- జగనన్న పచ్చతోరణం - వన మహోత్సవం స్పూర్తితో మొక్కలను అందజేయడం అభినందనీయం
- గుడివాడలో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు
- కేక్ ను కట్ చేసిన రాష్ట్ర మంత్రి కొడాలి నాని
గుడివాడ, ఆగస్టు 9 (ప్రజా అమరావతి): జగనన్న పచ్చతోరణం - వన మత్సవం స్పూర్తితో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో వంద మొక్కలను అందజేయడం అభినందనీయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూర్ రోడ్డులోని ఫర్నీచర్ పార్క్ లో అభిమానుల సమక్షంలో మంత్రి కొడాలి నాని కేక్ ను కట్ చేశారు. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అగ్ర హీరోగా వెలుగొందుతున్న ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గత రెండేళ్ళలో రాష్ట్రంలో 33 కోట్ల మొక్కలను నాటామన్నారు. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానులు జూనియర్ జమదగ్ని, పవన్, సాయి, అభి, ప్రసాద్, నాని, బ్రో నాగేంద్ర, నిఖిల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment