శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం
తిరుపతి, డిసెంబర్ 08(ప్రజా అమరావతి): సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి ( తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయం వద్దగల వాహన మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న పుష్కరిణిలో ఉదయం 11.52 గంటలకు కుంభ లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా వాహన మండపానికి వేంచేపు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె బయల్దేరి ఉదయం 10 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
అమ్మవారికి శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు :
825 గ్రాములు బరువుగల కెంపులు,పచ్చలు, నీలము, ముత్యాలు పొదిగిన బంగారు పతకము, రెండు బాజీ బందులు శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
ఆభరణంతో కూడిన శ్రీవారి సారెను అలిపిరి వద్ద అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తిరుపతి జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అందజేశారు. అక్కడి నుండి తీసుకొచ్చిన సారెను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డికి జెఈవో అందించారు.
శోభాయమానంగా స్నపన తిరుమంజనం
వాహన మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
కుంకుమ పూవు, యాలకులు, ఆప్రికాట్ గ్రేప్స్, నెమలి ఈకలు, కొబ్బరి ఆకు, రోజా పూలు, తులసి మాలలు, కిరీటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆకట్టుకున్న ఫలపుష్ప మండపం:
టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో తామరపువ్వులు, ఆపిల్, గ్రీన్ ఆపిల్, ద్రాక్ష, పైనాపిల్, రోజా, సంపంగి, కట్ ఫ్లవర్స్ తో వాహన మండ పాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
కాగా రాత్రి బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో ఊరేగించిన అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఈవో డాక్టర్ శ్రీ కె.ఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ అజేయ కల్లం, బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎంఎల్‌ఏ డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం దంపతులు, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వోలు శ్రీ మనోహర్, శ్రీ బాలిరెడ్డి, ఎస్ఇ శ్రీ సత్యనారాయణ, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈఓ శ్రీ రాజేంద్రుడు, డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి కస్తూరిబాయి, ఆగమ సలహాదారు, కంకణభట్టార్ శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసూదన్, ఎవిఎస్వోలు శ్రీ సాయిగిరిధర్, శ్రీ సురేంద్ర, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
డిసెంబరు 9న పుష్పయాగం
బ్రహ్మోత్సవాల మరుసటి రోజైన డిసెంబరు 9వ తేదీ గురువారం సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణముఖ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
addComments
Post a Comment