పోలీసులు మానసిక వత్తిడిని తగ్గించుకోవడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి
- పోలీసులు మానసిక వత్తిడిని తగ్గించుకోవడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి 


- పోలీస్ జిమ్ ను సిబ్బంది వినియోగించుకోవాలి 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మచిలీపట్నం, డిసెంబర్ 4 (ప్రజా అమరావతి): ఉదయం లేచిన దగ్గర నుండి విశ్రమించేంత వరకు నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసులు మానసిక వత్తిడిని తగ్గించుకోవడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. శనివారం మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీస్ ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్ (జిమ్) ను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తో కలిసి మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం జిమ్ పరికరాలను పరిశీలించారు. కొద్దిసేపు సాధన చేసి ఆయా పరికరాల పనితీరును గమనించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది శారీరక ఆరోగ్యంపై సరైన దృష్టి కేంద్రీకరించడం లేదని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ గుర్తించారని చెప్పారు. సిబ్బంది సంక్షేమంలో భాగంగా అధునాతన పరికరాలతో పోలీస్ వెల్ఫేర్ జిమన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ జిమ్ను పోలీసులు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. తద్వారా విధినిర్వహణలో మెరుగైన ఫలితాలను కనబర్చగలరని తెలిపారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, వివిధ రకాల సమస్యలపై తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులు వ్యాయామం చేయడానికి జిమ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కొంత సమయాన్ని కేటాయించి సాధన చేయాలని కోరారు. ముందుగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ పుష్పగుచ్ఛాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషినల్ ఎస్పీ ప్రసాద్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ధర్మేంద్ర, ఏఆర్ డీఎస్పీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.