిసిలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తద్వారా రాష్ట్రంలోని వేలాది మంది యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేశారు. ముఖ్యంగా పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా శిక్షణా కార్యక్రమాల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. క్రాఫ్ట్, టూరిజం ఇతర రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా మహిళలకు శిక్షణ కార్యక్రమాలు అమలు చేయడంలో కిలకంగా వ్యవహరించారు. చల్లా మధుసూదన్ రెడ్డి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో అసోచామ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ ఇండియా సమిట్ అండ్ అవార్డ్స్ లో దేశంలోనే అత్యత్తుమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకం సాధించింది. ప్రతి విభాగంలో క్రమపద్దతిలో డాక్యుమెంటేషన్, రికార్డులు, ఫైళ్ల నిర్వహణ నిర్ధిష్ట ప్రమాణాలుకు అనుగుణంగా చేస్తున్నందుకుగాను ఎపిఎస్‌ఎస్‌డిసికి ఐఎస్ఓ 9000-2015 గుర్తింపు రావడంతోపాటు కరోనా కారణంగా లాక్డౌన్ సమయంలోనూ 2.25 లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఆన్ లైన్ ద్వారా నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను కొనసాగించినందుకు గాను "ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు" సాధించింది. అంతేకాకుండా పరిశ్రమల్లోనే  యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి.. శిక్షణ పూర్తి చేసుకున్నవారిని అక్కడే ఉద్యోగంలోకి తీసుకునే పరిశ్రమల అనుకూలిత నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. స్కిల్ కాలేజీల ఏర్పాటులో భాగంగా ఇప్పటికే 30 వరకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. వీటిలో ఐబీఎమ్, టెక్ మహీంద్రా, డెల్ టెక్నాలజీస్, హెచ్ సీఎల్, బయోకాన్, ష్నైడర్ ఎలక్ట్రికల్స్, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐ.టి.డి.సి), ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ, జేబీఎం గ్రూప్, దాల్మియా భారత్ ఫౌండేషన్, ఎన్ఎస్ఈ అకాడమీ, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి ప్రముఖ సంస్థలను స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం చేసేలా ఒప్పందాలు జరిగాయి.  ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి స్కిల్ కాలేజీ ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. అందులో భాగంగానే  దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవలే పులివెందులలో స్కిల్ అకాడమిని ప్రారంభించారు. 

  

నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖకు సలహాదారుగా నియమించడంపై చల్లా మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ ఏర్పాటు చేసి.. స్థానికంగానే యువతకు శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాల కల్పించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నెరవేర్చడమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. ఇప్పటికే స్కిల్ కాలేజీలకు స్థల సేకరణ పూర్తయిందని.. ప్రభుత్వ అనుమతులు కూడా వచ్చాయని.. తర్వలోనే ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నామన్నారు. ఎపిఎస్‌ఎస్‌డిసితోపాటు నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖలో భాగమైన సీడాప్, ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్, ఐటిఐ, పాలిటెక్నిక్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖ సలహాదారుగా నియమితులైన చల్లా మధుసూదన్ రెడ్డి  చెప్పారు.