సహాయ చర్యలను ముమ్మరం చేయండి !

 


*సహాయ చర్యలను ముమ్మరం చేయండి !*


* *అధికారులను ఆదేశించిన జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్*


* *జిల్లా కలెక్టర్, ఆర్డీవోలతో వరద నష్టంపై జూమ్ విసి ద్వారా సమీక్ష*


* *సీఎస్ఆర్ నిధుల క్రింద రూ.2 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి*


కడప, నవంబర్ 23 (ప్రజా అమరావతి): "జవాద్" తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించి.. పునరావాస, పునరుద్ధరణ, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని.. జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లా అధికారులను ఆదేశించారు. 


జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో.. బాధిత కుటుంబాలకు సహాయక చర్యలు, పునరావాస చర్యలపై.. మంగళవారం జిల్లా కలెక్టర్, జేసీలు, ఆర్డీవోలు, పీఆర్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్.. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 


ఈ సందర్బంగా.. జిల్లా ఇంచార్జి మంత్రి  ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... భారీ వర్షాలు, వరదల సమయంలో జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు, ఫైర్, రెస్క్యూ సిబ్బంది నిర్వహించిన సహాయక చర్యలు అభినందనీయం అన్నారు. సంబందిత శాఖల ముందస్తు చర్యల ద్వారా.. జిల్లాలో చాలావరకు ప్రాణనష్టం, ఆస్తినష్టం కాపాడగలిగామన్నారు. వరద ఉధృతి తగ్గిన వెంటనే.. జిల్లా యంత్రాంగం చేపడుతున్న.. రిస్టోరేషన్ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా..  రోడ్లు మరమ్మతులు, గ్రామాలకు ట్రాన్స్పోర్టు సంబంధాలు, పారిశుధ్యం, విద్యుత్, మంచినీరు,  తాత్కాలిక పునరావాస చర్యలు, కనీస వసతులు కల్పించాలన్నారు. మృతుల కుటుంబాలకు తక్షణ ఎక్స్ గ్రేషియా, వరద ప్రభావిత కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం, సరుకులు పంపిణీ వేగవంతం చేయాలన్నారు. ఇళ్ళు, పంటల నష్టంకు సంబంధించి ఎన్యుమరేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి.. ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. 


వరద నీటిని గ్రామాల్లో తొలగించేలా డ్రైనేజ్ పనులను వేగవంతం చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లోనే కాకుండా కొన్ని చోట్ల తాత్కాలిక షెడ్ లను ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారని.. ఆ దిశగా అధికారులు ద్రుష్టి సారించాలన్నారు. తాగునీరు, విద్యుత్, రవాణా సౌకర్యం పై తక్షణమే ద్రుష్టి పెట్టి సాధారణ పరిస్థితి వచ్చేలా అధికారులంతా పని చేయాలన్నారు. 


క్షేత్ర స్థాయిలో అధికారులు బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. పరిహారం పంపిణీ, ఇతర సహకారం లో అధికారులు చిత్తశుద్ధి తో వ్యవహారించాలన్నారు. వరదల్లో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు పోగొట్టుకున్న బాధితులకు తక్షణమే కొత్త కార్డులు అందించాలన్నారు. వరద సమయంలో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించాలన్నారు. 


కమలాపురం వద్ద పాపాఘ్నిపై, జమ్మలమడుగు వద్ద పెన్నా నదిపై వంతెనల స్థానంలో ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆక్రమణలకు గురైన చెరువులను సర్వే చేసి వాటిని మరమ్మత్తులకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో డ్రైనేజీ వ్యవస్థ శాశ్విత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 


కడప జిల్లాలో తుపాను పెద్ద గాయాన్ని చేసిందని, విఫత్తు సమయంలో జిల్లా యంత్రాంగం అంతా శ్రమించిందని, ప్రస్తుతం పునరుద్ధరణ చర్యలను కూడా..  అధికారులు సమన్వయంతో సకాలంలో స్పందించి సాధారణ పరిస్థితి వచ్చే వరకు శ్రమించాలని జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు.


*** అనంతరం.. జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు  జిల్లాలో వరద నష్టాన్ని మంత్రికి వివరించారు. జవాద్ తుఫాను ప్రభావంతో ఈ నెల 17 నుండి 19వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా.. అన్ని నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహించాయన్నారు. జిల్లాలో 48 మండలాల్లోని 866 గ్రామాలు వరద ప్రభావానికి గురి కాగా.. రాజంపేట పట్టణంతో పాటు 12 గ్రామాలు  ముంపునకు గురయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 25,142 మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,57,115.44 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని మంత్రికి వివరించారు. ప్రధానంగా.. వెలిగల్లు ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో వదిలిన వరద నీటి ఉధృతి కారణంగా.. పాపాఘ్ని నదిపై నిర్మించిన గండి వద్ద బ్రిడ్జి కుంగి పోగా, కమలాపురం-వల్లూరు మధ్యలో ఉన్న హైలెవెల్ బ్రిడ్జీ, జమ్మలమడుగు-ముద్దనూరు మధ్యలో పెన్నాపై బ్రిడ్జి.. పడిపోయాయన్నారు. వరద నీటి ఉదృతి తగ్గాక.. ఆయా బ్రిడ్జిలకు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక రహదారులను పునరుద్దరిస్తామన్నారు.


గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మంచినీరు, రోడ్లు, కనెక్టివిటీ రిస్టోరేషన్ చర్యలను చేపడుతున్నామన్నారు. మరో 24 గంటల్లో పూర్తి స్థాయిలో రిస్టోరేషన్ పనులను మొత్తం పూర్తి చేయనున్నామన్నారు. చెయ్యరు, అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధిత గ్రామాలైన 12 ఊర్లలో ముమ్మరంగా సహాయక చర్యలు, రిస్టోరేషన్ పనులు సంబందిత శాఖల అధికారులు చేపడుతున్నారన్నారు. మరోవైపు పంటలు, నిర్మాణాల నష్టంపై ఎన్యుమరేషన్ ప్రక్రియ సాగుతోందన్నారు. ప్రస్తుతం.. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీ రాజ్, ఆర్అండ్ బి, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ తదితర శాఖలు పునరుద్ధరణ చర్యల్లో పూర్తిగా నిమగ్నమయ్యారన్నారు. 


రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. జిల్లాలోని 6250 మంది వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు ఆర్థిక సాయంతో పాటు, 25 కిలోల బియ్యం పాకెట్, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, 1 కిలో ఉల్లిగడ్డలు, 1 కిలోల ఉర్లగడ్డలు చొప్పున.. అందివ్వడం జరుగుతోందన్నారు. 


ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సాయంతో పాటు.. స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి.. వరద బాధిత ప్రజలకు ఆహారం, మంచినీరు, దుస్తులు, సరుకులు, బియ్యం.. మొదలైన వస్తువులను అందిస్తున్నారన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సీఎస్ఆర్ నిధుల క్రింద రూ.2 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించగా.. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి.. మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు, ఒక్కో వరద ప్రభావిత కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని ప్రకటించి పంపిణీ చేస్తున్నారన్నారు. 


అనంతరం శాఖల వారీగా జరిగిన వరద నష్టాన్ని, యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలు, పునరుద్ధరణ చర్యల వివరాలను సంబందిత శాఖల అధికారులు మంత్రికి తెలియజేసారు. 


ఈ కార్యక్రమంలో జేసీలు ఎం.గౌతమి, సాయికాంత్ వర్మ, ధ్యానచంద్ర, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్వో మాలోల, కడప, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ల ఆర్డీవోలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, మున్సిపల్ కమీషనర్లు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఎపి ఎస్.పి.డి.సి.ఎల్., ఇరిగేషన్, రూరల్ వాటర్, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారులు, పబ్లిక్ హెల్త్, డిఎంహెచ్ఓ, అనుబంధ శాఖల అధికారులు  తదితరులు పాల్గొన్నారు.