కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక




- కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక 


- గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో పీడియాట్రిక్ వార్డు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, ఆగస్టు 10 (ప్రజా అమరావతి): కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో థర్డ్ వేవ్ నేపథ్యంలో సిద్ధం చేస్తున్న పీడియాట్రిక్ వార్డు, కోవిడ్ కేంద్రంలో కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కరోనా థర్డ్ ను దృష్టిలో పెట్టుకుని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో పీడియాట్రిక్ వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 20 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. వీటిలో 10 ఐసీయూ బెడ్స్ ఉంటాయని తెలిపారు. ప్రభుత్వాసుపత్రికి అదామా కంపెనీ ఆక్సిజన్ గ్యాస్ జనరేట్ ప్లాంట్ ను అందజేసిందన్నారు. టెక్నీషియన్లు ప్లాంట్ ను బిగించే పనిలో ఉన్నారని చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా నిరంతరాయంగా ఆక్సిజన్ బెడ్స్ పై చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన ఆక్సిజన్‌ను అందజేయవచ్చన్నారు. ఈ ప్లాంట్ తో పాటు ప్రభుత్వం కూడా మరో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాదాపు 200 మందికి పైగా కోవిడ్ రోగులకు వైద్యం అందించామని, ప్రస్తుతం ఈ కేంద్రంలో ఏడుగురు కరోనా వైరస్ సోకిన రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులను ధరించి మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం కూడా నిబంధనలను కొద్దికొద్దిగా సడలిస్తూ వస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. ఇదిలా ఉండగా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 462 ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా వరకు 50 నుండి 100 పడకల లోపు ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. 100 పడకల కంటే ఎక్కువగా 65 ఆసుపత్రులు ఉన్నాయన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డీ టైప్ ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందన్నారు. అలాగే ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించామన్నారు. సాధారణ పడకలతో పాటు ఆక్సిజన్ పడకలు కూడా సిద్ధమవుతున్నాయన్నారు. ఎటువంటి సమయంలో రోగులు వచ్చినా వారికి వైద్య సేవలందించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ, ఎంబీబీఎస్, పీజీ చదువుతున్న వైద్య విద్యార్థులను కూడా కోవిడ్ సేవల్లో వినియోగించుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Comments