ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారాలు, ఆరోపణలు


నెల్లూరు, నవంబర్ 24 (ప్రజా అమరావతి): భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తుంటే ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారాలు, ఆరోపణలు


చేయడం తగదని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం సమీపంలోని టిడ్కో ఇళ్లను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రి పరిశీలించి బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ముమ్మరంగా వరద నివారణ చర్యలు, సహాయక కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతిపక్ష నేతలు కావాలనే అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సోమశిల జలాశయం ఎంతో పటిష్టంగా ఉంటే తెగిపోయిందని పుకార్లు చేయించారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం కోవూరులో తాను, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే కారు కూడా దిగకుండా వెళ్ళిపోయామని పనిగట్టుకొని ఎల్లో మీడియా అవాస్తవాలు ప్రచారం చేయడం తగదన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరద మరణాలను ప్రభుత్వ హత్యగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కృష్ణా నది పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు నాయుడు బలిగొన్నారని ఆరోపించారు. ప్రకృతి విపత్తులు సహజమని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తగదన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ లు చేపట్టి ఎందరో ప్రజల ప్రాణాలను కాపాడామని, పోలీసులు సాహసోపేతంగా ప్రజలను రక్షించారని, ఆ క్రమంలో ఎస్డిఆర్ఎఫ్ కానిస్టేబుల్ కూడా మరణించారని, వరద సహాయక చర్యల్లో జిల్లా యంత్రాంగం అహర్నిశలు శ్రమించిందని, ఇంత చేస్తున్నా కావాలని అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. చేతనైతే ప్రజలకు ఊరట కలిగించేలా వారిని పరామర్శించాలన్నారు. వరద బాధితులందరికీ ప్రభుత్వ సహాయాన్ని అందిస్తామని, ఎవరు అధైర్య పడవద్దని సూచించారు. 

 ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ శ్రీ చెన్నుడు, అర్బన్ తహసీల్దార్ శ్రీ మనోహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Comments