ఘ‌నంగా సిరిమాను సంబ‌రం

 


ఘ‌నంగా సిరిమాను సంబ‌రం


కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ పండుగ నిర్వ‌హ‌ణ‌

లైవ్ టెలికాస్ట్ ద్వారా సిరిమానోత్స‌వం ప్ర‌సారం


విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 19 (ప్రజా అమరావతి) ః

                   ఉత్త‌రాంధ్ర క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌ల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది.  సంప్ర‌దాయ‌భ‌ద్దంగా పాల‌ధార‌, తెల్ల ఏనుగు, అంజ‌లి ర‌థం, , బెస్త‌వారి వ‌ల ముందు న‌డ‌వ‌గా, భ‌క్తుల జ‌య‌జ‌య ద్వానాల మ‌ధ్య‌ పైడిత‌ల్లి అమ్మ‌వారు విజ‌య‌న‌గ‌రం పుర‌వీధుల్లో సిరిమాను రూపంలో ముమ్మారు ఊరేగి ప్రజలను ఆశీర్వ‌దించారు. అమ్మ‌వారి ప్ర‌తిరూపంగా సిరిమానుపై, పైడిత‌ల్లి ఆల‌య ప్రధాన పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు ఆశీనులై, భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సిరిమాను రూపంలో పైడిత‌ల్లి అమ్మ‌వారు, త‌న పుట్టినిల్లు విజ‌య‌న‌గ‌రం కోట‌వ‌ద్ద‌కు మూడుసార్లు ఊరేగి, రాజ కుటుంబానికి దీవెన‌లు అందించారు. వారి కానుకలు స్వీకరించారు. ఈ అపూర్వ ఘ‌ట్టాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌ద్వారా ప్ర‌జ‌లంతా తిల‌కించి ప‌ర‌వ‌శించారు. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సూచ‌న‌ల‌కు అనుగుణంగా, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో వివిధ ప్ర‌భుత్వ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో, క‌లిసిక‌ట్టుగా ప‌ని చేసి, ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించాయి. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ, సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఉత్స‌వాన్ని జిల్లా యంత్రాంగం ప్ర‌శాంతంగా నిర్వ‌హించింది.


          జిల్లా క‌లెక్ట‌ర్ సూచ‌న‌ల మేర‌కు ముందునుంచీ కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ ఈ ఏడాది అమ్మ‌వారి పండుగ‌ను నిర్వ‌హించారు. మాస్కు పెట్టుకున్న‌వారిని మాత్ర‌మే అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి, సిరిమానోత్స‌వానికి అనుమ‌తించారు. కోవిడ్ నిబంధ‌న‌ల దృష్ట్యా,  భ‌క్తుల‌ను సిరిమానోత్స‌వానికి అనుమ‌తించ‌కుండా, ప‌ట్ట‌ణంలో ప‌లు చోట్ల ఎల్ఇడి స్క్రీన్‌ల‌ను ఏర్పాటు చేసి, అమ్మ‌వారి ఉత్స‌వాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు.


            అమ్మ‌వారి సంబ‌రానికి సిరిమానును, ఇత‌ర ర‌థాల‌ను ముందుగానే ఆల‌యం వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. దీంతో నిర్ణీత స‌మ‌యానికే సుమారు సాయంత్రం 3.45కి సిరిమానోత్స‌వం ప్రారంభ‌మై స‌కాలంలో పూర్త‌య్యింది. అయితే చివరి విడత సిరిమాను ఊరేగుతున్న సమయంలో వర్షం కురిసింది. అయినప్పటికీ అధికారులు భక్తులు అమ్మవారి ఉత్సవానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి చేశారు. ప్రతీ ఏటా సిరిమానోత్సవం రోజున వర్షం పడటం ఆనవాయితీ కాగా, ఏ ఈ ఏడాది కూడా అది కొనసాగింది. ఉత్సవాన్ని ప్ర‌త్య‌క్షంగా తిల‌కించేందుకు భక్తులకు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో, సిరిమాను తిరిగే మార్గంలో రోడ్ల‌కు ఇరువైపులా బారికేడ్ల‌ను ఏర్పాటు చేయ‌లేదు. దానికి బ‌దులుగా భ‌క్తుల రాక‌ను నిరోధించేందుకు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ప‌లు కూడళ్లవద్ద బలమైన బారికేడ్ల‌ను ఆర్అండ్‌బి అధికారులు ఏర్పాటు చేశారు. మున్సిప‌ల్ సిబ్బంది ప్ర‌త్యేక పారిశుధ్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డ‌మే కాకుండా, తాత్కాలిక మ‌రుగుదొడ్ల‌ను ఏర్పాటు చేశారు. ఉచితంగా త్రాగునీటి స‌దుపాయం క‌ల్పించారు. వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఉచితంగా త్రాగునీరు, ప్ర‌సాదాన్ని పంపిణీ చేశాయి.  జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిషోర్ కుమార్, సిరిమాను వెంట మూడుసార్లు నడిచి, ఉత్సవాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌ బందోబస్తు ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షించారు.


                  క‌లెక్ట‌ర్ సూచ‌న‌ల‌ను అనుగుణంగా, జాయింట్ క‌లెక్ట‌ర్ల‌ ఆధ్వ‌ర్యంలో  ఆర్‌డిఓ పైడిత‌ల్లి ఆల‌య ఈఓ, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్,  ఇత‌ర అధికారులు, రెవెన్యూ, పోలీసు, మున్సిప‌ల్‌, ఆర్అండ్‌బి, పైడిమాంబ దేవ‌స్థానం, వైద్యారోగ్య‌శాఖ‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ‌, ట్రాన్స్‌కో త‌దిత‌ర‌  ప్ర‌భుత్వ శాఖ‌లకు చెందిన‌ సిబ్బంది స‌మ‌న్వ‌యంతో కృషి చేసి,  ఆల‌య సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించడమే కాకుండా, ఉత్సవాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగానికి స‌హ‌క‌రించిన ప్ర‌జ‌లంద‌రికీ, అధికార యంత్రాంగానికి క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా, ఉత్స‌వాన్ని ప్ర‌శాంతంగా పూర్తిచేయ‌డంలో పోలీసులు కీల‌క పాత్ర వ‌హించారు.  


సిరిమానోత్స‌వాన్ని తిల‌కించిన ప్ర‌ముఖులు

            క‌న్నుల పండువ‌గా జ‌రిగిన శ్రీ‌ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వాన్నిప‌లువురు ప్ర‌ముఖులు, అధికారులు ప్ర‌త్య‌క్షంగా తిల‌కించారు. జిల్లా కేంద్ర స‌హ‌కార బ్యాంకు ఆవ‌ర‌ణ‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, పురపాలక శాఖామంత్రి  బొత్స స‌త్య‌నారాయ‌ణ, రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి  శ్రీనివాసరావు ఆశీనులై ఉత్స‌వాన్ని తిల‌కించారు. వీరితో పాటుగా జెడిపి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్, శాస‌న స‌భ్యులు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, ఎమ్మెల్సీలు పివిఎన్ మాధవ్, పి.సురేష్ బాబు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి,  ఇత‌ర ప్ర‌ముఖులు సైతం సిరిమాను ఉత్స‌వాన్ని తిల‌కించారు.

            మాన్సాస్ ఛైర్‌పర్స‌న్ అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, అత‌ని కుటుంబ స‌భ్యులు,  టిడిపి నాయకులు గుమ్మడి సంధ్యారాణి, ద్వారపురెడ్డి జగదీష్, డాక్టర్ కె ఏ నాయుడు, కోట బురుజు పైనుంచి సిరిమాను ఉత్స‌వాన్ని తిల‌కించి ప‌ర‌వ‌శించారు. దేవాదాయశాఖ కమీషనర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ఆ శాఖ ఇతర ఉన్నతాధికారులు కూడా కోట పైనుంచి ఉత్సవాన్ని తిలకించారు.

Comments