సీయం శ్రీ. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బహరైన్ భారత రాయబార కార్యాలయం అధికారుల చొరవతో బహరైన్ లోని NHS సంస్థ కార్మికుల సమస్యలకు పరిష్కారం



తాడేపల్లి (ప్రజా అమరావతి);



*సీయం శ్రీ. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బహరైన్ భారత రాయబార కార్యాలయం అధికారుల చొరవతో బహరైన్ లోని NHS సంస్థ కార్మికుల సమస్యలకు పరిష్కారం* 


బహ్రెయిన్ లోని NHS సంస్థలో పనిచేస్తున్నవేలాదిమంది భారతీయ కార్మికులు పనిచేసే ప్రదేశంలో ఇబ్బందులకు గురవుతున్న విషయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్రానికి చెందిన వారిని స్వదేశానికి తీసుకురావడానికి సహరించమని  కేంద్ర విదేశీవ్యవహారాల శాఖామంత్రి శ్రీ. జైశంకర్ గారిని 13.09.2021న లేఖ ద్వారా కోరారు. అలాగే ఈ విషయంలో విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయము చేసుకోమని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు అదేరోజున ఇబ్బందులకు గురవుతున్న వారి అభ్యర్థనను పూర్తి వివరాలతో బహరైన్ లోని భారత రాయబార కార్యాలయానికి ఇమెయిల్ ద్వారా పంపారు. 


వెంటనే స్పందించిన బహరైన్ లోని భారత రాయబార కార్యాలయం... కార్మికులు మరియు సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపామని, చర్చలు సఫలీకృతమయ్యాయని ప్రత్యుత్తరం ద్వారా తెలిపారు. 14.09.2021న సమస్య పరిష్కారం అయ్యిందని రాయబార కార్యాలయం అధికారులు తమ అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే... బహరైన్ NSH సంస్థలో పనిచేయడానికి వేలాదిమంది భారతీయులు వెళ్ళారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కూడా ఉన్నారు. వారు సంస్థ యాజమాన్యం తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పశుసంవర్ధక శాఖామంత్రి డా. సీదిరి అప్పలరాజు గారికి మరియు APNRTS దృష్టికి తీసుకురాగా APNRTS వెంటనే బహరైన్ లోని భారత రాయబార కార్యాలయానికి పూర్తి వివరాలతో ఇమెయిల్ పంపింది. సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్ర విదేశీవ్యవహారాల శాఖ మంత్రి శ్రీ. జైశంకర్ గారికి లేఖ పంపారు. 


స్పందించిన భారత రాయబార కార్యాలయం అధికారి శ్రీ. రవి శంకర్ శుక్లా బహరైన్ లో పెద్ద వ్యాపారవేత్త శ్రీ రవి పిళ్లై భాగస్వామిగా ఉన్న NSH కంపెనీలో ఇబ్బందులు ఇప్పటికే ఎంబసీ దృష్టికి వచ్చాయని అన్నారు. ది బహరైన్ పెట్రోలియం కంపెనీ (BAPCO) యొక్క సబ్ కాంట్రాక్టర్ అయిన నాసర్ ఎస్. అల్ హర్జేరి కోఆపరేషన్ (NSH) బహరైన్ యొక్క వసతి శిబిరంలో పది రోజుల నుండి కార్మికులు సమ్మె / నిరసన చేపట్టారు, కార్మికులు తమకు మెరుగైన వసతి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు మరియు నాణ్యమైన ఆహారం లేవని, అలాగే ఓవర్ టైం సమస్యలు ఉన్నాయన్నారని శ్రీ. రవి శంకర్ తెలిపారు. ఆ వసతి శిబిరంలో అధికసంఖ్యలో దాదాపు 4000 మంది భారతీయ కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు.


ఈ విషయం తెలిసిన వెంటనే, బహ్రెయిన్ ప్రభుత్వ సంబంధిత అధికారులతో మాట్లాడామన్నారు. అలాగే NSH యాజమాన్యంతో పాటు కార్మికుల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరిపామన్నారు. బహ్రెయిన్ అధికారులు ఈ విషయంలో  చురుగ్గా వ్యవహరిస్తూ, రాయబార కార్యాలయ ప్రతినిధులతో పాటు, వసతి శిబిరాన్ని కూడా సందర్శించి కార్మికులను కలిశారు. కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా  NSH క్యాంప్ లో ఆరోగ్య ప్రమాణాలను తనిఖీ చేసి, సురక్షితమని ధృవీకరించారు.


ఎక్కువశాతం  కార్మికులు తమ ప్రాథమిక డిమాండ్లలో కొన్నింటిని నెరవేర్చాలని కోరారు. తిరిగి పనిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సుమారు 600-700 మంది భారతీయ మరియు నేపాలీ కార్మికులు దుడుకుగా వ్యవహరించడంతో  మిగిలిన కార్మికులు  పనికి వెళ్ళలేకపోయారని  శ్రీ. రవి శంకర్ శుక్లా తెలిపారు. 


ఎట్టకేలకు బహరైన్ లోని భారత రాయబార కార్యాలయం... కార్మికులు మరియు సంస్థ యాజమాన్యంతో జరిపిన సంప్రదింపులు, చర్చలు సఫలీకృతమయ్యాయని తెలిపారు. పైన పేర్కొన్న డిమాండ్లను తీర్చడానికి సంస్థ ఒప్పుకుందని తెలిపారు. అలాగే ఎవరైనా భారతదేశం వెళ్లిపోతామంటే వారికి విమాన టికెట్లను ఏర్పాటు చేస్తామని సంస్థ పేర్కొంది.



APNRTS నిరంతరాయంగా NSHలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడుతూ, ధైర్యం చెప్తూ, భరోసా కల్పించింది.


*చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్*

Comments