సర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
తిరుపతి, డిసెంబరు 07 (ప్రజా అమరావతి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం రథోత్సవం బదులుగా సర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు కటాక్షించారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసుదన్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment