వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం కృషి

  

నెల్లూరు, అక్టోబర్ 19 (ప్రజా అమరావతి) : కోవిడ్ వ్యాక్సినేషన్ అందరికీ అందించాలనే దృఢ సంకల్పంతో జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు నేతృత్వంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం కృషి


చేయడంతో రాష్ట్రంలోనే  అత్యధిక శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన జిల్లాగా నెల్లూరు ప్రథమ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా జిల్లాలోని 10 పీహెచ్సీల పరిధిలో 14 గ్రామ, వార్డు సచివాలయాలు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయడం చెప్పుకోదగ్గ విషయం. ఒక నిర్దిష్ట లక్ష్యం మేరకు పనిచేయడంతో ఈ సచివాలయాల పరిధిలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించారు. జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) శ్రీ గణేష్ కుమార్ పర్యవేక్షణలో అంకితభావంతో పనిచేసి వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేసిన మెడికల్ ఆఫీసర్లు, ఆశా కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వాలంటీర్లు తదితర వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. దీంతో మిగిలిన సిబ్బంది కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. డిఎంహెచ్ఓ శ్రీమతి రాజ్యలక్ష్మి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు ఎప్పటికప్పుడు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లు చేపట్టి వైద్య  సిబ్బందికి తగిన సూచనలు అందిస్తూ వ్యాక్సినేషన్ అమలులో రాష్ట్రంలోనే జిల్లాను ముందంజలో నిలిపేందుకు నిరంతరం కృషి చేశారు. జిల్లాలో 18-45 సంవత్సరాల  మధ్య వయస్సు గల వారు 19,57,476 మంది ఉండగా ఇప్పటివరకు మొదటి డోసును 19,28,082 మందికి అనగా 98.49 శాతం వ్యాక్సిన్ అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా మొత్తం జనాభాలో రెండు డోసుల వ్యాక్సిన్ ను 61.98 శాతం పూర్తి చేశారు. అతి త్వరలోనే జిల్లా మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసి 100 శాతం వ్యాక్సినేషన్ జిల్లాగా నెల్లూరు ను నిలపాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుంది.

Comments