శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

 శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం


తిరుపతి,  న‌వంబ‌రు 23 (ప్రజా అమరావతి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల‌ను పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కోవిడ్-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. తిరుప‌తి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

21 పరదాలు విరాళం

హైదరాబాదుకు చెందిన శ్రీ పి.శ్రీ‌ధ‌ర్‌నాయుడు, శ్రీ‌మ‌తి శ్రీ‌ల‌క్ష్మీ దంప‌తులు ఈ సంద‌ర్భంగా ఆలయానికి 21 పరదాలు విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి క‌స్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.