స్ఫూర్తిదాయకంగా స్వర్ణిమ్ విజయ్ వర్ష్
విజయ కాగడాకు ఘన స్వాగతం
విజయనగరం, సెప్టెంబరు 04 (ప్రజా అమరావతి) ః
కోరుకొండ సైనిక పాఠశాలలో స్వర్ణిమ విజయ వర్ష వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. 1971 యుధ్దంలో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా స్వర్ణోత్సవ సంబరాలు ఏడాది కాలంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దేశంలో పర్యటిస్తున్న విజయ కాగడా శనివారం విజయనగరం జిల్లాలో ప్రవేశించింది. ఈ టార్చ్‌కు స్థానిక కోరుకొండ సైనిక పాఠశాల వద్ద, జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి, సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ్ ఎం కులకర్ణి, సైనిక పాఠశాల ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. టార్చ్‌ను ప్రిన్సిపాల్ అరుణ్ కులకర్ణికి అందజేశారు. అంతకుముందు పాఠశాల ప్రవేశద్వారం నుంచి పివిజిరాజు ఆడిటోరియం వరకూ విజయ కాగడాతో ఊరేగింపు నిర్వహించారు.
ఈ సందర్భంగా వీరనారులను, యుధ్దవీరులను ఘనంగా సత్కరించారు. ఆడిటోరియంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భారత నావికాదళ అధికారులు, సైనిక పాఠశాల పరిపాలనాధికారి అమిత్ బాలేరావు, ఇతర అధికారులు, సిబ్బంది, యుద్దవీరులు, యుద్దంలో అసువులు బాసిన వీరుల కుటుంబ సభ్యులు, సైనిక పాఠశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment