శ్రీనాగ బంగారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠను వైభవోపేతంగా జరిపించండి

 


- శ్రీనాగ బంగారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠను వైభవోపేతంగా జరిపించండి


 

- మంత్రి కొడాలి నానిని ఆహ్వానించిన అభివృద్ధి కమిటీ 



గుడివాడ, ఆగస్టు 10 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వలివర్తిపాడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీనాగ బంగారమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహెూత్సవాలను వైభవోపేతంగా జరిపించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆలయ అభివృద్ధి కమిటీకి సూచించారు. మంగళవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఆలయ అభివృద్ధి కమిటీ ధర్మకర్తలు కోనా ఆదినారాయణ, కోనా మోహన్ బంగారు బాబు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వందేళ్ళ పూర్వం నుండి భక్తులచే పూజలందుకుంటున్న బంగారమ్మ తల్లి ఆలయాన్ని జీర్ణోద్ధారణ గావించామన్నారు. తొమ్మిది శుక్రవారాల పాటు తొమ్మిది ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పిస్తే ఎటువంటి కోరికైనా అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసమని తెలిపారు. ఈ నెల 27 వ తేదీ ఉదయం 7.47 గంటలకు యాషీక బ్రహ్మ శ్రీమాన్ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలను వైభవోపేతంగా జరుపుతున్నామన్నారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత చుండి బాబి తదితరులు పాల్గొన్నారు.

Comments