సీఎం అయిన నెలరోజుల్లో అన్ని ఇళ్లకు పట్టాలు : చంద్రబాబు

 *సీఎం అయిన నెలరోజుల్లో అన్ని ఇళ్లకు పట్టాలు : చంద్రబాబు*

అమరావతి (ప్రజా అమరావతి): తాను సీఎం అయిన నెలరోజుల్లో అన్ని ఇళ్లకు పట్టాలిప్పిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. గురజాల నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా ఎన్నికలు జరిగితే గురజాల, దాచేపల్లి మునిసిపల్ ఎన్నికల్లో విజయం మనదేనన్నారు. 8 మంది టీడీపీ కార్యకర్తల హత్యకు సీఎం సమాధానం చెప్పగలారా అని ప్రశ్నించారు. ఎప్పుడో కట్టిన ఇళ్లకి, ఇచ్చిన ఇంటి స్థలాలకు ఇప్పుడు పట్టా ఏంటని ఆయన నిలదీశారు. పట్టాలకు రూ.10 వేలు ఎందుకు కట్టాలన్నారు. ఉచితంగా ఇళ్లు పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రంలో వరదలు వస్తే హెచ్చరికలు కూడా చేయలేదన్నారు. నెల్లూరు ముంపునకు ఇసుక అక్రమ తవ్వకాలే కారణమని ఆయన ఆరోపించారు. ఓ మంత్రి వరి వేయొద్దంటున్నారని, మరి ఏం వేయాలని  ప్రశ్నించారు. సీఎం జగన్‌రెడ్డి స్పెషల్ స్టేటస్ తేలేడు కానీ..స్పెషల్ స్టేటస్ బ్రాండ్ మద్యం తెస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.