పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణం కొనసాగబోతుంది

 

నెల్లూరు డిసెంబర్ 28 (ప్రజా అమరావతి):

ప్రతి పేదవాని సొంత ఇంటి కల నిజం చేయడానికి  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “నవరత్నాలు -పేదలందరికీ ఇళ్ళు' నిర్మాణంలో భాగంగా ప్రతి లేఅవుట్లో సిమెంటు, కంకర, ఇసుక తదితర నిర్మాణ సామాగ్రి నిల్వ ఉంచుకోవడానికి అనువుగా తాత్కాలిక గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నట్లుగా గృహ నిర్మాణానికి సంబంధించి నెల్లూరు చిత్తూరు జిల్లాల ప్రత్యేక అధికారి 

శ్రీ జి.వి.ప్రసాద్ తెలిపారు.

మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని శంకరన్ వి.సి. హాల్ లో జిల్లా గృహ నిర్మాణం సంయుక్త కలెక్టర్ శ్రీ విదేహ ఖరే తో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే వారంలో పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణం కొనసాగబోతుందని


తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని  ప్రతి రెండు జిల్లాలకు ఒక ప్రత్యేక అధికారి నియమించటం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో నిర్మాణ దశలో ఉన్న గృహాలను పరిశీలించామని, చిన్న చిన్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అందరు అధికారుల సమన్వయంతో ఇళ్ళ నిర్మాణం కొనసాగేట్టుగా కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో పునాది ఎక్కువ స్థాయిలో  నిర్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇందువల్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, లబ్దిదారులు అందరూ అవసరమైన మేరకు మాత్రమే స్థానిక ఇంజనీర్ల సహాయ సహకారాలతో నిర్మించుకోవలసిందిగా కోరారు. జిల్లాకు సంబంధించి 11 కోట్ల 46 లక్షలు నిధులు ఇటీవలే విడుదల చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 44,530 ఇళ్లకు గాను బిబిఎల్ స్టేజ్ లో 37668 ఇళ్లు ,పునాది దశలో 4532, రూఫ్ లెవెల్ దశలో 748 ,ఆర్ సి పౌండేషన్ దశ లో 1582 ఇల్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ద్వారా చెల్లింపులు వేగంగా జరుగుతున్నందున లబ్ధిదారుల మేళ నిర్వహిస్తే బాగుంటుందని తెలిపారు

జిల్లా సంయుక్త కలెక్టర్( గృహ నిర్మాణం) శ్రీ విదేహ్ ఖరే మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ఇసుక కొరత లేదన్నారు. ఇప్పటికే కావలి, సూళ్ళూరుపేట లలో ఇసుక డిపోలను ప్రారంభించామన్నారు. ప్రతి లేఅవుట్ దగ్గర నిర్మాణ సామాగ్రి నిల్వ ఉంచుకోవడానికి అనువుగా తాత్కాలిక గోడౌన్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల వంతున నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని లబ్ధిదారులు అందరూ తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్  శ్రీ వేణుగోపాల్ పాల్గొన్నారు