వెనకబడిన వర్గాల, పేద పిల్లల కోసం ఎంత మందితో పోరాడటానికైనా సీఎం జగన్మోహనరెడ్డి సిద్ధం

 


- వెనకబడిన వర్గాల, పేద పిల్లల కోసం ఎంత మందితో పోరాడటానికైనా సీఎం జగన్మోహనరెడ్డి సిద్ధం 


- ఇంగ్లీష్ విద్య అంటే తెలుగు భాష నాశనమవుతుందన్నారు 

- వెంకయ్య, చంద్రబాబులు ఏ మీడియంలో చదివించారు 

- ప్రశ్నించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



నందిగామ (కృష్ణా జిల్లా), ఆగస్టు 16 (ప్రజా అమరావతి): సమాజంలో పేద, వెనకబడిన వర్గాల ప్రజలు, వారి పిల్లల కోసం ఎంత మందితో పోరాడటానికైనా సీఎం జగన్మోహనరెడ్డి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. సోమవారం కృష్ణాజిల్లా నందిగామలో జరిగిన నాడు - నేడు కార్యక్రమం, జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించేందుకు శ్రమిస్తుంటారని చెప్పారు. సీఎం జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని పేద విద్యార్థులను ప్రయోజకులను చేసేందుకు ఎంతగానో కష్టపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పిల్లలందరినీ చదివిస్తే భవిష్యత్తులో వారంతా ఉన్నతస్థాయికి ఎదిగి కుటుంబాలను పోషించుకోగలుగుతారన్న ఆలోచనలో సీఎం జగన్మోహనరెడ్డి ఉన్నారన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తే పోటీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తారన్న నమ్మకంతో ఉన్నారని చెప్పారు. చదువుకునే పిల్లల కోసం ఇప్పటి వరకు దాదాపు రూ. 30 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. దాదాపు 15 వేలకు పైగా పాఠశాలలను నాడు - నేడు రెండవ విడతలో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలని భావిస్తే ఎంత గందరగోళం జరిగిందో ప్రజలంతా చూశారని అన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెడితే రాష్ట్రంలో తెలుగుభాష నాశనమవుతుందని, సీఎం జగన్మోహనరెడ్డి తెలుగు భాషను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడని ఇష్టానుసారంగా విమర్శలు చేశారని చెప్పారు. వెంకయ్యనాయుడు తన పిల్లలు , మనవళ్ళను ఏ మీడియం స్కూల్లో చదివించారని సీఎం జగన్మోహనరెడ్డి ధైర్యంగా ప్రశ్నించారన్నారు. ఈనాడు రామోజీరావు కూడా తన పిల్లలు, మనవరాళ్ళను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించారన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదివించారన్నారు. సిగ్గులేని చంద్రబాబు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే తన కొడుకును చదివించాడన్నారు. మనవడిని కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదివించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తెలుగుభాషను కాపాడాల్సిన బాధ్యత ఆర్ధికంగా, సామాజికంగా వెనకబడిన , ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల పైనే ఉందా అని సీఎం జగన్ ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. చదువకునే పిల్లలకు ఏం కావాలో అందరి కన్నా ఎక్కువగా జగన్మోహనరెడ్డి మాత్రమే ఆలోచన చేస్తున్నారన్నారు. ఎటువంటి విమర్శలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టించుకోవద్దని, సీఎం జగన్మోహనరెడ్డికి ప్రజలంతా సహకరించాలని కోరారు. నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రజలంతా సొంతం కార్యక్రమంగా తీసుకోవాలని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ కల్పన, జిల్లా కలెక్టర్ జే నివాస్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మన్ ఎం ఆరుణకుమార్, మున్సిపల్ చైర్మన్ పద్మావతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ శోభిత, డీఈవో తాహేరా సుల్తానా, సమగ్ర శిక్షా అడిషినల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయదుర్గ, మున్సిపల్ కమిషనర్ జయరాం, మండల తహసీల్దార్ డీ చంద్రశేఖర్, ఎంఈవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Comments