అమరావతి (ప్రజా అమరావతి); రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన స్వచ్ఛ సంకల్పం
కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు హృదయ పూర్వకంగా ఆచరించి విజయవంతం చేయాలనీ, గ్రామాలు ఆహ్లాదకర వాతావరణానికి నిలయాలని చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమం పంచాయతీరాజ్ ఉద్యోగులు ఒక అవకాశంగా భావించి చిత్తశుద్దితో అమలు పర్చాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా రిసోర్స్ పర్సన్స్ ల ఒక్కరోజు శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరై అయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ లను ఉద్దేశించి మాట్లాడుతూ స్వచ్చత, పరిశుభ్రత చాలా ముఖ్యమని, కరోనా ప్రారంభ దశ నుంచి పట్టణాలతో దీటుగా గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టామని, పైలెట్ గా మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని అమలు పర్చి గణనీయ ఫలితాలు సాధించామని దానికి కొనసాగింపు గానే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని తీసుకున్నామని అన్నారు. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ భావనకు పెద్దపీట వేయడంతో చాలామంది గ్రామాలకు వచ్చారని అంటూ గ్రామ సచివాలయాలు ప్రారంభమయ్యాక 12మంది ప్రభుత్వ ఉద్యోగులు, వాలెంటీర్లు తదితర సిబ్బంది గ్రామస్తులకు అందుబాటులోకి వచ్చారని అవసరమైన సిబ్బంది, నిధులు, పనిచేసే వాతావరణం, సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలమని నిరుపించారని అన్నారు.
తడి చెత్త, పొడిచెత్త వేర్వేరుగా వేసేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, రోడ్డుపై చెత్త వేయరాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరి మనుసులో నాటాలని, గ్రీన్ అంబాసిడర్స్ రోస్టర్ విధానంలో చెత్త సేకరించేలా చర్యలు తీసుకోవాలని, ద్రవ్య వ్యర్ధాలు రోడ్డు మీదకు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని, సిసి రోడ్లు, కచ్చ డ్రైన్లు లేని చోట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కమిషనర్ అన్నారు. గ్రామంలో అవసరమైనన్ని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, పరిశుభ్రత పట్ల ప్రతి ఒక్కరి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని రిసోర్స్ పర్సన్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ సూచించారు.
స్వచ్చంధ్ర కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ 1320 గ్రామాల్లో అమలు పర్చిన మనం- మన పరిశుభ్రత కార్యక్రమానికి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, అదే స్పూర్తితో ఇప్పుడు రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నామని, మన కార్యక్రమాన్ని యూనిసెఫ్ ప్రత్యేకంగా గుర్తించిందని అంటూ కంటికి పరిశుభ్రమైన వాతావరణాన్ని చూపించినప్పుడు ప్రజలందరూ ఉత్తేజితులవుతారని అన్నారు. శిక్షణా కార్యక్రమలోని సమాచారాన్ని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్ళి ప్రజల్లో ఇంకా అవగాహన పెంచాలని రిసోర్స్ పర్సన్లను అయన కోరారు
చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ద్వారా వచ్చే వర్మి కంపోస్ట్ లను గ్రామీణాభివృద్ధి శాఖలో చేపడుతున్న మొక్కల పెంపకానికి వినియోగించుకోవాలని నిర్ణయించారని, దీనివల్ల పంచాయతీకి ఆదాయం రావడమే కాక, గ్రామాల్లోని చెత్త కుప్పలు అదృశ్యమవుతాయని ఒఎస్.డి దుర్గాప్రసాద్ అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం అమలులో రిసోర్స్ పర్సన్ల పాత్ర కీలకమైనదని, అందుకే ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని, ప్రజలు, ప్రజాప్రతినిధులని ఇందులో భాగస్వాములుగా చేసి అందరు బృందంగా పనిచేసినట్లయితే గణనీయమైన ఫలితాలను సాధించవచ్చని అయన అన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమలో పంచాయతీరాజ్అధికారులు, తదితరులు పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్లు వారి అభిప్రాయాలు, అనుభవాలను అధికారులతో పంచుకున్నారు.
addComments
Post a Comment