వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంభనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను అధ్యయనం చేయాలని

 తాడేపల్లి (ప్రజా అమరావతి);   వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంభనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను అధ్యయనం చేయాలని


రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయంలో వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామపంచాయతీల్లో లేఅవుట్లు, తదితర అంశాలపై సంబంధిత శాఖ  అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలను ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో లక్షలాది మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించడంతో పాటు, వ్యాపారాలు, స్వయం ఉపాధి దిశగా వారిని నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని, దీనిలో భాగంగా ఇప్పటికే రిలయన్స్, ఏజియో, మహేంద్ర అండ్ ఖేథీ వంటి ప్రముఖ సంస్థలు మార్కెటింగ్, శిక్షణ ఇచ్చేందుకు  ముందుకు వచ్చాయని,  13 జిల్లాల్లో  స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను సెర్ప్ అధికారులు పరిశీలించాలని ఆయన  సూచించారు. 

 గత ఏడాది అక్టోబర్ 12న మొదటిదశగా 24 లక్షల  మంది లబ్దిదారులకు రూ.4500 కోట్లు అందజేశామని,  78 వేల రిటైల్ షాపులను ఏర్పాటు చేశామని, అలాగే 1,19,000 పశువులు, 70,955 గొర్రెలు మేకలను కొనుగోలు చేసుకున్నారని,  రెండో దశగా  ఈ ఏడాది 23.44 లక్షల మంది మహిళలకు రూ.4,400 కోట్లు  అర్ధిక సాయం అందించామని మంత్రి  తెలిపారు. మంచి ఆశయంతో సీఎం ప్రారంభించిన ఈ పథకాన్ని అమలు, పర్యవేక్షించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని  ఆయన కోరారు. 

అర్హత ఉన్న ప్రతిఒక్కరికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని, హెల్త్ పెన్షన్లు పొందుతున్న వారిలో కొందరు అనర్హులు కూడా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నా  నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరిపి, వైద్య అధికారుల నుంచి నివేదికలు  తెప్పించుకోవాలని,  వితంతు, ఒంటరి మహిళ పెన్షన్ల జారీలో ఎక్కడా పొరపాట్లు లేకుండా అర్హతలను గుర్తించాలని అన్నారు.  

  గ్రామ పంచాయతీల్లో ఎల్ఇడి వీధిదీపాల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్  ఏజెన్సీ పనితీరు పట్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యుత్ బిల్లులు తగ్గించాలనే లక్ష్యంతో జగనన్న పల్లెవెలుగు కింద ఎల్ఇడి బల్బ్ లను ఏర్పాటు చేశామని, అయితే వీటి నిర్వహణలో కాంట్రాక్ట్  ఏజెన్సీ విఫలమయ్యిందని అన్నారు. ఎల్ఇడి బల్బ్ ల నిర్వహణను  నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానం విషయంలో కాంట్రాక్ట్ ఏజెన్సీ సత్వర చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆదాచేసిన ధనం  విద్యుత్ బిల్లులకు  చెల్లించాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై పంచాయతీలకే వీధిదీపాల నిర్వహణను అప్పగించే అంశాలను పరిశీలించాలని సూచించారు. ఇందుకు  గ్రామసచివాలయాల సహకారం తీసుకోవాలని, ఎనర్జీ అసిస్టెంట్లను వీధిదీపాల నిర్వహణలో భాగస్వాములను చేయాలని, నిర్ణీత సమయాలలోనే వీధిదీపాలు వెలిగేలా చూడాలని మంత్రి  పెద్దిరెడ్డి అన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలని, అనధికారిక లేఅవుట్ల పై చర్యల కోసం ఇటీవల విజిలెన్స్ బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయించామని, తద్వారా  మొత్తం 10,169 లేఅవుట్లు అక్రమగా ఉన్నట్లు గుర్తించామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ లేఅవుట్ల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని, వెంటనే నోటీసులు జారీ చేసి,  అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమ లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేసి, ప్రజలు నష్టపోకుండా రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ఈ లేఅవుట్ల సమాచారంను పంపి, రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని, కేవలం 6048 అప్రూవ్డ్  లేఅవుట్స్ మాత్రమే ఉన్నాయని, అనధికారిక నిర్మాణాలపై భారీగా జరిమానాలు విధించాలని మంత్రి సూచించారు. ఇకపై యుడిఎ అనుమతులు ఇచ్చే క్రమంలో పంచాయతీ అనుమతి ఖచ్చితంగా ఉండేలా చేసి  సమస్యను పరిష్కరించాలని, అందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. 

ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సిఇఓ ఎన్ఎండి ఇంతియాజ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments