పిదప కాలం..పిదప బుద్దులు !

 పిదప కాలం..పిదప బుద్దులు ! 



'' వెయ్యి రూపాయలిస్తా. చేస్తే చెయ్యి లేకుంటే వెళ్లు !'' 

అంటూ రుసరుసలాడింది విజయ. 

'' గిట్టుబాటు కాదమ్మా. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా 

కుటుంబం గడవడం లేదు. రెండు వేలిస్తే వస్తానమ్మా ! '' 

అని పని మనిషి తెగేసి చెప్పింది. 

అరగంటసేపు ఇద్దరి మధ్య బేరసారాలు నడిచాయి. 

చివరకు నెలకు రూ.1500కు విజయ కష్టంగా అంగీకరించింది. 

'' మీ పనే బావుంది. నాలుగైదు ఇళ్లల్లో పైపైన పనులు చేసి 

నెలకు బోలెడు సంపాదిస్తున్నారు ! '' 

పనిమనిషి వైపు చూస్తూ విజయ మాటల తూటాలు విసిరింది. 

'' రెండేళ్ల నుంచి వళ్లు హూనం చేసుకుంటున్నా 

కాలికి చెప్పులు కొనుక్కోలేక పోయా !

 నా పని మీకు అంత బాగా నచ్చిందా ! 

అయితే మీ ఆస్తులు మాకిచ్చి మా పని మీరు తీసేసుకోండి '' 

జీవంలేని చిర్నవ్వొకటి విసిరి వెళ్లి పనిలో నిమగ్నమైంది పని మనిషి. 

అంతలో పక్కింటి కమల వచ్చింది. 

'' చూశావా కమలా ! ఈ పని మనుషులకు ఎంత పొగరో '' 

అంటూ తన అక్కసంతా వెళ్లబోసుకుంది. 

'' నిన్న సాయంత్రం మావారు, పిల్లలతో కలిసి 

స్టార్‌ రెస్టారెంట్‌కు వెళ్లాం కమలా ! 

వంటకాలు ఎంత బావున్నాయో ! 

రూ. 800 బిల్లయితే రెండొందలు టిప్పు కూడా ఇచ్చాం ! '' 

గర్వంగా ఫీలవుతూ చెప్పింది విజయ 

అంట్లు తోముతున్న పని మనిషికి చిర్రెత్తుకొచ్చింది. 

గిన్నెలపై తన ఆక్రోశాన్ని తీర్చుకున్నట్టుంది. 

పక్కింట్లో ఉన్న మాకు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. 

పని ముగించి చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చింది. 

'' మా బోటి కూటికిలేనోళ్ల దగ్గర ఐదొందల కోసం

 రెండు గంటలసేపు కీచులాడతారు !

 అక్కడకెళ్లి వేలకువేలు తగలేస్తారు. 

పిదప కాలం.. పిదప మనుషులు '' 

అని నిట్టూరుస్తూ వెళ్లింది.

Comments