కల్వపూడి అగ్రహారం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని

 


 


- కల్వపూడి అగ్రహారం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని 


- సర్పంచ్, ఎండీవోతో కలిసి శిలాఫలకం ఆవిష్కరణ గుడివాడ, ఆగస్టు 21 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శనివారం ప్రారంభించారు. గుడివాడ ఎండీవో ఏ వెంకటరమణ, గ్రామ సర్పంచ్ పోటూరి వెంకటేశ్వరమ్మ, గ్రామ పెద్దలతో కలిసి మంత్రి కొడాలి నాని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామ సచివాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సీఎం జగన్మోహనరెడ్డి ఎంతో ముందు చూపుతో దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలను తీసుకువచ్చారని చెప్పారు. ఈ వ్యవస్థల ద్వారా ప్రజల ఇంటి దగ్గరకే ప్రభుత్వ సేవలను అందించడం జరుగుతోందన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సర్వీస్ల జాబితాలను అందుబాటులో ఉంచాలన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ తో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన ఫోన్ నెంబర్లను సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హుల జాబితాలను తప్పనిసరిగా అతికించాలన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు రాకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలనే దానిపై ఫోన్ నెంబర్లను కూడా ఉంచాలన్నారు. సచివాలయాలకు ఇచ్చిన బయోమెట్రిక్ పరికరాలు, స్కానర్లు, హార్డ్ వేర్ సరిగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. రిజిష్టర్లు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు, వాలంటీర్ల హాజరు వంటివి కూడా సక్రమంగా జరగాలన్నారు. హాజరు తర్వాత సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ప్రజలను చిరునవ్వుతో స్వాగతించడం ముఖ్యమన్నారు. రాష్ట్రంలోని సచివాలయాల పనితీరుపై సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికపుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. సిబ్బంది క్రమశిక్షణను పాటించాలని సూచిస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, పంచాయతీరాజ్ డీఈ హరనాథ్ బాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్లు ఏలేటి అగస్టీన్, వెలిసేటి సరళ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, పర్నాస సర్పంచ్ గొర్ల రాజేష్, పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ, గ్రామ ప్రముఖుడు చెర్వు ప్రదీప్ శ్రీరామసాయి, వైసీపీ నేతలు పోటూరి శ్రీమన్నారాయణ, అద్దేపల్లి పురుషోత్తం, కఠారి రాంబాబు, బచ్చు మణికంఠ, కోట రాకేష్, కోట మహేష్, తాళ్ళూరి ప్రశాంత్, అద్దేపల్లి హరిహరప్రసాద్, జీ హర్ష శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్యశర్మ తదితరులు పాల్గొన్నారు.