ఏ.పి భవన్ లో ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

 

ఏపిఐసి - న్యూఢిల్లీ – నవంబర్ 01 (ప్రజా అమరావతి) :

ఏ.పి భవన్ లో ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం


  

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్, ఏ.పి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ భావ్నా సక్సేనా, స్పెషల్ కమిషనర్ ఎన్. వి. రమణా రెడ్డి వేదికను అలంకరించారు.  

ఈ సందర్భంగా గౌరవ పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్ మాట్లాడుతూ తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఎంతో గొప్పదన్నారు. ఈ రోజు (నవంబర్ 1) ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో 5 రాష్ట్రాలు అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాయన్నారు. ఆంధ్ర రాష్ట్రం మరియు తెలుగు సంస్కృతి ఖ్యాతిని పెంచడానికి అందరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. 

ఏ.పి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ భావ్నా సక్సేనా మాట్లాడుతూ రెండు సంవత్సరాల తర్వాత ఏపీ భవన్ లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు తల్లికి, తెలుగు నేలకు, తెలుగు వారికి వందనాలు తెలియజేశారు.  తెలుగు జాతి అభ్యున్నతికి పాటుపడిన మహానీయులను ఈ సందర్భంగా స్మరించడం మన కర్తవ్యమన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గర్విస్తున్నామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాసంక్షేమం మరియు అభివృద్ధి కోసం పనిచేస్తోందని, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం "సవరత్నాలు" మరియు ఇతర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరచడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోతవ్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

స్పెషల్ కమిషనర్ ఎన్. వి. రమణ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ఘన  చరిత్ర ఉందని, అమరజీవి పొట్టి శ్రీరాములు మరెంతోమంది త్యాగఫలితంతో మొదటగా 1953 లో మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి నవంబర్ 1, 1956 లో తెలంగాణ జిల్లాలను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ గా అవతరించిన మొదటి భాషాప్రయుక్త రాష్ట్రమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో వైఎస్సార్ రైతుభరోసా, ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, సంపూర్ణ మద్యపాన నిషేధం, జల యజ్ఞం, అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, పింఛన్ల పెంపు, పేదలకు గృహాలు పారదర్శకంగా అమలవుతున్నాయని, సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ఒరవడి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు తెలుగువారందరు కృషి చేస్తున్నారని విభజన తరువాత రాష్ట్రం అన్ని  అంశాలలో ఎంతో పురోగతి సాధిస్తోందన్నారు .    

ఉదయం మొదటగా పోలీస్ ల గౌరవ వందనలను స్వీకరించిన అనంతరం పీ ఆర్ సి భావ్నా సక్సేనా జాతీయ పతాకం ఆవిష్కరించి జండా కు వందనం సమర్పించారు.   పీ.ఆర్.సి తో పాటు ఏ. పి భవన్ అధికారులు, సిబ్బంది భవన్ లోని డాక్టర్ బి.ఆర్. ఆడిటోరియంలో తెలుగు తల్లి విగ్రహానికి పుష్పమాలను అర్పించి, జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు.  అనంతరం ఢిల్లీ లోని ఆదిలీల ఫౌండేషన్ వారు నిర్వహించిన వైద్య శిబిరాన్ని పీ.ఆర్.సి భావ్నా సక్సేనా ప్రారంభించారు. 

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భముగా సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.  టి.టి.డి కళాకారులచే నాదస్వరం, కూచిపూడి, కథక్ నృత్య ప్రదర్శనలు, తెలుగు ఎంప్లాయూస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే ప్రదర్శించబడిన “ఆదిలోనే  హంసపాదు”  నాటకం మొదలైన కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.  ఏ.పి భవన్ లీగల్ సెల్ ఉద్యోగి సుబ్బు మాండోలిన్ ప్రావీణ్యం, బీహార్ రెసిడెంట్ కమిషనర్ పల్కా సాహ్నికుమార్తె శాంభవి భవానీ చేసిన కూచిపూడి నృత్యం రసానుభూతిని కలిగించాయి. 

ఈ కార్యక్రమమునకు ఢిల్లీ లోని పలు రాష్ట్రాల భవన్ల రెసిడెంట్ కమిషనర్ లు,  ఏపి భవన్ లో బస చేసిన అతిథులు, ఢిల్లీ లోని పలు స్వచ్చంద సంస్థలు మరియు ఢిల్లీ లోని తెలుగు పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. 


Comments