మూడు రాజధానులకే మేం కట్టుబడి ఉన్నాం



- మూడు రాజధానులకే మేం కట్టుబడి ఉన్నాం

- నిర్ధిష్టమైన చట్టాన్ని చేసి అసెంబ్లీలో పెడతాం

- మూడు ప్రాంతాల అభివృద్ధిని సీఎం శ్రీ వైయస్ జగన్ కోరుతున్నారు

- రాజధాని పేరుతో చేసింది రైతు ఉద్యమం కాదు

- ఈ ఉద్యమంలో రైతులు ఎవరూ లేరు

- టిడిపి ఈ ఉద్యమంను నడిపించిందనేది బట్టబయలు అయ్యింది

- అమరావతిలో భూములకు రేట్లు పడిపోయాయనే ఆక్రోశంతోనే ఈ ఉద్యమం

- ఇది కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారం

- అమరావతిలో వేల కోట్లతో కొన్న భూములను పరిరక్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం

- తోకపార్టీలను కలుపుకుని చంద్రబాబు చేస్తున్న కుట్ర

- కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్ట్‌ల కలయిక అనైతికం

- బిజెపితో జత కట్టడానికే చంద్రబాబు తంటాలు

- రఘురామకృష్ణ రాజు నీతిలేని వ్యక్తి

- మా పార్టీ నుంచి ఫిరాయించిన వారికి మాట్లాడే నైతిక అర్హత లేదు



: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


తిరుపతి (ప్రజా అమరావతి):


1)   అమరావతి రాజధాని పేరుతో చేస్తున్న ఉద్యమం రైతు ఉద్యమం కాదని, తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమంను నడిపిస్తోందనే విషయం ఈ రోజు తిరుపతి సభ ద్వారా బట్టబయలు అయ్యిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో రాజధాని పేరుతో  కొనుగోలు చేసిన భూములకు రేట్లు తగ్గిపోకుండా పరిరక్షించుకునేందుకే కొందరు ఈ ఉద్యమాన్ని నడిపించారని విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...


2)    అమరావతి రాజధాని పరిరక్షణ పేరుతో కుట్రపూరితంగా గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఈ ఉద్యమం వెనుక టిడిపి ఉందనే విషయం ఈ రోజు ప్రజలందరికీ తెలిసిపోయింది. తిరుపతి సభలో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి రాజధాని విషయంలో శ్రీ వైయస్ జగన్ మాట తప్పాడు, మడమ తిప్పాడు అంటూ తప్పుడు విమర్శలు చేశాడు. ఏనాడు శ్రీ వైయస్ జగన్ రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న దందాకు మద్దతు ప్రకటించలేదు. ఈ రోజు చంద్రబాబు ఈ ఉద్యమంకు మద్దతు పేరుతో చేస్తున్న ప్రయత్నం రాజధాని ప్రాంతంలో తాము కొనుగోలు చేసిన వేల ఎకరాల భూములకు రేట్లు పడిపోకుండా పరిరక్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే.  


3)   అందుకు కొన్ని తోకపార్టీలను కలుపుకుని ఈ ప్రభుత్వంపై కుట్రపూరితంగా తప్పుడు విమర్శలు చేస్తున్నాడు. రాజధాని పరిరక్షణకు మద్దతు పలుకుతున్న పార్టీలకు ప్రజల్లో ఉన్న బలం ఎంత? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ ఉంది? బిజెపికి ఒట్లు ఎక్కడ ఉన్నాయి? వాటిని కలుపుకుని చంద్రబాబు మా ప్రభుత్వంపై బురదచల్లుతున్నాడు. రానున్న రోజుల్లో బిజెపితో జత కట్టేందుకే చంద్రబాబు ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రబాబు ఏ పార్టీతో జతకట్టినా, ఎన్ని తోకపార్టీలను కలుపుకున్నా సరే వైయస్‌ఆర్‌ సిపి మాత్రం ఒంటరిగానే పోరాడుతుంది. ఇటువంటి అనైతిక కలయికలకు మా నాయకుడు శ్రీ వైయస్ జగన్ వ్యతిరేకం. 



4)    రాజధాని పరిరక్షణ అంటూ ఇన్ని రోజుల పాటు మీరు చేసిన ఉద్యమం దేనికోసమో ప్రజలకు అర్థమవుతోంది. రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన మనుషులు కొనుగోలు చేసిన వేలాది ఎకరాలను కాపాడుకునేందుకు, వాటికి రేట్లు తగ్గిపోకుండా చూసుకునేందుకే ఈ ప్రయత్నమంతా. ఆనాడు శివరామకృష్ణ కమిటీ అమరావతి ప్రాంతం కృష్ణానదీపరివాహక ప్రాతం, ఇక్కడ ఎప్పుడైనా ముంపు ప్రమాదం పొంచి ఉందని, ఇక్కడ రాజధాని ప్రతిపాదనలు వద్దని చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు ఒక సారి నూజివీడు అని, మరోసారి ఇంకో చోట అంటూ రాజధానిపై అయోమయాన్ని సృష్టించి ప్రజలను మోసం చేసి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశాడు. ఇక్కడే వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారు. ఇప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం సీఎం శ్రీ వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో తమ భూములకు రేట్లు పడిపోతున్నాయని చంద్రబాబు, ఆయన అనుయులు ఆక్రోశంతో ఉన్నారు. ఇప్పుడు అక్కడ భూములు కొనుగోలు చేసే వారే లేకుండా పోయారు. నిరుత్సాహంతో ఉన్న తమ వారి కోసం చంద్రబాబు గొంతెత్తి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఈ భూములకు రేట్లు రావాలంటే రాజధాని ఇక్కడే ఉండాలని ఈ కుట్రపూరిత ఉద్యమం చేపట్టారు. తమ భూములకు రేట్లు వస్తే లక్ష కోట్లు, రెండు లక్షల కోట్లకు అమ్ముకుని లాభపడాలన్నదే వారి ఉద్దేశం.



5)    తిరుపతి సభలో చంద్రబాబు ఓపెన్‌గా మాట్లాడటం లేదు. అవును మేం అమరావతిలో వేల ఎకరాల భూములు కొనుగోలు చేశాం. అందుకే అక్కడే రాజధాని కావాలని కోరుతున్నాం. కోర్ట్‌లు కూడా మాకు మద్దతు ఇస్తున్నాయి అని చంద్రబాబు ప్రకటిస్తే మాకు అభ్యంతరం లేదు. ఆనాడు హైదరాబాద్‌లోనూ హౌటెక్‌ సిటి అని ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఒకే సామాజిక వర్గం అక్కడ భూములు కొనుగోలు చేసి కోట్లకు పడగలెత్తాయి. తిరిగి అమరావతిలో కూడా అలాగే చేయాలని చంద్రబాబు ప్రయత్నం. సీఎం శ్రీ జగన్ నిర్ణయంతో నష్టపోతున్నామని భావించి రైతుల పేరుతో ఈ ఉద్యమం చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి, ఈ భూముల రేట్లను పరిరక్షించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు అనుకుంటున్నట్లు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కోర్ట్ కూడా ఒకే రాజధానికి అనుకూలంగా తీర్పు ఇస్తుందని చంద్రబాబు చెప్పకనే చెబుతున్నాడు. న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్ర చేశామంటూ న్యాయస్థానంతో పాటు తిరుమల వెంకటేశ్వరస్వామి కూడా తమకే మద్దతు ఇస్తున్నారని చంద్రబాబు ఎలా చెప్పుకుంటున్నారు?


6)     ఈ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నాను. అమరావతి రైతుఉద్యమం అనేది బూటకమైనది. ఇక్కడ రైతులు ఎవరూ లేరు. ఇక్కడ అంతా కూడా అక్కడ భూములు కొన్న వ్యక్తులు, ఆ భూముల మీద రేట్లు పడిపోయాయనే నిరాశ, నిస్ప్రుహలతో ఉన్న వారు చేసిన ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర టిడిపి ఆధ్వర్యంలోనే జరిగిందని ఈ రోజు తేటతెల్లమవుతోంది. చంద్రబాబు, ఆయనతో కలిసిన తోకపార్టీల కలయితే అనైతికమైనది. వైయస్‌ఆర్‌ సిపిని దెబ్బతీయాలని, సీఎం శ్రీ వైయస్ జగన్ ను అధికారం నుంచి దూరం చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తులే ఆయా పార్టీల ప్రతినిధులుగా తిరుపతి సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి హాజరైన తులసీరెడ్డి ఆ పార్టీకి ఎప్పుడైనా సేవలు చేశారా, కాంగ్రెస్ లో ఆయన స్థానం ఏమిటీ, ప్రజల్లో కాంగ్రెస్ నేతగా ఆయనకు బలమైన మద్దతు ఉందా?  ఇలాంటి వ్యక్తులే అందరూ అక్కడ మాట్లాడుతున్నారు. రఘురామకృష్ణరాజు మా దగ్గర ఎంపీగా గెలిచి, మా నాయకుడినే విమర్శలు చేసి టిడిపి, బిజెపిలకు మద్దతుగా నిలిచాడు.  తన మీద ఉన్న కేసుల నుంచి బయటపడటానికోసం, బ్యాంకుల నుంచి మోసం చేసి వేల కోట్లు దోపిడీ చేసిన కేసుల నుంచి తనను తాను  కాపాడుకోవడం కోసం బిజెపితో జత కట్టాడు. ఇలాంటి వ్యక్తులు చంద్రబాబుతో కలిసి మాట్లాడుతున్నారంటే  ఈ ఉద్యమం ఎంత కుట్రపూరితమో అర్థమవుతోంది. వీరికి ఈ రాష్ట్రం మీద, ప్రజల మీద విశ్వాసం లేదు. కాబట్టే కేవలం ఉద్యమంను ఒక తంతుగా రెండు సంవత్సరాల పైన నడిపి, పాదయాత్ర పేరుతో తిరుపతికి వచ్చి, ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేశారు. 



7)     మూడు రాజధానులకే మా పార్టీ కట్టుబడి ఉంది. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు హైటెక్ సిటి క్రియేట్ చేసి కొందరినే కోటీశ్వరులను చేశాడు. అలా కాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోనూ అభివృద్ది జరగాలి, వెనుకబాటుతనం పోవాలనే మంచి ఉద్దేశంతో సీఎం శ్రీ వైయస్ జగన్ ఉన్నారు. దీనిపై తీవ్రంగా ఆలోచించే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు.  న్యాయ రాజధాని కర్నూలులో, శాసనరాజధాని అమరావతిలో, పరిపాలనా రాజధాని విశాఖపట్నంలోనే ఉంటుంది. మేము అనుకున్న దాని ప్రకారమే చేస్తాం. దీనిపై నిర్థిష్టమైన చట్టాన్ని రూపొందించి, మళ్ళీ శాసనపసభలో పెట్టి, ఆ తరువాత కేంద్రానికి పంపిస్తాం. 


8)     మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ...

అమర్ నాధ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు మా పార్టీ సింబల్‌తో గెలిచారు. తరువాత పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరి మంత్రి పదవులు చేపట్టారు. వీరికి సీఎం శ్రీ వైయస్ జగన్ ను గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. సిద్దాంతాల పరంగా పరస్పరం విరుద్దంగా ఉండే బిజెపి, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు కలవడమే అనైతికం. వారికి సీఎం శ్రీ వైయస్ జగన్‌ను ఎలా ఇబ్బంది పెట్టాలా అనేదే లక్ష్యం. గత ఎన్నికల్లో 151 సీట్లు, 50 శాతం ఓట్లు మా పార్టీకి వచ్చాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన శ్రీ వైయస్ జగన్ గారిని ఏమీ చేయలేవు. ఇక రఘురామకృష్ణరాజు చంద్రబాబులా అబద్దాలు చెప్పడంలో దిట్ట. నాటకీయంగా మాట్లాడుతూ ఆయన చేసే వ్యాఖ్యలు నీతిలేనివి.

Comments