వ‌సంత మండ‌పంలో శ్రీ విష్ణుసాల‌గ్రామ పూజ‌

     తిరుమల‌,  న‌వంబ‌రు 15 (ప్రజా అమరావతి);


             వ‌సంత మండ‌పంలో శ్రీ విష్ణుసాల‌గ్రామ పూజ‌


         కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా సోమ‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో  శ్రీ విష్ణుసాల‌గ్రామ పూజ ఘనంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.


        ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ విశేష‌మైన భ‌గ‌వ‌త్ శాస్త్రంలో చెప్ప‌డినట్లు సాల‌గ్రా‌మాలు ఎక్క‌డ ఉంటే అక్క‌డ ముక్కోటి దేవ‌త‌లు ఉంటార‌ని తెలిపారు. సృష్ఠి, స్థితి, ల‌య కార‌కుడైన శ్రీ మ‌హ‌విష్ణువు కూడా అక్క‌డే కొలువై ఉంటార‌న్నారు. కృత‌, త్రేత‌, ద్వాప‌ర యుగాల‌లో వేలాది సంవ‌త్స‌రాలుగా త‌ప‌‌స్సు, య‌జ్ఞ యాగాలు చేయ‌డం వ‌ల్ల పొందే ఫ‌లితాన్ని, క‌లియుగంలో ప‌విత్ర కార్తీక మాసంలో విష్ణుసాల‌గ్రామ పూజ చేసిన‌, ద‌ర్శించిన‌, ఆ మంత్రాల‌ను విన్న అంత‌టి ఫ‌లితం సిద్ధిస్తుంద‌ని వివ‌రించారు.   ‌    


            ముందుగా ఘంటా నాదంతో స‌క‌ల దేవ‌త‌‌ల‌ను ఆహ్వా‌నించి, కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి, అష్ట‌దిక్పాల‌కులు, న‌వ‌గ్ర‌హా‌ల అనుగ్ర‌హంతో లోక క్షేమం కొర‌కు ప్రార్థ‌న చేశారు. ఆ త‌రువాత సాల‌గ్రామాల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంత‌రం సాల‌గ్రామా‌ల‌కు ప్ర‌త్యేక వేద మంత్రాల‌చే ఆరాధ‌న, నివేద‌న‌, హార‌తి స‌మ‌ర్పించారు. చివ‌రిగా క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.


          ఈ పూజ కార్య‌క్ర‌మంలో ఆల‌య అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.


వ‌సంత మండ‌పంలో విష్ణుపూజ‌లు :


         ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో న‌వంబ‌రు 16, 21, డిసెంబ‌రు 2వ తేదీల్లో తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు సంబంధించిన విశేష ఆరాధ‌న‌లు వైఖాన‌సాగ‌మబ‌ద్ధంగా నిర్వ‌హించ‌నున్నారు.  


         ఇందులో భాగంగా న‌వంబ‌రు 16న క్షీరాబ్ధిద్వాద‌శి, కైశిక‌ద్వాద‌శి - శ్రీ తుల‌సీ ధాత్రీ స‌హిత దామోద‌ర పూజ‌, న‌వంబ‌రు 21న గోపూజ‌, డిసెంబ‌రు 2న శ్రీ ధ‌న్వంత‌రీ జ‌యంతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.