సామాన్యునికి అందుబాటులో వినోదం ఉండేలా సినిమా టికెట్ల రేట్లు

 

సామాన్యునికి అందుబాటులో వినోదం ఉండేలా సినిమా టికెట్ల రేట్లు



రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

అమరావతి,డిశంబరు 28 (ప్రజా అమరావతి):  రాష్ట్రంలోని సామాన్య ప్రజలందరికీ అందుబాటులో వినోదం ఉండేలా సినిమా టికెట్ల రేట్లను రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన కమిటీ త్వరలో నిర్ణయిస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య  (నాని) పేర్కొన్నారు. మంగళవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లోని మంత్రి చాంబరులో  మంత్రి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగానున్న ఫిల్ము డిస్ట్రిబ్యూటర్ల సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ  సందర్బంగా సినిమా టికెట్ల రేట్లను పెంచమని, బెన్పిట్ షోలకు అనుమతించమని, సినిమా థియేటర్ల లైసెన్సును రెన్యువల్ చేసుకునేందుకు, అగ్నిమాపక శాఖ నుండి నిరభ్యంతర సర్టిఫికెట్ పొందేందుకు సినిమా థియేటర్ల యజమానులకు కొంత గడువు ఇవ్వమని ఫిల్ము డిస్ట్రిబ్యూటర్ల సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులపై మంత్రి  సమగ్రంగా చర్చించారు. అనంతరం  సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్లో  ఆయా ప్రతినిధులతో కలసి మంత్రి  పాత్రికేయులతో మాట్లాడారు.  

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనల మేరకు సినిమా టికెట్ల రేట్ల అంశాన్ని పరిశీలించేందుకై రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షునిగా మరియు కన్వీనర్ గా  రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సంబంధిత శాఖల అధిపతులతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంఘాల ప్రతినిధులు  ఇందులో సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ కమిటీ త్వరలో సమావేశమై సినిమా టికెట్ల రేట్లపై పలు వర్గాల నుండి వచ్చిన విజ్ఞప్తులను  పరిశీలించి సామాన్య ప్రజలందరికీ అందుబాటులో వినోదం ఉండేలా సినిమా టికెట్ల రేట్లను నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. 

ఈ సందర్బంగా కొంతమంది పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాదానం చెపుతూ ఈ ఏడాది సెప్టెంబరు 20 న సినీ పరిశ్రమ ప్రముఖులు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంఘాల ప్రతినిధులతో అమరావతి సచివాలయం ప్రాంగణంలో సమావేశం జరిగిందన్నారు. సినిమా థియేటర్ల లైసెన్సులు రెన్యువల్ చేయించుకోవాలని, అగ్నిమాపక శాఖ నుండి నిరభ్యంతర సర్టిఫికేట్లు పొందాలని, రెవిన్యూ శాఖ నుండి “బి” ఫార్ములను పొందాలని ఈ సమావేశంలో  అందరికీ విజ్ఞప్తిచేయడం జరిగిందని మంత్రి తెలిపారు.  అయితే సుమారు మూడు మాసాలు పైబడినప్పటికీ  ఎటు వంటి స్పందన లేకపోవడంతో చట్టం తనపని తాను చేసుకుపోతున్నదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం తొమ్మిది జిల్లాల్లో 130 సినిమా థియేటర్లు నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నట్లు గుర్తించడమైందన్నారు. వీటిలో 83 సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేయడం జరిగిందని, 25 సినిమా థియేటర్లకు జరిమానా విధించడం జరిగిందని మిగిలిన 22 సినిమా థియేటర్లకు చెల్లుబాటుఅయ్యే లైసెన్సులు లేకపోవడం వల్ల యజమానులే వాటిని మూసేసుకున్నారని మంత్రి తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర  ఫిల్మ్, టెలివిజన్ మరియు థియేటర్  డెవలెప్మెంట్  కార్పొరేషన్ మేనేజింగ్  డైరెక్టర్ మరియు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్  టి.విజయ్ కుమార్ రెడ్డి,  రాష్ట్ర హోమ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.విజయమార్, ఎఫ్.డి.సి. జనరల్ మేనేజర్ శేషసాయి, తెలుగు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోషియేషన్ కార్యదర్శి వేగి వీరినాయుడు, డిస్ట్రిబ్యూటర్లు భరత్ చౌధరి, రాజేష్, ముత్యాల రామదాసు, సత్యనారాయణరాజు,అలంకార్ ప్రసాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నున్న సుమారు 24 ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    

Comments