భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై సమగ్ర నివేదిక

 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (ప్రజా అమరావతి); జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై సమగ్ర నివేదిక


 గత 15 రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే గత మూడు రోజులుగా  కురిసిన భారీ వర్షానికి జిల్లాలో జల ప్రళయం సంభవించింది. ఓవైపు సోమశిల వరద ప్రవాహం, పెన్నా నది ఉగ్రరూపం వెరసి పెన్నా పరివాహక ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోయారు. ఎటు చూసినా నీరు ముంచెత్తడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అలాగే నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల  ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. రోడ్లు తెగిపోయాయి ఎక్కడికక్కడ వాహన రాకపోకలు స్తంభించాయి. అయితే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీ కె విఎన్ చక్రధర్ బాబు,జిల్లా ప్రత్యేకాధికారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రాజశేఖర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 


జిల్లాలో చేపట్టిన సహాయ కార్యక్రమాల వివరాలు

....................................................

1). జిల్లాలో భారీ వర్షాలకు ఎవరు ఇబ్బందులు పడకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు నెల్లూరు కలెక్టరేట్ లో 1077, నగరపాలక సంస్థలో 0861 - 2355350, 1800 - 425 - 1113 టోల్ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. సహాయం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని విస్తృతంగా అధికారులు ప్రచారం చేశారు.


2). జిల్లాలో మొత్తం 92 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 44,275 మందిని సురక్షితంగా తరలించి వారికి అవసరమైన టి, పాలు, అల్పాహారం, భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు.


3). జిల్లాకు 2 ఎన్ డి ఆర్ ఎఫ్, 2 ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు రాగా నెల్లూరు, నాయుడుపేట పరిధిలో ఈ బృందాలు సేవలను ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు ఎప్పటికప్పుడు అధికారులు వినియోగిస్తున్నారు.


4). సోమశిల జలాశయం పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, సోమశిల జలాశయ ఇంజనీర్లు పర్యవేక్షిస్తూ తదనుగుణంగా అన్ని చర్యలు చేపడుతున్నారు.


5). పెన్నా నీటి ప్రవాహ ఉద్ధృతితో జలమయమైన 29 గ్రామాల్లోని ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా కోవూరు పట్టణం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఇక్కడకు ప్రత్యేకంగా పడవలను తెప్పించి ప్రజలను సురక్షితంగా కాపాడేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. 


6). నెల్లూరు వెంకటేశ్వరపురం జాతీయ రహదారి-16 ఆదివారం అర్ధరాత్రి కోతకు గురికావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. అయితే వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రోడ్డుకు వేగంగా మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. 


7). ఇక పోలీసుల సేవలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రజలను కాపాడడంలో పోలీసులు తమ శక్తి వంచన లేకుండా పని చేశారు. ఎస్పి విజయ రావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పలువురు ప్రాణాలను కాపాడారు. ముఖ్యంగా నెల్లూరు వెంకటేశ్వర సమీపంలో ఒక పూజారి వీటిలో చిక్కుకుపోగా సీఐ సాహసోపేతంగా అతన్ని కాపాడాడు.


8). బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద నీటి ప్రవాహం లో కొట్టుకుపోతున్న తండ్రి కొడుకులను రక్షించే క్రమంలో విజయనగరం ఐదవ బెటాలియన్ కు చెందిన శ్రీనివాస రావు అనే ఎస్ డి ఆర్ ఎఫ్ కానిస్టేబుల్ లైవ్ జాకెట్ తెగిపోయి మరణించాడు. ఆ తండ్రీ కొడుకులు ఎస్పీకి చేతులెత్తి నమస్కరించారు.


9). జిల్లాలో 1748 చెరువులు ఉండగా 1078 చెరువులు పూర్తిగా నిండాయి. ప్రధాన చెరువులు వద్ద గండ్లు పడకుండా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందాల ద్వారా ఎప్పటికప్పుడు చెరువుల నీటిమట్టం వివరాలు తెలుసుకుంటూ ముందస్తుగా ఇసుక బస్తాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. 


10). నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది కమిషనర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వరద నివారణ చర్యల్లో సేవలందిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు, భోజనం, వసతి సౌకర్యాలు బాధితులకు సక్రమంగా అందేలా చూస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏవైనా లోటుపాట్లు కలిగితే వెంటనే బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలను నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. 


11. జిల్లాలోని అన్ని తాసిల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ విభాగాల ద్వారా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు.


12. జిల్లాలోని అన్ని పునరావాస కేంద్రాల్లో శానిటైజర్, మాస్క్లను అందుబాటులో ఉంచి వైద్య సిబ్బంది అవసరమైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పునరావాస కేంద్రాల్లోని 44 మంది బాధితులకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.


13. జిల్లాలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. 


14. జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో  డివిజన్ కు ఒక మొబైల్ వాహనం ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. 


15. మత్స్యశాఖ ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తరలించేందుకు కృష్ణపట్నం ఓడ రేవు నుంచి అవసరమైన పడవలను తెప్పించి సహాయక చర్యలు చేపడుతున్నారు.


16. మత్స్య శాఖ ఆధ్వర్యంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించి వారికి అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారు.


17. జిల్లాలోని పలు పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జిల్లా ప్రత్యేకాధికారి శ్రీ రాజశేఖర్ ప్రత్యేకంగా పరిశీలిస్తూ అక్కడ ఏర్పాట్లపై ఆరా తీస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. 


18. వరదలు తగ్గేవరకు బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలను కొనసాగిస్తూ అన్ని సహాయక కార్యక్రమాలు చేపడతామని, బాధితులు అధైర్య పడకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు హామీ ఇస్తూ బాధితులకు భరోసాగా నిలుస్తున్నారు.