కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఆసెంబ్లీలో తీర్మానం.


శాసనసభ, అమరావతి (ప్రజా అమరావతి);


*కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఆసెంబ్లీలో  తీర్మానం.*


*కులాల వారీగా బీసీ జనగణనపై శాసనసభలో మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..*.


*90 సంవత్సరాలు గడిచిపోయింది*

బీసీల జనగణన చేయాలని చెప్పి తీర్మానం చేస్తున్నాం. బీసీల జనాభా దేశంలోనే దాదాపుగా 52 శాతం ఉంటుందని అంచనా. అయితే ఏనాడు కూడా వీరి సంఖ్య ఎంత అనేది జనాభా లెక్కల్లో మదింపు అనేది జరగలేదు. 1931లో బ్రిటీష్‌ వారి పాలనలో మాత్రమే కులపరమైన జనభా గణన జరిగింది. కులపరంగా జనాభా లెక్కలు సేకరించి ఇప్పటికి 90 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు బీసీల జనాభా ఎంతనేది కేవలం అందాజాగానూ, సుమారుగా అన్న బాపతులోనే లెక్కవేస్తున్నారు తప్ప, కచ్చితమైన డేటా అన్నది ఎక్కడా లేదు.


విద్యా పరంగా, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబాటు ఎంత ఉన్నది అన్నది కచ్చితంగా ఇంత ఉన్నది అన్నది లెక్క తెలిస్తే...ఏ మేరకు చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది ప్రభుత్వాలకు మరింత స్పష్టత ఉంటుంది. దేశంలో కులాలు ఉన్నాయి అన్న వాస్తవాన్ని అందరం అంగీకరిస్తున్నాం కానీ, జనాభా గణనలో మాత్రం రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి అంటే 1951 నుంచి ఇప్పటివరకు బీసీల జనాభా లెక్కలు ఇంతవరకు సేకరించలేదు. ఇక సెన్సెస్‌లో కులపరంగా బీసీల వివరాలు కూడా చేర్చడం ఎందుకు అవసరం అన్నది మరింత విస్తారంగా కూడా ఆలోచన చేయాలి. నిజానికి మన జనాభా లెక్కలు 2020లో జరగాలి. వివిధ కారణాలు వల్ల ప్రత్యేకించి కోవిడ్‌ వల్ల అవి వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు కాస్తంత ఆలస్యంగానైనా మొదలు కాబోతున్నాయి. 


*మరింత న్యాయం చేయాలంటున్నారు...*

ఎందుకు ఇవి అవసరం అన్నదానికి ఇంకొక కారణం కూడా ఉంది. సమాజంలో కొద్దిమంది మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటున్నారన్న భావన వల్ల కావచ్చు, కొద్దిమందిని దశాబ్ధాలుగా, శతాబ్దాలుగా రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలలో ఎదగనివ్వడం లేదన్న భావన వల్ల కావచ్చు, తాము ఎదగాల్సినంత ఎదగలేదన్న భావన వల్ల కావచ్చు, కులాలపరంగా తమకు మరింత న్యాయం చేయాలని అడుగుతూనే ఉన్నారు. 


ఈ డిమాండ్లు మన కళ్లెదుటనే కనిపిస్తూనే ఉన్నాయి. సోషల్‌ ఎక్స్‌క్లూజన్, ఎడ్యుకేషన్‌ ఎక్స్‌క్లూజన్‌ లేదా ఎకనామిక్‌ ఎక్స్‌క్లూజన్‌కు గురయ్యాం అన్న భావన ఉన్న వర్గాలు అంతా కూడా తమకు మరింత న్యాయం జరగాలి, మరింత న్యాయం చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే... మేము ఎంతమందిమి ఉన్నామనే సంఖ్య మీకు తెలుస్తేనే కదా అని చెప్పి అడిగే పరిస్థితి ఈ రోజు ఎంతైనా న్యాయంగా ఉంది. 


ఈ సారి జరగబోయే జనాభా లెక్కల్లో ప్రతి ఒక్కరు తమ కులాన్ని ప్రకటించేలా, లేదా మీ కులం ఏంటని కేంద్రప్రభుత్వమే అడిగేలా ఒక కాలమ్‌ పెట్టాలని, డేటా సేకరించాలని వచ్చిన డిమాండ్లను అన్నింటిని కూడా ఈ ఆగష్టు నెలలో  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటులో ఇచ్చిన జవాబులో తిరస్కరించింది. 


ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి, కేంద్ర ప్రభుత్వానికి రకరకాల రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పంపడం, వాటిని కేంద్రం తిరస్కరించడం మనం చూస్తున్నాం. 


*తీర్మానం ఎందుకంటే...*

కేంద్ర ప్రభుత్వానికి ఈ తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం ఎందుకంటే...  రాష్ట్ర స్ధాయిలో జనాభా గణనకు ప్రత్యేక విధానమంటూ ఏదీ లేదు, ఉండదు కాబట్టి...

అందుకే ఈ సారి జనాభా లెక్కల్లో కులాల గణన చేయాలన్న డిమాండ్‌కు మనం ఈ శాసనసభ తరపున మద్దతు తెలుపుతున్నాం.


*బ్యాక్ బోన్ క్లాస్‌*

బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ అన్నది బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు దాన్ని బ్యాక్‌ బోన్‌ క్లాస్‌గా మార్చడానికి ఈ రెండున్నర సంవత్సరాలలో మనము వేయని అడుగు లేదు. 

ఈ రెండున్నర సంవత్సరాలగా మనసా, వాచా, కర్మణా వీళ్లందరినీ కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా వీళ్లందరినీ పైకి తీసుకురావడానికి విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడం జరిగంది. ఇంకా వారికి మంచి చేసే కార్యక్రమం జరగాలంటే ఈ బీసీల జనగణన డిమాండ్‌ సంపూర్ణంగా నెరవేరితే ఇంకా మంచి చేసే వెసులుబాటు ఉంటుంది. అందుకోసమే ఈ గౌరవ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నాం. 


వెనుకబడిన వర్గాల వారి హేతుబద్ధమైన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని కులపరంగా బీసీలు, కేంద్ర ప్రభుత్వ భాషలో.. ఓబీసీలు వీరి జనాభా గణన చేయాలని గౌరవ శాసనసభ తరపున తీర్మానం చేసి కోరుతున్నాం.


*గతంలో పార్టీ తరపున తీర్మానం*

మొట్టమొదట అధికారంలోకి రాకమునుపు నుంచి కూడా ఏలూరులో పార్టీ తరపున అప్పట్లో తీర్మానం చేశాం. బీసీలు అంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాసులు కాదు వాళ్లని బ్యాక్‌ బోన్‌ క్లాసులుగా మార్చుతామని అప్పట్లో తీర్మానం చేశాం. 

 ఆ దిశగా ఈ రెండున్నరేళ్ల కాలంలో అడుగులు పడ్డాయని నిజంగా ఈ రోజు గర్వంగా చెబుతున్నాను. 

గత ప్రభుత్వ హయాంలో ఏదో చేశామంటే  చేశామన్నట్టు.. ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కొందిరికి ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి కాకుండా చేశాం. గత ప్రభుత్వ హయాంలో సాచ్యురేషన్‌ అన్నది ఎప్పుడూ లేదు.  అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రావాలి, ఇవ్వాలి అన్న తపన, తాపత్రయం ఎప్పుడూ లేదు. సాచ్యురేషన్‌ అన్న మాటకు గత ప్రభుత్వ డిక్షనరీలో మీనింగే లేదు. అర్హులందరికీ కూడా సంక్షేమం, అభివృద్ధి పథకాలన్నీ కూడా వర్తింపజేయడం అన్నది వారి చరిత్రలో ఎప్పూడూ అఢుగులు వేయలేదు. కనీసం ఆలోచన కూడా చేయలేదు. 


*టీడీపీ పాలనలో బీసీల విభజన*

టీడీపీ పాలనలో బీసీలను కూడా విభజించారు. మాకు ఓటు వేసినవారెవరు, ఓటు వేయనివారెవరు అని విభజించి, ఓటు వేసినవారికి కొద్దో గొప్పో ఇస్తాం, వేయని వారికి అది కూడా లేదు అనే పరిస్థితి గతంలో ఉండేది. 

జన్మభూమి కమిటీలని చెప్పి ఏ రకంగా చేసారన్న సంగతి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలిసిన విషయం. మనందరి పరిపాలనలో అలా కాకుండా బీసీలందరూ మనవాళ్లే... మనకు ఓటు వేసినా, వేయకపోయినా కూడా అర్హులందరికీ కూడా అర్హత ఉంటే వైయస్సార్‌ పించన్‌ కానుక, అర్హత ఉంటే చాలు వైయస్సార్‌ రైతు భరోసా, అర్హత ఉంటే చాలు వైయస్సార్‌ ఉచిత పంటలబీమా, అందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ, అర్హత ఉంటే వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా, జనగన్న అమ్మఒడి, అర్హత ఉంటే చాలు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, మత్స్య కార భరోసా, వైయస్సార్‌ నేతన్న నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైయస్సార్‌ వాహనమిత్ర, వైయస్సార్‌ బీమా ఇలా ఏ పథకం తీసుకున్న కూడా అర్హత ఉంటే చాలు మంజూరు చేశాం. జగనన్న ఇళ్ల పట్టాలుకూడా 31లక్షల మందికి ఇచ్చాం.


*అర్హతే ప్రామాణికత..*

 ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా కేవలం అర్హతే ప్రమాణంగా నాకు ఓటు వేశారా? లేదా ?అన్నది ప్రస్తావనే ఎప్పుడూ తీసుకుని రాలేదు. ఎటువంటి వివక్షకు తావులేకుండా ప్రతిఒక్కరికీ మంచి చేసే ఒక గొప్ప వ్యవస్ధ...  సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ మంచి చేయగలిగాం. 


అడుగడుగునా సామాజిన న్యాయం కనపడేలా ప్రతి అడుగు వేశాం. కాసేపటి క్రితం మంత్రి వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఎంతెంత ఖర్చు చేశామో సవిరంగా చెప్పారు. 


*అడుగడుగునా సామాజిక న్యాయం*

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున మొత్తంగా గెలిచిన, గెలవబోతున్న ఎమ్మెల్సీల లెక్క 32. వీటిలో అక్షరాలా 18 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే. రాజ్యసభకు నలుగురిని పంపించాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు పంపిన నలుగురులో ఇద్దరు బీసీలు. ఆశ్చర్యమేమిటంటే గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల టీడీపీ పాలనలో ఒక్కరంటే ఒక్క బీసీని రాజ్యసభకు పంపించిన పరిస్థితులు  లేవు.


*మండలి ఛైర్మన్‌గా...* 

దేవుడు దయ వలన శాససనభ స్పీకర్‌ పదవికి కూడా మిమ్నల్ని కూర్బొబెట్టే భాగ్యాన్ని కూడా దేవుడు కలిగించాడు. మండలి ఛైర్మన్‌కూడా కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా తొలిసారి దళతులకు ఇవ్వగలిగామని గర్వంగా తెలియజేస్తున్నాను. శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించగలిగాం. నామినేటెడ్‌ పదవుల్లో, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్టం చేసి 50 శాతం ఇచ్చేట్టు చేసిన ప్రభుత్వం మనది. నామినేటెడ్‌ పదవుల్లో నామినేటెడ్‌ కాంట్రాక్టుల్లో మహిళలకు కూడా 50 శాతం చట్టం చేసి ఇవ్వగలిగాం. 

మొత్తం 648 మండలాలకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకున్నది  635. అందులో బీసీలకు 239 అధ్యక్ష పదవులిచ్చాం. అంటే 38 శాతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనర్టీలకు 67 శాతం ఇచ్చాం. మొత్తం 13 జెడ్పీ ఛైర్మన్‌ పదవుల్లో బీసీలకిచ్చినవి 6, అంటే 46 శాతం బీసీలకిచ్చాం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 69 శాతం జెడ్పీ ఛైర్మన్‌ పదవులిచ్చాం.


*కార్పొరేషన్ మేయర్లుగా...* 

13 నగర కార్పొరేషన్ల ఛైర్మన్లు అంటే మేయర్‌ పోస్టులలో బీసీలకిచ్చినవి 7, అంటే 54 శాతం బీసీలే. మొత్తంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకు 92 శాతం ఇచ్చాం. 

మొత్తం 87 మున్సిపాల్టీలలో 84 మనం గెల్చుకున్నాం. ఒకటి టై అయింది. ఫలితం రాలేదు. టాస్‌లో దేవుడి ఆశీర్వచనం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇంకొక బీసీ అభ్యర్ధి దానివల్ల పెరుగుతాడు. ఈ 84లో 37 ఛైర్మన్‌ పదవులు బీసీలకు అంటే 44 శాతం ఇచ్చాం. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు మొత్తం 73 శాతం పదవులిచ్చాం. దేవుడు దయతో ఆ కొండపల్లి కూడా వస్తే మరో బీసీ పెరుగుతాడు. 


*మార్కెట్ కమిటీల ఛైర్మన్లగా..*

196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఛైర్మన్లలో 76 అంటే 39 శాతం బీసీలకే ఇచ్చాం. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం ఛైర్మన్‌ పదవులిచ్చాం. 

వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్‌ పదవులను నియామకం చేస్తే... 53 పదవులు బీసీలకే ఇచ్చాం. ఇది 39 శాతం. ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీలను కలుపుకుంటే 58 శాతం ఇచ్చాం. ఇవి కాక బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మరో 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు మరో కార్పొరేషన్‌ ప్రత్యేకంగా నియమించాం. గతంలో నేను చెప్పిన లెక్కలు కాకుండా ఇవి ప్రత్యేకంగా నియమించినవి. 


*డైరెక్టర్ల నియామకాలలోనూ*

137 కార్పొరేషన్‌లకు సంబంధించి మొత్తం 484 నామినేటెడ్‌ డైరెక్టర్ల పోస్టులలో 201 బీసీలకే ఇచ్చాం. అంటే డైరెక్టర్లలో బీసీలు  42 శాతం కాగా, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకిచ్చింది 58శాతం. 

ఇవి కాక 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు, 1 ఎస్టీ కార్పొరేషన్‌... వీటిలో మరో 684 డైరెక్టర్ల పోస్టులన్నీ కూడా వీళ్లకే ఇచ్చాం. 


*శాశ్వత ఉద్యోగాలలోనూ...*

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపు 1.30 లక్షలు. వీటిలో 83 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ఈ 29 నెలల్లో మరో 2.70 లక్షల వలంటీర్‌ ఉద్యోగాలు, మిగిలిన ఉద్యోగాలు కలుపుకుని మన కళ్లెదుటే 6.03 లక్షల మంది ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తున్నారు. సామాజిక న్యాయానికి అద్దం పడుతూ ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కనీసం 75 శాతానికి పైగా ఉద్యోగాలు ఇచ్చాం.


*పేద వర్గాలన్నీ ఒక్కటిగానే ఉండాలి*

ఇవన్నీ మనసు పెట్టి చేశాం. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో కూడా మరింత మంచి చేసే అవకాశం కలగాలని కోరుకుంటున్నాను. అట్టగుడు వర్గాల్లో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఈ పేద వర్గాలన్నీ కూడా ఒక్కటిగా ఉండాలి.


విభజించు పరిపాలించు అన్న గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలకు కూడా చరమగీతం పాడాలి. 

వీరందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Comments