నియోజకవర్గాల్లో రెండో విడత ఆసరా సంబరాలు ప్రారంభం
సాలూరు, బలిజిపేటల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ
విజయనగరం, అక్టోబరు 10 (ప్రజా అమరావతి)
; జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రెండో విడత వై.ఎస్.ఆర్.ఆసరా సంబరాలు ఆదివారం నిర్వహించారు. సాలూరు, పార్వతీపురం అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలోని సాలూరు, బలిజిపేట మండలాల్లో ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయా మండలాల పరిధిలోని మహిళా స్వయంశక్తి సంఘాలకు రెండో విడత వై.ఎస్.ఆర్. ఆసరా చెల్లింపులకు సంబంధించిన చెక్కులను అందజేశారు.
సాలూరు మండలానికి సంబంధించి స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు పీడిక రాజన్నదొర, జిల్లాపరిషత్ వైస్ ఛైర్మన్ అంబటి అనిల్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డి పద్మజ, ఎంపిపి గరుగుబిల్లి రాములమ్మ, మండల ఉపాధ్యక్షుడు రెడ్డి సురేష్, ఐ.టి.డి.ఏ. ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 973 మహిళా సంఘాల్లోని 10,812 మంది సభ్యులకు రెండో విడత ఆసరా కింద రూ.4.59 కోట్ల మొత్తానికి సంబంధించిన చెక్కును మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా స్వయంశక్తి మహిళలు తమ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఎమ్మెల్యే శ్రీ రాజన్నదొర తిలకించారు. మహిళలు ఆర్ధికంగా పురోభివృద్ది సాధించాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ జగన్ లక్ష్యమని అందులో భాగంగానే ఆసరా పథకంలో వారు తీసుకున్న రుణాలను ఎంత కష్టమైనా తిరిగి చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.
బలిజిపేటలో జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అలజంగి జోగారావు పాల్గొని మండలంలోని మహిళా స్వయంశక్తి సంఘాలకు రెండో విడత ఆసరా మొత్తాలను అందజేశారు. మండలంలోని 1315 సంఘాలకు రూ.7.62 కోట్ల మొత్తానికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న అందిస్తున్న ఈ సహాయాన్ని వినియోగించుకొని రానున్న రోజుల్లో మహిళా సంఘాలు మరింతగా ఆర్ధిక వృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అలజంగి రవికుమార్, ఎంపిపి గుడివాడ నాగమణి, వైస్ ఎంపిపి బెవర హేమలత, మండల ప్రత్యేకాధికారి, పశుసంవర్ధక శాఖ డి.డి. కె.మురళీకృష్ణ, ఎంపిడిఓ పి.దేవకుమార్, తహశీల్దార్ రఫీజాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వయంశక్తి మహిళలతో కలసి ఎమ్మెల్యే జోగారావు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
addComments
Post a Comment