తాడేపల్లి (ప్రజా అమరావతి); ప్రణాళిక ప్రక్రియ, లేబర్ బడ్జెట్ 2022- 23 అన్న అంశంపై ఉపాధి హామీ అడిషనల్ పిడీలు, ఎపిఒలు, ఇసిలకు (టిఓటి) శిక్షణ ఇచ్చేందుకు గాను ఒకరోజు కార్యశాలను
మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఇజిఎస్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యశాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం- ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పనుల గుర్తింపు, లేబర్ బడ్జెట్ తయారీ, గ్రామసభల నిర్వహణ తదితర అంశాలను కూలంకూషంగా చర్చించారు. ఈ సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ డా. శాంతి ప్రియ పాండే ముఖ్య అతిధిగా పాల్గొని ప్రశంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ యూనిట్ అన్నది చాలా ముఖ్యమైనదని గ్రామాల ప్రాధమిక సమాచారమే దేశాభివృద్ధికి పునాదిగా ఉంటుందని, ఉపాధి హామీ పనుల ప్రణాళిక తయారీ సమయంలోనే పనులను పకడ్బందీగా గుర్తించి లేబర్ బడ్జెట్ ను తయారుచేసుకోవాలని శాంతి ప్రియ పాండే అన్నారు.
ప్రణాళికలో పనులను గుర్తించడం ఒక భాగం అయితే వాటికి సాంకేతిక విలువలను జోడించి పూర్తిచేయడమన్నది మరో ముఖ్యమైన భాగమని, ప్రాంతం, వాతావరణం, అవసరాన్ని బట్టి పనులను గుర్తించాలని, లక్ష్యాలు, ప్రగతి కాకుండా వేతనదారుల అనుకూల పనులను చేపట్టడమన్నది ముఖ్యమని అంటూ దీనికి నిరంతర శిక్షణ అవసరమని ఆమె అన్నారు. ప్రణాళికలో 60% వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పనులు, సహజ వనరుల యాజమాన్య పనులు ఉండాలని, సిద్ధాంత౦, వాస్తవికతకు దగ్గరగా ఉండేలా పనులు గుర్తించాలని ప్రత్యేక కమిషనర్ సూచించారు. గత సంవత్సరం చేపట్టిన పనులను తిరిగి సందర్శించి, పరిశీలించాలని, ఈ సంవత్సరం జరుగుతున్న పనులను కూడా దృష్టిలో ఉంచుకుని 2022-23 ఆర్ధిక సంవత్సరానికి అవసరమైన పనుల అరలను (షెల్ఫ్ ఆఫ్ వర్క్స్) ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేక కమిషనర్ డా. శాంతి ప్రియ పాండే దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఇజిఎస్ సంచాలకులు పి. చిన తాతయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ అమలులో మన రాష్ట్రం దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొంది, గత 15 సంవత్సరాలుగా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటో౦దని గుర్తుచేశారు. చేపట్టే పనులు గ్రామస్తులకు, గ్రామానికి ఉపయోగకరంగా ఉండాలని, పనుల ప్రణాళిక తయారీ అందరి భాగస్వామ్యంతో జరగాలని, నిత్యకృత్య౦గా కాకుండా సత్ఫలితాలు ఇచ్చేదిగా ఉండాలని ఇజిఎస్ సంచాలకులు పి. చినతాతయ్య అన్నారు.
ఈ కార్యశాలలో జాయింట్ కమిషనర్ ఎం. శివ ప్రసాద్ ప్రణాళిక విధి విధానాలను టిఓటిలకు వివరించారు. చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి సి.వి. సుబ్బారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment