మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసమే ఫోర్టిఫైడ్ బియ్యం
సద్వినియోగం చేసుకొని పౌష్టికాహార లోపాలు నివారించాలి
కేవలం రాష్ట్రంలో మన జిల్లాలోనే ఈ బియ్యం పంపిణీ
కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి - మాస్కులు ధరించాలి ; జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి
సచివాలయాలకు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలి; సచివాలయ సిబ్బందికి హితవు
నెల్లిమర్లలో వార్డు సచివాలయం తనిఖీ
విజయనగరం, ఆగష్టు 03 (ప్రజా అమరావతి); మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాలు నివారించడానికే రాష్ట్ర ప్రభుత్వం పోషక విలువలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేస్తోందని, రాష్ట్రంలో ఒక్క విజయనగరం జిల్లాలోనే ఈ బియ్యం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని దీనిని జిల్లా మహిళలంతా సద్వినియోగం చేసుకొని తమ, తమ పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. సాధారణ బియ్యంకు విటమిన్లు, ఖనిజాలను జోడించడం ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం రూపొందిస్తారని చెప్పారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 వంటి కీలక సూక్ష్మ పోషకాలను ఈ బియ్యంలో చేరుస్తారని, తద్వారా పోషకాహార లోపాలను అధిగమించవచ్చన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ లో వార్డు సచివాలయం తనిఖీ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బంది, నగర పంచాయతీ పాలకవర్గ ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ బియ్యం వల్ల పిల్లల్లో కూడా ఎదుగుదల మెరుగ్గా ఉంటుందన్నారు.
జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి తొలిసారిగా నెల్లిమర్ల నగర పంచాయతీ నుంచి క్షేత్రస్థాయి పర్యటనలకు మంగళవారం శ్రీకారం చుట్టారు. తొలుత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచే గోదామును సందర్శించి అక్కడ చేపట్టిన భద్రత చర్యలను తనిఖీ చేశారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు ఆ భవనానికి చేపట్టిన మరమ్మత్తులు, ఇ.వి.ఎం.ల పరిరక్షణకు చేపట్టిన చర్యలను వివరించారు. అక్కడ రిజిష్టరులో కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ వైస్ చైర్మన్ రామారావు జిల్లా కలెక్టర్‌ను కలసి నగర పంచాయతీలో సమస్యలను వివరించారు.
అనంతరం నగర పంచాయతీలో గాంధీనగర్ ప్రాంతంలోని 6, 7 నెంబరు వార్డు సచివాలయాలను కలెక్టర్ సూర్యకుమారి సందర్శించి సచివాలయ పనితీరును తనిఖీ చేశారు. నగర పంచాయతీ సమస్యలపై మునిసిపల్ చైర్ పర్సన్ బంగారు సరోజిని, వైస్ చైర్మన్ రామారావు తదితరులు వివరించారు. ముఖ్యంగా గాంధీనగర్ ప్రాంతంలో తాగునీటి సమస్య కొన్ని ఏరియాల్లో ఉందని వివరించగా, దీనిపై కమిషనర్ రామప్పల నాయుడు వివరిస్తూ ఈ సమస్య పరిష్కారానికి బోర్లు వేయడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని, చంపావతిలోని ఒకే ఇన్ టేక్ వెల్ పై ఆధారపడటం వల్ల నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తున్నట్టు తెలిపారు. నగరంలో వైద్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, కరోనా నియంత్రణ చర్యలపై కలెక్టర్ ఆరా తీశారు. మహిళాశిశు సంక్షేమ కార్యక్రమాలు ఏవిధంగా జరుగుతున్నదీ సిడిపిఓను అడిగి తెలుసుకున్నారు. తల్లిపాల వారోత్సవాల గురించి మాట్లాడుతూ స్థానిక ప్రతినిదులను కూడా వీటిలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనాపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారని, మాస్క్ ధరించడంపై అవగాహన కలుగజేసి ప్రతి ఒక్కరూ ధరించేలా చూడాల్సి ఉందన్నారు. కోవిడ్ పట్ల అజాగ్రత్తగా ఉన్నట్టు గమనించానని, చాలా మంది మాస్క్ లేకుండా కనిపించారని పేర్కొంటూ మాస్క్ తప్పనిసరి చేయాలని చెప్పారు. దుకాణాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించారు.
వార్డు సచివాలయ సిబ్బందిపైనే ప్రభుత్వ పథకాల అమలు ఆధారపడి వుంటుందన్నారు. సచివాలయ సిబ్బంది తమ వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించి వారితో సౌమ్యంగా వ్యవహరించాలన్నారు. వివిధ సమస్యలపై ఏదైనా వినతులు అందించేందుకు వచ్చేవారికి వారిని ఒప్పించే రీతిలో సమాధానం చెప్పాలని, వారిని నొప్పించే రీతిలో వ్యవహరించవద్దన్నారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలపై కిందిస్థాయిలో అవగాహన పెంపొందించాల్సి వుందన్నారు. సచివాలయ స్థాయిలో బాధ్యతాయుతంగా సమాధానం ఇచ్చినట్లయితే జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పారు.
ఆదర్శంగా నెల్లిమర్ల రూపొందాలి
నెల్లిమర్ల నగర పంచాయతీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పురపాలక సంఘంగా తీర్చిదిద్దడానికి పాలకవర్గం, సచివాలయ సిబ్బంది అంతా కలసి సమిష్టిగా కృషిచేయాలని కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి కోరారు. ఈ కృషిలో తన వంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు.
అంతకుముందు ఇ.వి.ఎం. గోదాముల వద్ద తహశీల్దారు ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలకోసం భూసేకరణ, ఎంపిడిఓ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణం, హెల్త్ క్లినిక్ ల నిర్మాణం తదితర అంశాలపై తహశీల్దార్ సీతారామరాజు, ఎంపిడిఓ రాజ్‌కుమార్‌లను అడిగి తెలుసుకున్నారు.
addComments
Post a Comment