నెల్లూరు, డిసెంబర్ 30 (ప్రజా అమరావతి):- విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయతా భావాలు పెంపొందించి వారిని
మంచి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని కేంద్ర విముక్త సంచార, అర్థ సంచార జాతుల అభివృద్ధి సంక్షేమ బోర్డు సభ్యులు శ్రీ తురక నరసింహ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వారు సంబంధిత అధికారులతో విద్య, ఎస్సీ ఎస్టీల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవని, దేశమంటే మట్టికాదు మనుషులని మానవుల అభివృద్దే దేశ అభివృద్ధని, మానవ అభివృద్ధి దేశ సంపద అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో పని చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ ఎస్టీ బిసిల అభివృద్ధి కోసం విముక్త సంచార జాతుల ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మానవ అభివృద్ధి లో విద్య కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వం విద్య పైన ప్రత్యేక దృష్టి సారించినదన్నారు. పాఠశాల తరగతి గదుల్లో విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, సౌభ్రాతృత్వం, శాస్త్రీయత, విజ్ఞానం అన్ని విధాల పెంపొందించి వారిని మంచి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపాధ్యాయులు బోధించే భౌతిక, రసాయన శాస్త్రాలు, సామాజిక, తెలుగు సబ్జెక్టుల ద్వారా దేశ భవిష్యత్తు నిర్మితం కావాలని పునరుద్ఘాటించారు. పిల్లలకు చదువు భారం కాకూడదని సులభతరంగా నేర్చుకునేలా ఉండాలని స్పష్టం చేశారువిద్య ద్వారా పిల్లలకు ఏవిధంగా పునాదులు వేయాలో సోదాహరణంగా వివరించారు. ఇందుకోసం కార్యశాలలు నిర్వహించి ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక అవగాహన కల్పించాలన్నారు. అంతకుమునుపు శ్రీ నరసింహ ఎస్సీ ఎస్టీ బిసి తదితర కులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధానాల గురించి చర్చించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏ విధంగా అమలు అవుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా కార్యశాలలు నిర్వహించాలని సూచించారు. అటవీ చట్టాలు ఏ విధంగా ఎస్టీలకు ఉపయోగపడుతున్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు.
ఈ సమావేశంలో ఆసరా సంయుక్త కలెక్టర్ శ్రీమతి రోజ్ మాండ్, డిఆర్ ఓ శ్రీ బి చిన్న ఓబులేసు, అదనపు ఎస్పీ శ్రీమతి వెంకటరత్నం, డి ఎఫ్ ఓ శ్రీ షణ్ముఖ కుమార్, ఐటి డిఏ పి ఓ శ్రీమతి భవాని, నెల్లూరు, నాయుడుపేట, ఆత్మకూరు, గూడూరు ఆర్ డి వో లు శ్రీ హుస్సేన్ సాహెబ్, శ్రీమతి సరోజినీ, చైత్ర వర్షిని, మురళి కృష్ణ డి ఈ ఓ శ్రీ రమేష్, బీసీ సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య ,నెల్లూరు నగరపాలక సంస్థ ఉప కమిషనర్ శ్రీ చెన్నుడు తదితర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
addComments
Post a Comment