పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం


పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం


       

 తిరుమల (ప్రజా అమరావతి):

         నాగులచవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేషవాహనంపై భ‌క్తులను క‌టాక్షించారు.  రాత్రి 7 నుండి 9 గంటల నడుమ స్వామి, అమ్మ‌వార్లు తిరుమాడ వీధుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.


 సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.

 ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చారు.


 ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

Comments