నెల్లూరు, నవంబర్ 22 (ప్రజా అమరావతి): నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ గా పొట్లూరి స్రవంతి,
డిప్యూటీ మేయర్లుగా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, మహమ్మద్ ఖలీల్ అహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు ప్రకటించారు. సోమవారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పాలకమండలి ప్రత్యేక సమావేశం కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ చక్రధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాలక మండలి సమావేశం నిర్వహణకు అవసరమైన 30 మంది సభ్యుల హాజరు కంటే అధికంగా కోరం ఉన్నందున సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీ బసంత్ కుమార్ పర్యవేక్షణలో 54 డివిజన్లలో విజేతలైన అభ్యర్థులు ఒక్కొక్కరి చేత జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి మేయర్ అభ్యర్థిగా 12వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ పొట్లూరి స్రవంతి పేరును 37 వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ప్రతిపాదించగా, 21వ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ళ గౌరీ బలపరిచారు. డిప్యూటీ మేయర్ గా 40 డివిజన్ కార్పొరేటర్ శ్రీ పోలు బోయిన రూప్ కుమార్ యాదవ్ పేరును 14 వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి ప్రతిపాదించగా, ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మొగుళ్లపల్లి కామాక్షి దేవి బలపరిచారు. అలాగే మరో డిప్యూటీ మేయర్ గా 43 వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ పేరును 44వ డివిజన్ కార్పొరేటర్ నీలి రాఘవరావు ప్రతిపాదించగా, 13 వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున బలపరిచారు. వీరి ఎంపికకు సభ్యులందరూ ఆమోదం తెలపగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల పరిశీలకులు పుష్పగుచ్ఛాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో అందరికీ పదవుల్లో సమన్యాయం పాటిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని విధాలుగా కార్పొరేషన్ అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సభ్యులు కృషి చేయాలని, ప్రతి మూడు నెలలకు ఒక సారి కాకుండా ప్రతి నెల పాలక మండలి సమావేశాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీలో కష్టపడే ప్రతి కార్యకర్త కు గుర్తింపు ఉందని చెప్పడానికి నిదర్శనమే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక అని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 54 స్థానాల్లో వైసిపి అభ్యర్థులు నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారని పేర్కొన్నారు.
అనంతరం నూతన మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశీస్సులతో మేయర్ గా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి అందరి సభ్యుల సహకారంతో కలసి పని చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నుడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్, ఆప్కాబ్ చైర్మన్ శ్రీ అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment