APICET, APECET-2021 పరీక్షల ఫలితాల విడుదల

 


మంగళగిరి, 1 అక్టోబరు, (ప్రజా అమరావతి) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన APICET, APECET-2021 పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.

శుక్రవారం ఉదయం మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ కార్యాలయంలో  నిర్వహించిన APICET, APECET-2021 పరీక్షల ఫలితాల విడుదల


కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ ఎన్. లక్ష్మీ పార్వతి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ కె. రామ్మెహనరావు, వైస్ ఛైర్ పర్సన్ టి.లక్ష్మమ్మ, సెక్రటరీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక అధికారి డాక్టర్. ఎం. సుధీర్ రెడ్డి లు హాజరయ్యారు.

       రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. గతంలో కన్నా మెరుగైన విద్యను విద్యార్థులకు అందించడం, వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం వంటి నూతన విధానాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విద్యా విధానం అమలుతో పాటుగా విద్య, ఉపాధి కల్పన వంటి ఉన్నత విద్యలకు ఒకే పరీక్షా విధానాలను అమలు చేసేదుంకు చర్యలు తీసుకోడవం జరిగిందని తెలిపారు.  ఎ.పి.ఎస్.సి.హెచ్.ఇ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం APICET-2021 పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఆంధ్ర విశ్వ విద్యాలయానికి అప్పగించడం జరిగిందన్నారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో నాలుగు విడతల్లో గత నెల  సెప్టెంబరు 17, 18, తేదిల్లో పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. 10 రోజుల వ్యవధిలోనే పరీక్షల ఫలితాలను విడుదల చేయడం జరిగిందన్నారు. 

అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్. ఆదిమూలపు సురేష్  APICET, APECET-2021 పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. APICET పరీక్షలకు  మొత్తం 42,092 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకోగా 38,115 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. వారిలో 91.27 % శాతం మంది అనగా  34,789 మంది అర్హత సాధించారని మంత్రి వెల్లడించారు. ఈ పరీక్షలకు హాజరైన 19, 392 మంది పురుషుల్లో  91.16 శాతం అనగా 17,678 మంది అర్హత సాధించగా, మహిళలు 18,723 మందిలో 17,111 మంది అనగా 91.39 శాతం అర్హత సాధించారన్నారు. 2020 లో 37,167 మంది ధరఖాస్తు చేసుకుంటే వారిలో 31,891 మంది పరీక్షల రాశారన్నారు. 30,654 మంది 96.12 శాతం అర్హత సాధించారన్నారు.  ప్రాధమికంగా ప్రిలిమినరీ కీపై ఉన్న అభ్యంతరాలు ఆన్ లైన్ మోడ్ ద్వారా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  మొత్తం 390  ప్రశ్నలను లేవనెత్తారని, సమగ్ర ధృవీకరణ తరువాత తుది కీ కమిటీ 1700 ప్రశ్నల్లో 30 ప్రశ్నల అభ్యంతరాలను అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఎలక్ర్టానిక్, ఇన్ స్ట్రుమెంటేషన్, సి టెక్నాలజీ, మరియు బి.ఎస్.సి(గణితం) సబ్జెక్టులపై అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు.

అనంతరం APECET-2021 పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాలతో పాటు హైదరాబాదులో కూడా నిర్వహించిందని మంత్రి తెలిపారు. APECET-2021 పరీక్షలకు 34, 271 మంది  ధరఖాస్తు చేసుకొని, 32, 318 మంది పరీక్షలకు హాజరై 29, 904 మంది అర్హత సాధించారని మంత్రి పేర్కొన్నారు. అర్హత మార్కులు  ఎస్సీ, ఎస్టీ లు మినహా అన్ని కేటాగిరీలకు 200 మార్కులకు 50 మార్కులు పెట్టినట్లు తెలిపారు. ఎస్సీ,ఎస్టీలకు అర్హత మార్కులు లేవన్నారు. మొత్తం 92.53 శాతం అర్హత సాధించారన్నారు. పరీక్ష మొత్తం 13 విభాగాల్లో నిర్వహించామన్నారు. ఇందులో 11 ఇంజనీరింగ్, మిగిలిన 2 లో బి.ఎస్సీ,(గణితం), ఫార్మశీ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలకు గాను 10,654 మంది విద్యార్ధులు ధరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సిరామిక్ టెక్నాలజీ కోర్సుకు 6 గురు మాత్రమే ధరఖాస్తు చేసుకున్నారని మంత్రి వివరించారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యకోసం పరీక్షలకు హాజరైన 10,119 మంది విద్యార్థుల్లో 96.81 శాతం మంది అర్హత సాధించారన్నారు. ఆన్ లైన్లో RFVAS *19 అనే పాస్ వార్డ్ ను ఉపయోగించి ఫలితాలను చూడవచ్చునని ఆయన తెలిపారు. 

ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న విశ్వ విద్యాలయాలన్నింటిలో పిజి విద్యకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఇప్పటికే విశ్వ విద్యాలయాల్లో ఉప కులపతులు వీటిపై కసరత్తు చేస్తున్నారని మంత్రి తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పిజి ప్రవేశ పరీక్షలు జరపనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని ఏ విశ్వ విద్యాలయాల్లో చదువుకోవాలనుకున్నా, అక్కడే అడ్మిషన్లు పొందేందుకు విద్యార్ధులకు అవకాశం కలుగుతోందని మంత్రి తెలిపారు.