నైపుణ్యం కలిగిన యువత కొరత తీవ్రంగా ఉంది.

  తాడేపల్లి (ప్రజా అమరావతి);           ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్‌డిసి)తో కలిసి రాష్ట్రంలోని యువతకు జపనీస్ లాంగ్వేజ్ పై శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్టు జపాన్ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం జపాన్ కు చెందిన 

కేసీసీఎస్ జపనీస్ స్కూల్ సీనియర్ అడ్వైజర్, హిదేహారు హ్యోడ్, కేసీసీఎస్ ఫౌండర్ కె.కరుణానిధిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్‌డిసి) చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సంస్థ ఎండి ఎన్. బంగారరాజులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎపిఎస్ఎస్‌డిసి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఎండీ బంగారరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. 


అనంతరం జపాన్ కు చెందిన కేసీసీఎస్ జపనీస్ స్కూల్ ఫౌండర్ కరుణానిధి, సీనియర్ అడ్వైజర్, హిదేహారు హ్యోడ్ లు మాట్లాడుతూ జపాన్ లో ప్రస్తుతం యువ జనాభా కంటే 50ఏళ్లకు పైబడినవారే ఎక్కువగా ఉన్నారని.. నైపుణ్యం కలిగిన యువత కొరత తీవ్రంగా ఉందన్నారు.జపాన్ కు రాబోయే రోజుల్లో కనీసం 3లక్షల మంది నైపుణ్యం కలిగిన యువత అవసరం అవుతారని.. ఇప్పటికే ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారని వారు తెలిపారు. 2050 నాటికి జపాన్ కూడా సింగపూర్ లాగా అన్ని దేశాలకు చెందిన పౌరులే ఎక్కువగా ఉండేలా మారే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల అమలు చేస్తున్నారని తెలిపారు. అదే సమయంలో జపాన్ కు వచ్చేవారికి ఖచ్చితంగా జపనీస్ భాష వచ్చి ఉండాలన్నారు. ఇందుకోసం కనీసం 500 మంది జపాన్ భాష నేర్చుకునేందుకు ముందుకు వస్తే పరీక్షా కేంద్రానికి అనుమతి ఇస్తారని ఆయన తెలిపారు.


అనంతరం ఎపిఎస్ఎస్‌డిసి ఎండీ బంగారరాజు మాట్లాడుతూ..  ఎపిఎస్ఎస్‌డిసి, ఓంక్యాప్, ఎపిఎన్ఆర్టీ సంస్థలు సంయుక్తంగా జపనీస్ సెల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఇందుకు తగిన రోడ్ మ్యాప్, విధివిధానాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, ఎండీ ఎన్. బంగారరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.వి. రామకోటి రెడ్డి, సీజీఎం నాన్ టెక్నికల్ కృష్ణమోహన్, సీజీఎం కార్పొరేట్ కనెక్ట్ సత్యప్రభ, కేసీసీఎస్ జపనీస్ స్కూల్ సీనియర్ అడ్వైజర్, హిదేహారు హ్యోడ్, కేసీసీఎస్ ఫౌండర్ కె.కరుణానిధి, నందకిషోర్ 

తదితరులు పాల్గొన్నారు.