నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి - జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు :

 


*నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి - జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు :


-*


*రైతు శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం - జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డి :-*



*డీఏపీ ఎరువులను అందుబాటులో ఉంచండి -పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి :-*


*రైతుల పట్ల మానవతా దృక్పథంతో సేవ చేయండి - నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ :-*


కర్నూలు, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి):-


నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు అధికారులను ఆదేశించారు. 


బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమీక్ష సమావేశం జరిగింది. 


జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు అర్థర్,  జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి  పాల్గొన్నారు.


జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... రైతులకు కావాల్సిన విత్తనాలు నాణ్యమైనవే సరఫరా చేయాలని, అలా కాకుండా డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా మోసపోకుండా ఉండేందుకు నకిలీ విత్తనాల పై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ కనెక్షన్ కోసం  వచ్చిన అప్లికేషన్ పెండింగ్ లేకుండా త్వరితగతిన విద్యుత్ కనెక్షన్ లు ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యవసాయ మండలి సభ్యులతో సమావేశం నిర్వహించుకొని వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ అగ్రికల్చర్ పరంగా జిల్లాను ఇంప్రూవ్ చేయాలన్నారు. జిల్లా స్థాయిలో రైతులకు సంబంధించిన సమస్యలు  వెంటనే పరిష్కరించాలన్నారు. ఆయా మండలాల్లో నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మినిట్స్ ను వారం రోజులు ముందుగా వ్యవసాయ సలహా మండలి సభ్యులకు అందజేయాలని అగ్రికల్చర్ జెడిని  జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ సంబంధించి జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత నీరు నిల్వ ఉంది, ఎంత ఆయకట్టు ఉంది తదితర వివరాల పై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అధికారులు అందరూ  సీరియస్ గా తీసుకొని తమకు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.


*రైతు శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం - జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డి :-*


రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని... నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేశారని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక వనరులు వ్యవసాయం రంగం అని, గ్రామీణ ప్రాంతంలోకి రైతు భరోసా కేంద్రాలు తీసుకెళ్ళి, ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో రైతు శ్రేయస్సు కోసం కృషి చేస్తుందన్నారు. రైతులకు విద్యుత్ కనెక్షన్ పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో చైర్మన్ వి భరత్ కుమార్ రెడ్డి ఏపీఎస్పీడీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఖరీఫ్ మొదటి రెండు నెలలు ఆశాజనకంగా జిల్లాలో వర్షాలు కురిసినా, ఆ తర్వాత మూడు నెలలు వర్షాలు కురవక పోవడంతో పంట నష్టం జరిగిందని,  నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఏ ఒక్క రైతు జిల్లాలో నష్ట పోకుండా ఉండేందుకు ఈ కేవైసీ 100% పూర్తి చేయాలన్నారు. 

జిల్లాలో మల్బరీ సాగు విస్తీర్ణం పెంచేందుకు గ్రామాలలో అవగాహన సదస్సులు కల్పించాలన్నారు. మొక్కజొన్న, కొర్ర పంట కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రబీ సీజన్లో సబ్సిడీ కింద విత్తనాలు లక్ష్యాన్ని అధిగమించేందుకు రైతులకు చేరువయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మైనర్ ఇరిగేషన్ సంబంధించి 80 వేల ఎకరాలు ఆయకట్టు ఉందని, కనీసం 40 శాతం ఆయకట్టుకు నీరు ఇవ్వలేకపోతున్నామని, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరారు.  జిల్లాలో నర్సరీలలో ఎటువంటి బిల్లులు లేకుండా విత్తనాల పంపిణీ చేస్తున్నారని, అలా పంపిణీ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాల్లో సేంద్రీయ వ్యవసాయం రైతులు ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు ఎద్దులు చనిపోతే ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక కృషి చేయాలన్నారు.


*డీఏపీ ఎరువులను అందుబాటులో ఉంచండి -పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి :-*


డీఏపీ ఎరువులను అందుబాటులో ఉంచాలని, చాలా మంది రైతులు కోరుతున్నారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. డీలర్ షాపులలో నకిలీ విత్తనాలు అమ్మకాలు జరుగుతున్నాయని, గడివేముల మండలం చిందుకూరులో రైతులకు తెలియక నకిలీ విత్తనాలు కొనుగోలు చేయడం వల్ల 100 ఎకరాలు పూత రాలేదని, ఏ ఒక్క రైతు కూడా మోసపోకుండా ఉండేందుకు నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపే వారిపై దాడులు జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దళారుల చేతిలో  రైతు దగా పడకుండా ఉండేందుకు రైతు పండించిన పంటలను రైతు భరోసా కేంద్రాలలో పంట కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 



*రైతుల పట్ల మానవతా దృక్పథంతో సేవ చేయండి - నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ :-*


రైతుల పట్ల మానవతా దృక్పథంతో సేవ చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ అధికారులను సూచించారు. జొన్న ను అధికారులు కొనుగోలు చేశారని, కొంత మంది రైతులకు డబ్బులు పడలేదని, రైతులకు రావాల్సిన అమౌంట్ వచ్చేవరకూ పై స్థాయి అధికారులతో తరచూ మాట్లాడుతూ వారికి డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతులు పండించిన మొక్కజొన్న, వరి పంటలను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు కోరుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇన్సూరెన్స్ కొంత మంది రైతులకు డబ్బులు పడ్డాయిని...కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొంత మంది రైతులకు పడలేదని,  అలాంటి రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. చాలా మంది రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టారని, అలాంటి రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు వెంటనే ఇచ్చేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. .

అంతకుముందు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపీ, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమల తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.


సమీక్షలో అగ్రికల్చర్ జెడి వరలక్ష్మి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు విశ్వనాథరెడ్డి, సమీర్ కుమార్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఏపీఎంఐపీ పిడి ఉమాదేవి, పశుసంవర్ధక శాఖ జెడి రమేష్, సిరికల్చర్ డిడి పరమేశ్వరి, వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపీ, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమల తదితర శాఖల అధికారులు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, పాల్గొన్నారు. 


అంతకుమునుపు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, అధికారులు పత్తి పంట వివిధ దశలలో గులాబి రంగు పురుగు ఉధృతి మరియు యాజమాన్యం పోస్టర్లు, బీటీ పత్తిలో గులాబి రంగు పురుగు - సమగ్ర యాజమాన్యం కరపత్రాలను ఆవిష్కరించారు.