*గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి*
*: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*
అనంతపురం, సెప్టెంబర్ 14 (ప్రజా అమరావతి):
*గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ పీఎన్డీటీ చట్టం) చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటి సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీసీ పీఎన్డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలపై గట్టి నిఘా ఉంచాలని, ఎవరైనా లింగ నిర్ధారణకు పాల్పడినట్లు రుజువైతే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పీసీ పీఎన్డీటీ చట్టాన్ని ఎవరైనా స్కానింగ్ సెంటర్ లోని వైద్యులు ఉల్లంఘిస్తే వారిపై చట్టం ప్రకారం చర్యలకు మెడికల్ కౌన్సిల్ కు రికమండ్ చేయడం జరుగుతుందన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై సమాచారం అందించిన వారికి (కేసు నమోదు చేసి శిక్ష పడితే సమాచారం అందించిన వారికి ఒక లక్ష రూపాయలు నగదు బహుమతి) అందజేయడం జరుగుతుందన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై సమాచారం అందించిన వారికి (కేసు నమోదు చేస్తే సమాచారం అందించిన వారికి 25 వేల రూపాయల నగదు బహుమతి) అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో బేటి బచావో బేటి పడావో కింద ఐసిడిఎస్ అధికారులతో సమన్వయం చేసుకొని అవగాహన కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలన్నారు. మహిళా సంఘాలు, మహిళా పోలీసుల ద్వారా మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. లింగ నిష్పత్తి తక్కువగా నమోదైన మండలాలపై దృష్టి సారించాలని, విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. లింగ నిర్ధారణ నివారణ కోసం ఇంటర్ స్టేట్ బార్డర్ వైద్య శాఖల సమన్వయ సమావేశం నిర్వహించాలన్నారు. సమాజంలో లింగ అసమానతలకు కారణమవుతున్న భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారించేందుకు కృషి చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలపై డెకాయ్ ఆపరేషన్ల నిర్వహణకు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను పరిశీలించాలన్నారు.*
*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ సెంటర్లని తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. రెన్యువల్, రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న స్కానింగ్ సెంటర్లను కూడా తనిఖీ చేస్తామన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ జరిగినట్లు తెలిస్తే సమాచారం అందజేయాలన్నారు.*
*ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పలు అంశాలను తీర్మానించారు. ముఖ్యంగా జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ పెండింగ్ ఉన్న వారికి మంజూరు చేయాలని తీర్మానించారు.*
*ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ. సిరి, డీఎంఅండ్ హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, ఆర్డిటి హెల్త్ డైరెక్టర్ సిర్రప్ప, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్లు ఉమాపతి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.*
addComments
Post a Comment