ఎపిలో ఎస్సిలు,మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలు ప్రశంసనీయం

 ఎపిలో ఎస్సిలు,మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలు ప్రశంసనీయం


గుంటూరు సంఘటనపై ఎపి ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం

ఈకేసులో పనిచేసిన అధికారులకు కేంద్రప్రభుత్వ అవార్డులకు సిఫార్సు చేస్తాం

ఎపిలో ఎస్సిలపై దాడుల సమీక్షకు ప్రత్యేక సెల్ ఏర్పాటుకు కృషి

జాతీయ ఎస్సి కమీషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్.

అమరావతి,24 ఆగస్టు (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సిలు ముఖ్యంగా మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ పేర్కొన్నారు.ఇటీవల గుంటూరులో దారుణ హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థిణి ఎన్.రమ్య సంఘటనపై పరిశీలనకు వచ్చిన జాతీయ షెడ్యూల్ కులాల కమీషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ మంగళవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్,పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ తదితర అధికారులతో సమావేశం అయ్యారు.ఈసందర్భంగా ఎస్సి కమీషన్ ఉపాధ్యక్షులు హల్దార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన చాలా తీవ్రమైందని ఈఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి ప్రివెన్సన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్టు(పీవోఏ చట్టాన్ని)సక్రమంగా అమలు చేసిందని కొనియాడారు.అంతేగాక బాధిత కుటుంబానికి సకాలంలో పరిహారాన్ని కూడా అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించడమేగాక చార్జిషీటు కూడా ఫైల్ చేశారని ఇంత వేగంగా స్పందించడం పట్ల ఏపీ ప్రభుత్వం తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈసంఘటనపై పని చేసిన అధికారులకు అవార్డులకై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని అరుణ్ హల్దార్ చెప్పారు. దేశం మొత్తం ఏపీ వ్యవహరించిన తీరును పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఏపీ లో ఇతర కేసుల వ్యవహారం లోను ఇదే విధంగా స్పందించాలని కమిషన్ కోరుకుంటోందని తెలిపారు.ఎస్సిల పై జరుగుతున్న దాడులకు సమీక్షకు ఏపీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం గురించి ప్రయత్నాలు చేస్తున్నామని జాతీయ ఎస్సి కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ చెప్పారు.

ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కులాల అభివృద్ధి సంక్షేమం,భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు.గుంటూరు సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన స్పందించి బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచిందని చెప్పారు.బాధితరాలు తల్లికి  ఎస్సి,ఎస్టి పిఓఏ నిబంధనల ప్రకారం 8లక్షల 25వేల రూ.ల పరిహారాన్ని అందించడం తోపాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 10లక్షల రూ.లు ముఖ్యమంత్రి సహాయనిధి కింద పరిహారాన్ని అందించడం జరిగిందన్నారు.అంతేగాక ఇంటిపట్టాను మంజూరు చేసి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా స్వంత ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని వివరించారు.దిశ చట్టాన్ని తీసుకువచ్చి మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు.

రాష్ట్రంలో ఎస్సి,ఎస్టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ పేర్కొన్నారు.ఇందుకై ఎస్సి,ఎస్టి ప్రజాప్రతినిధులు,ఆయా సంఘాల ప్రతినిధులతో సంప్రదించి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపి)ను రూపొందించి అమలు చేయడం జరుగుతోందని తెలిపారు.పిఓఏ చట్టం అమలుకు సంబంధించి గత ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ లెవెల్ హైపవర్  విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగిందని,అలాగే జిల్లాల్లో జిల్లా కలక్టర్ల అధ్యక్షన క్రమం తప్పకుండా ఎస్సి,ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీల సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. అదే విధంగా త్వరలో పిఓఏకు సంబంధించి ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా అందుబాటులోకి తేనున్నట్టు సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు.

సమావేశంలో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ ఈసంఘటన జరిగిన వెంటనే పోలీస్ యంత్రాంగం యుధ్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేపట్టి అన్ని ఆధారాలు సేకరించి కేసు వేగవంతం చేసి చార్జిషీటును ఫైల్ చేసిందని వివరించారు.రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకుని వచ్చి మహిళలు భద్రతకు అన్ని విధాలా భరోసా కల్పించడం జరుగుతోందని చెప్పారు.పోలీస్ సేవా యాప్ ద్వారా గత 10 మాసాల్లో 7లక్షల 4వేల వరకూ ఎఫ్ఐఆర్ లను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు.పోలీస్ శాఖలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తుండగా గత ఏడాదిన్నర కాలంలో 34వేల కేసులు రిజిష్టర్ అయ్యాయని వాటిలో 52శాతం ఫిర్యాదులు మహిళలకు సంబంధించినవే ఉంటున్నాయని డిజిపి గౌతం సవాంగ్ వివరించారు.దిశ యాప్ ను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేయడంతో రాష్ట్రానికి 5 జాతీయ అవార్డులు వచ్చాయని డిజిపి గౌతం సవాంగ్ పేర్కొన్నారు.

ఈసమావేశంలో జాతీయ ఎస్సి కమీషన్ సభ్యులు డా.అంజు బాల,సుభాష్ ఫర్ది, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే,ఆశాఖ కమీషనర్ హర్ష వర్ధన్,పోలీస్ శాఖ డిఐజిలు రాజకుమారి,పాల్ రాజు,గుంటూరు జిల్లా రూరల్ అండ్ అర్బన్ ఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

      

Comments