*శతశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా మెగా కోవిడ్ టీకాల కార్యక్రమం*
*పి.హెచ్.సి.లకు 80వేల డోసుల వ్యాక్సిన్ సరఫరా*
*నేడు 50 వేల మందికి వ్యాక్సిన్ ; జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి*
*అపోహలు వీడండి - వ్యాక్సిన్ వేయించుకోండి ; జిల్లా కలెక్టర్*
*విజయనగరం, సెప్టెంబరు 11(ప్రజా అమరావతి); జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శతశాతం ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 ఏళ్లు దాటిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు శనివారం నుంచి రెండు రోజుల స్పెషల్ డ్రైవ్ చేపట్టామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి వెల్లడించారు. జిల్లాలో మొత్తం వ్యాక్సినేషన్ చేయాల్సిన వ్యక్తులు 10,18,624 మంది ఉన్నట్టు గుర్తించామని వీరందరికీ శతశాతం వ్యాక్సినేషన్ చేసే లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. ఇందులో మొదటి డోసు తీసుకున్న 7,23,162 మందికి రెండో డోసు వ్యాక్సిన్ వేయాల్సి వుందని, ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ తీసుకోని 2,95,462 మందికి తొలి డోసు వ్యాక్సిన్ చేయాల్సి వుందని గుర్తించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 70 వేల డోసుల కోవిషీల్డ్, 10 వేల డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్ నిల్వలను పంపినట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ నిల్వలను జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 81 పి.హెచ్.సి.లకు శుక్రవారం నాడే తరలించామన్నారు.*
*జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు, పి.హెచ్.సి.లలో వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపట్టామన్నారు. వలంటీర్లు తమ పరిధిలో వాక్సిన్ వేయాల్సి వున్న వారిని గుర్తించి పి.హెచ్.సిలు, సచివాలయాలకు తరలించారని, వైద్య ఆరోగ్య సిబ్బంది వారికి వ్యాక్సిన్ వేశారని పేర్కొన్నారు. మండల స్థాయిలో వుండే ఎంపిడిఓలు, మునిసిపల్ కమిషనర్‌లు, తహశీల్దార్‌లు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 50 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశామని, తొలిరోజు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతమయ్యిందని పేర్కొన్నారు.*
*జిల్లాలోని డిగ్రీ కళాశాలల విద్యార్ధులు, మార్కెట్ ప్రాంతాలు, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లు వంటి ప్రాంతాలపై దృష్టి సారించి ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి ఎంపిడిఓలు, మునిసిపల్ కమిషనర్‌లకు సూచించారు. ముఖ్యంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో శతశాతం వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ సర్పంచ్ లను వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో భాగం చేయాలని, వారి సహాయ సహకారాలు తీసుకొని ప్రజల్లో అపోహలు తొలగించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొనేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు.*
*జిల్లాకు 1.40 లక్షల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేశారని జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ తీసుకోని వారు 2.93 లక్షల మంది ఉన్నారని, వీరందరికీ శతశాతం తొలి డోసు వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టాలని మండలస్థాయి అధికారులకు సూచించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై జె.సి. డా.మహేష్ కుమార్ రోజంతా పర్యవేక్షిస్తూ తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన మండలాలను అప్రమత్తం చేశారు.*
*ఫోటో క్యాప్షన్స్;*
*1) విజయనగరం రూరల్ మండలం ద్వారపూడిలో కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమం*
*2) చీపురుపల్లి మండలంలో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది*
*3) బొండపల్లి సచివాలయంలో వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది*
*4) పార్వతీపురంలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు*
*జారీ సహాయ సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ, విజయనగరం*
addComments
Post a Comment