నవ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, స్త్రీ దాస్యవిమోచకడు డా.బి.ఆర్.అంబేత్కర్ దేశానికి చేసిన సేవలను ఎనలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కొనియాడారు.

            కాకినాడ (prajaamaravati);

నవ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, స్త్రీ దాస్యవిమోచకడు డా.బి.ఆర్.అంబేత్కర్ దేశానికి చేసిన సేవలను ఎనలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్  కొనియాడారు. 


సోమవారం భారత రత్న డా.బి.ఆర్.అంబేత్కర్ 65వ మహాపరినిర్వాణ దినం (వర్థంతి) పురస్కరించి స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి సమీపంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎమ్మెల్సీ డా.పండుల రవీంద్రబాబు, జడ్పి చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు, పలువులు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, దళిత సంక్షేమ సంఘాల ప్రతినిధులు పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించడం ద్వారా అణగారిన పీడిత, తాడిత వర్గాలు, మహిళల అభ్యున్నతికి బాబాసాహేబ్ అంబేత్కర్ కృషి చేశారని, మహోన్నతమైన, ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించి ఆయన దేశానికి దశ, దిశ చూపారని కొనియాడారు.  ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ప్రపంచ దేశాలు కుప్పకూలినా, భారత దేశం అప్రతిహతంగా ముందుకు సాగుతోందని,  దార్శినికతతో ఇందుకు సుస్థిరమై రాజ్యాంగ పునాదు వేసిన అంబేత్కర్ ను దేశ ప్రజలు ఆచంద్రతారార్కం కృతజ్ఞతాబద్దులై ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన సమున్నత ఆశయాలు, ఆదర్శాల బాటలో పయనించడమే ఆయనకి అర్పించే నిజమైన నివాళి కాగలదని మంత్రి పేర్కొన్నారు.   ముందుచూపుతో హైదరాబాదును దేశ రెండవ రాజధానిగా ఏర్పాటు చేయాలని ఆయన చేసిన సూచనను పాటించి ఉంటే తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవలసిన పరిస్థితి ఉత్పన్నమై ఉండేదే కాదన్నారు.  అమలాపురంలో అంబేత్కర్ భవన్ నిర్మాణానికి 12 కోట్లు నిధులు మంజూరు చేశామని, అలాగే జిల్లా కేంద్రం కాకినాడలో శిధిలావస్థలో ఉన్న అంబేత్కర్ భవన్ పునర్ నిర్మాణానికి డిజైన్లు సిద్దం కాగానే 15 నుండి 20 కోట్ల మేరకు నిధులు కేటాయిస్తామని మంత్రి విశ్వరూప్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ వైవిధ్యమైన భారత దేశానికి  తర తరాలకు ఆదర్శనీయంగా నిలిచే రాజ్యాంగాన్ని అందించిన మహనీయునిగా అంబేత్కర్ చరిత్రలో చిరస్మరనీయుడిగా నిలిచి ఉంటారన్నారు. ఆయన ఆశయాల కనుగుణంగా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని ఆయా వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంబేత్కర్ జీవితం, ఆయన అందించిన రాజ్యాంగ స్పూర్తితో అందరం అసమానతలు లేని సమసమాజ సాధనకు కృషి చేద్దామన్నారు. జిల్లాలో ఎస్సి, ఎస్టి ప్రజల సమస్యల పరిష్కారానికి గత రెండు నెలలుగా ఆఖరి సోమవారం ప్రత్యేక గ్రివెన్స్ నిర్వహిస్తున్నామన్నారు.  ఈ నెల 16వ తేదీన ఎస్.సి., ఎస్.టి. విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ సెల్ సమావేశం నిర్వహించనున్నామని, ఈ సమావేశం లోపునే కాకినాడ అంబేత్కర్ భవన్ పునర్ నిర్మాణానికి డిజైన్లు సిద్దం చేసి సమర్పిస్తామని మంత్రికి తెలియజేశారు. ఎమ్మెల్సీ డా.పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ మనిషిని మనిషిగా చూడలేని సమాజంలో అందరూ సమానులేని చాటి, అందరికీ సమాన హక్కులు కోసం పోరాడిన మహా సంస్కర్తని అంబేత్కర్ ను కొనియాడారు.  అమెరికా సహా ఎన్నో ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలు మారాలంటే రక్తపాతాలు జరుగుతున్నాయని, ఎన్నో వైవిధ్యాలు కలిగిన భారత దేశంలో ఏ అలజడి లేకుండా సజావుగా ప్రభుత్వాలు మారుతున్నాయంటే దానికి అంబేత్కర్ అందించిన ఆదర్శ రాజ్యాంగమే కారణన్నారు. జడ్పి చైర్మన్  విప్పర్తి వేణుగోపాలరావు ప్రసంగిస్తూ, బానిస పాలన నుండి సుస్థిరమైన స్వపరిపాలనకు అంబేత్కర్ పునాదు వేసారన్నారు.  ఆయన ఆదర్శంగా ఎస్సి, ఎస్టి వర్గాల ప్రజలు విద్యలో రాణించి అన్ని రంగాలలో పురోగమించాలని కోరారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అంబేత్కర్ ఆశయాలే స్పూర్తి అని  కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి పేర్కొన్నారు.      ఈ    కార్యక్రమంలో స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజ‌బాబు యాదవ్, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్‌సీ, ఎస్‌టి విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు అయితా బత్తుల రాజేశ్వరరావు, నక్కా చిట్టిబాబు, కొమ్ము చినబాబు,  సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగ లక్ష్మీదేవి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ఈడీలు జీఎస్ సునీత, ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మి, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, ఎస్సి, ఎస్టి సంక్షేమ సంఘాల ప్రతినిధులు,వివిధ వార్డుల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Comments